ప్రేమ జంటలకు పార్కుల్లో నో ఎంట్రీ! | No entry to lovers in park | Sakshi
Sakshi News home page

ప్రేమ జంటలకు పార్కుల్లో నో ఎంట్రీ!

Published Wed, Nov 26 2014 9:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

ప్రేమ జంటలకు పార్కుల్లో నో ఎంట్రీ!

ప్రేమ జంటలకు పార్కుల్లో నో ఎంట్రీ!

కిస్ ఆఫ్ లవ్ వివాదం ప్రేమ జంటల పాలిట శాపంగా మారుతోంది. కాసేపు పార్కుల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకునేందుకు ఇక తంటాలు పడాల్సిన పరిస్థితి. పార్కుల్లో పోలీసుల నిఘా పెరగటం ఇందుకు నిరద్శనం. ఈ నిఘా కాస్త గిల్‌నగర్ పార్కులో మంగళవారం వివాదానికి దారి తీసింది.
 
 సాక్షి, చెన్నై:కిస్ ఆఫ్ లవ్ పేరిట కొందరు విద్యార్థులు ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. ఉత్తరాదికి పరిమితమైన బహిరంగ ప్రదేశాల్లో ముద్దుల పోటీ దక్షిణాదికి పాకింది. చెన్నై ఐఐటీ విద్యార్థులు దీన్ని ప్రారంభించారు. ఇది వివాదానికి దారి తీసింది. ఓ వైపు ఆందోళనలు సాగుతుంటే, మరో వైపు కోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది. అదే సమయంలో మరికొన్ని కళాశాలల్లో విద్యార్థులు కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే పనిలో పడ్డారు. తమిళనాడులో అత్యధికంగా ్రైపైవేటు కళాశాలల్లో బయటి రాష్ట్రాల విద్యార్థులే చదువుకుంటున్నారు. దీంతో ముద్దుల పోటీ రాష్ట్రంలో చాప కింద నీరులా పాకుతోంది. కోయంబత్తూరులో నిర్వహించ తలబెట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే పనిలో పోలీసులు పడ్డారు. కిస్ ఆఫ్ లవ్...కిస్ ఆఫ్ లవ్ అన్న ఈ ప్రచారం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతుండడంతో ప్రేమ జంటల మీద అందరి దృష్టి పడింది. సాధారణంగానే కొన్ని చోట్ల అనేక జంటలు శ్రుతి మించి వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రచారం పుణ్యమా అని మరింతగా రెచ్చి పోవచ్చన్న సంకేతాలు బయల్దేరాయి.
 
 జంటలకు నో ఎంట్రీ: ఇన్నాళ్లు ఏ పార్కుల్లో బడితే ఆ పార్కుల్లో ప్రేమ జంటలు పెద్ద ఎత్తున కనిపించేవి. మెరీనా తీరంలో సాయంత్రం అయితే చాలు ప్రేమ జంటలే...జంటలు. కొన్ని జంటలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే, మరికొన్ని జంటలు సరదాగా కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్లి పోతుంటారుు. అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్లను ప్రశ్నించ లేని పరిస్థితి. బహిరంగ ప్రదేశాల్లో తమ ఇష్టం అని గర్జించే జంటలే అధికం. ఇక, ఈ కిస్ ఆఫ్ లవ్ పుణ్యమా అని నిజమైన ప్రేమ జంటలకు సైతం తంటాలు తప్పడం లేదు. చిన్న పిల్లల పార్కులు, వృద్ధుల వాకింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన పార్కుల్లో ఇక ప్రేమ జంటల్ని అనుమతించ కూడదన్న నిర్ణయానికి పోలీసులు వచ్చినట్టు తెలుస్తున్నది. కొన్ని జంటల తీరు పిల్లల మీద ప్రభావం చూపుతుందన్న భావనతో ఏకంగా జంటల మీద నిఘా పెట్టేందుకు సిద్ధమయ్యారు. పార్కుల్లోకి వచ్చే జంటలు అసభ్యకరంగా ప్రవ ర్తించకుండా క్లాస్ పీకేందుకు రెడీ అయ్యారు.
 
 వివాదం : చిల్డ్రన్స్ పార్కుల్లో జంటలకు అనుమతి లేదన్న అంశానికి అద్దం పట్టే ఘటన మంగళవారం గిల్ నగర్‌లో చోటు చేసుకుంది. జంటల్ని తరిమేందుకు పోలీసులు రావడం వివాదానికి దారి తీసింది. చెన్నై చూలై మేడు గిల్ నగర్‌లోని పార్కులో ఉదయం పోలీసులు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. అక్కడి జంటల్ని విచారించడం మొదలెట్టారు. కొందరు జంటలు పోలీసుల రాకతో పలాయనం చిత్తగించారుు. మరి కొందరు అయితే, తమకేం భయం అన్నట్టుగా అక్కడే కూర్చుండి పోయారు. కొన్ని జంటలు పోలీసుల మీద తిరగబడే యత్నం చేయడం వివాదాస్పదం అయింది. ఆ జంటల్ని విచారించే పనిలో పోలీసులు నిమగ్నం కావడంతో కాసేపు వాగ్యుద్ధం చోటు చేసుకుంది.
 
 కొందరు అయితే, ఆ జంటలకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో ఇక వివాదం పెద్దది అవుతుందన్న విషయాన్ని గ్రహించి పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. దీనిపై ఆ ప్రాంత పోలీసు ఇన్‌చార్జ్ అధికారి ఒకరిని ప్రశ్నించగా, గిల్ నగర్ పార్కులో పిల్లలు, వృద్ధులకు మాత్రమే ప్రవేశం ఉందన్నారు. ప్రేమ జంటలకు నో ఎంట్రీ అని స్పష్టం చేశారు. కొన్ని జంటలు లోనికి వెళ్లి శ్రుతి మించి వ్యవహరిస్తున్నాయని తమకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటప్పుడు తనిఖీలు చేయాల్సిందేగా? అని ఎదురు ప్రశ్న వేయడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement