కీవ్: మానవీయ కారిడార్ల ప్రాంతాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో మంగళవారం వేలాది మంది ఉక్రేనియన్ పౌరులు దేశం విడిచివెళ్లారు. ఇప్పటికే 20 లక్షల మంది దేశం వదిలివెళ్లారని ఐరాస వర్గాలు చెబుతున్నాయి. పలు నగరాల్లో యుద్ధం కారణంగా నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. దీంతో చాలా నగరాల్లో ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యా. కాల్పులు, దాడులు కొనసాగడంతో వీరి ప్రయత్నాలు ఫలించలేదు. మంగళవారం కాల్పుల విరమణ కొనసాగడంతో చాలామంది ప్రాణాలరిచేతిలో పెట్టుకొని పారిపోవడం కనిపించింది.
మంగళవారం ఉదయం నుంచి తాత్కాలిక కాల్పుల విరమణ అమలు చేస్తున్నామని రష్యా అధికారులు, ఉక్రెయిన్ ఉప ప్రధాని ప్రకటించారు. సుమీ, మారిపోల్ నగరాల నుంచి ప్రజలు బస్సుల్లో తరలిపోతున్న వీడియోలను ఉక్రెయిన్ అధికారులు విడుదల చేశారు. మారిపోల్ జనాభా దాదాపు 4.3 లక్షలు కాగా సుమారు 2 లక్షల మంది తరలిపోవడానికి నిర్ణయించుకున్నారు.
ఒకరికి పదిమంది
రష్యా బలగాలను తమ సైనికులు ధైర్యంగా అడ్డుకుంటున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. అయితే ఒక్క ఉక్రెయిన్ సైనికుడికి ఎదురుగా 10 మంది రష్యన్ సైనికులుంటున్నారని, ఒక్క ఉక్రెయిన్ ట్యాంకుకు 50 రష్యా ట్యాంకులు ఎదురవుతున్నాయని చెప్పారు. యుద్ధ విమానాలందించాలన్న జెలెన్‌స్కీ అభ్యర్థనపై చాలా దేశాలు చర్చిస్తున్నాయని అమెరికా తెలిపింది. నైతికత మరిచిన రష్యా బలగాలు తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో లూటీలను ప్రోత్సహిస్తున్నాయని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆరోపించారు.
పలు నగరాల్లో తమ సైనికులు తీవ్ర ప్రతిఘటన చూపుతున్నారన్నారు. దేశంలో రెండో అతిపెద్ద నగరం ఖర్కివ్‌లో చాలాచోట్ల జనావాసాలపై బాంబింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు దాడుల్లో 406 మంది పౌరులు చనిపోయిఉంటారని ఐరాస అంచనా వేసింది. యుద్ధం ఆరంభమై రెండువారాలవుతున్న వేళ దక్షిణ ఉక్రెయిన్‌పై చాలావరకు రష్యా ఆధిపత్యం సాధించింది. కానీ రాజధాని కీవ్‌లో ప్రజలు, సైనికులు నగరాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చారు. చాలా చోట్ల చెక్‌పాయింట్లు, బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. కీవ్‌పై పట్టుకోసం రష్యా బలగాలు యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కీవ్ చుట్టుపక్కల ప్రాంతాలపై బాంబింగ్‌ను ముమ్మరం చేశాయి.
(చదవండి: నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్‌స్కీ డబుల్ గేమ్!)
Comments
Please login to add a commentAdd a comment