నిందితుడు కార్తీక్
బంజారాహిల్స్: ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసిన అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లికి చెందిన కార్తీక్ ఆకుదా బెంగళూరులో గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేసేవాడు. యూసుఫ్‌గూడ బస్తీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగినితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరూ కలిసి కొన్నాళ్లు సహజీవనం చేశారు. అనంతరం పెళ్ళి కూడా చేసుకున్నారు. కాగా అంతకుముందే ఎనిమిదేళ్లుగా మరో యువతితోనూ సహజీవనం చేస్తున్న కార్తీక్ ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ వచ్చాడు.
తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతూ మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ మొదటి ప్రియురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలియడంతో అతడి భార్య అక్కడికి వెళ్లి భర్తను విడిపించింది. కాగా మొదటి ప్రియురాలు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి జైలుకు పంపిస్తానంటూ బెదిరించడంతో కార్తీక్ భార్యను దూరం పెడుతుండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అప్పటి నుంచి అతను ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు గత నెల 31న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని, భరోసా కేంద్రానికి పంపించారు. రెండోసారి భరోసా కేంద్రానికి హాజరుకాకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. తన భర్త కార్తీక్‌తో పాటు అతడి తండ్రి వెంకటేశం, తమ్ముడు నాగరాజు, స్నేహితుడు మనోజ్‌లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment