సాక్షి, గద్వాల: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసు కున్న ఓ జంటపై యువతి కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లోనే దాడికి పాల్పడ్డ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన ప్రశాంత్, మండలంలోని పూడూరుకు చెందిన శిరీష ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇళ్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
ఈ క్రమంలో ప్రశాంత్ తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఇద్దరికీ వివాహం చేద్దామని యువతి తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఇద్దరి కులాలు వేరు కావడంతో అభ్యంతరం చెప్పారు. దాంతో మేజర్లయిన ప్రేమికులు ఈ నెల 8న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. 9న కర్నూలు జిల్లా పాలబుగ్గ సమీపంలోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చేందుకు, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ గద్వాల రూరల్ పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం చేరుకున్నారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం
పోలీసులు ఇరువురి కుటుంబసభ్యులను స్టేషన్‌కు పిలిపించి నచ్చజెప్పారు. అయితే యువతి కుటుంబసభ్యులు బలవంతంగా ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. ఆమె కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేసి యువకుడి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. పోలీసు సిబ్బంది అడ్డుకోగా.. వెంటనే రక్షణ కోసం సమీపంలోని ఎస్పీ కార్యాలయానికి రోడ్డు వెంట ఆ ప్రేమజంట పరుగులు తీసింది.
ఎస్పీ సృజన వద్దకు వెళ్లి జరిగిన విషయం వివరించారు. వెంటనే ఎస్పీ ఆ ఇద్దరూ మేజర్లు కావడంతో వారికి రక్షణ కల్పించే బాధ్యత పోలీస్‌శాఖపై ఉందన్నారు. భవిష్యత్‌లో వారిపై దాడి చేయడం, అవమానపర్చడం, విడదీసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment