వారణాసి: డేటింగ్‌కు వెళ్లిన ఓ ప్రేమజంట పార్కులో అసభ్యకర రీతిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. చివరికి పోలీసులు వారి పెద్దలను ఒప్పించి వివాహంతో ప్రేమజంటను ఒక్కటి చేశారు. వారణాసి సమీపంలోని బదౌరాలో బుధవారం ఈ వివాహం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముంబైకి చెందిన యుగల్ బిహారి ప్రజాపతి(25), రీనా ప్రజాపతి(23) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ జంట వారణాసికి వచ్చింది. అక్కడ కొన్ని ప్రదేశాలు సందర్శించిన యుగల్, రీనాలు బదౌరాలోని ఓ పార్కుకు వెళ్లారు.
కాసేపు కబుర్లు చెప్పుకున్న ప్రేమికులు.. చుట్టుపక్కల ప్రపంచాన్ని మరిచిపోయారు. ఎవరు ఏమనుకుంటే మాకేంటి అనే తీరుగా వ్యవహరిస్తూ పార్కులో కొందరు వ్యక్తులకు వీరు అసభ్యకర రీతిలో కనిపించారు. దీంతో ఆవేశానికి లోనైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జన్సా స్టేషన్ పోలీసులు పార్కుకు చేరుకుని ప్రేమజంటను పీఎస్‌కు తరలించారు. ఒకరంటే మరొకరికి ఇష్టమని, రెండేళ్లుగా ప్రేమించుకున్నామని చెప్పారు. దీంతో యుగల్, రీనా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడి వీరి పెళ్లికి ఒప్పించారు జన్సా స్టేషన్ ఇన్‌చార్జ్ అనిల్ కుమార్ సింగ్. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన పోలీసులు అదేరోజు(బుధవారం) ఈ ప్రేమజంటకు వివాహం జరిపించారు. వధువుకు కట్నకానుకలు అనే సమస్య లేకుండానే వివాహం జరిపించామని అనిల్ కుమార్ సింగ్ తెలిపారు.
వరుడు యుగల్ మాట్లాడుతూ.. నేను ముంబైలోని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నా పెళ్లి ఇలా జరుగుతుందని ఊహించలేదు. పోలీసులే మా పెళ్లికి పెద్దలుగా నిలిచి వివాహం జరిపించడం సంతోషంగా ఉంది. రీనాను తీసుకుని సంతోషంగా ముంబైకి వెళ్తాను. వచ్చే ఏడాది వివాహం చేసుకోవాలని డిసైడ్ కాగా, అంతకుముందే ఆనందక్షణాలు వచ్చాయంటూ హర్షం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment