రాజకీయాల్లో మార్పు కోసం, అణగారిన వర్గాల హక్కుల్ని కాపాడడం కోసం ఒక కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. ఇదేదో ఒక వ్యక్తి కనుసన్నుల్లో నడిచే పార్టీ కాదు. మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా కొంత మంది ఐఐటీ నిపుణులు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఢిల్లీ, ఖరగపూర్‌కు చెందిన 50 మంది ఐఐటీ నిపుణులు బహుజన్ ఆజాద్ పార్టీ (బీఏపీ) పేరుతో ఒక కొత్త పార్టీ స్థాపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2015 సంవత్సరంలో ఢిల్లీ ఐఐటీలో పట్టా పొందిన నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ పార్టీ నడవబోతోంది. ’ పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 50 మంది నిపుణులు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కొత్త పార్టీ విధివిధానాలపై భారీగా కసరత్తు చేస్తున్నారు. మాకు కొందరు సివిల్ సర్వీసు అధికారులు కూడా బయట నుంచి మద్దతు ఇస్తారు‘ అని నవీన్‌కుమార్ తెలిపారు. పార్టీకి సేవలందించేవారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారేనని, అందుకే వాళ్ల స్థితిగతులపై తమకు చాలా అవగాహన ఉందని నవీన్‌కుమార్ వెల్లడించారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్రం ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదించారు.
2020 బిహార్ ఎన్నికల్లో పోటీ
అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఆప్ రాజకీయాల్లో ఒక సంచలనాన్ని సృష్టించినట్టే బహుజన్ ఆజాద్ పార్టీ (బాప్) ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మేధోమథనం జరుగుతోంది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత పోటీ చేసి, ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యా, న్యాయ రంగాల్లో అణగారిన వర్గాల పాత్ర చాలా పరిమితంగా ఉండడంతో వారి హక్కుల్ని కాపాడడంపైనే కొత్త పార్టీ ప్రధానంగా దృష్టి సారించనుంది.
స్వాగతిస్తున్న వివిధ వర్గాలు
రాజకీయాల్లో కుళ్లును కడిగేసే విధంగా ఒక ఉప్పెనలా కొత్త తరం రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దళితులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్న తరుణంలో వారి గళాన్ని వినిపించడం కోసం నవయువకులైన కొందరు ఐఐటీ నిపుణులు ముందుకు రావడంపై దళిత సంఘాలు, రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘. కొంతమంది ఐఐటీ నిపుణులు ప్రధాన రాజకీయాల్లోకి రావడం అభినందించాల్సిన విషయం. రాజకీయాల్లో దిగ్గజాలైన కాంగ్రెస్, బీజేపీతో పోరాటం కోసం కాకుండా, బహుజనుల అభ్యున్నతి కోసం పోరాటం సాగిస్తే ఆ రాజకీయ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని‘ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment