నూతన పార్టీ కోసం ఐఐటీ పూర్వ విద్యార్థులు రూపొందించిన పోస్టర్(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : రాజకీయాలంటేనే బురద..అందులోకి దిగడం అంటే ఊబిలోకి దిగినట్టే అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేవారు చాలా మందే ఉంటారు. కానీ మేము ఆ కోవకు చెందిన వాళ్లం కాదంటున్నారు ఐఐటీ పూర్వ విద్యార్థులు. తాము కేవలం మాటలకు పరిమితం కాదని.. లక్షల జీతాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధం అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘బహుజన్ ఆజాద్ పార్టీ’ పేరిట ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించామని బృంద నాయకుడు నవీన్ కుమార్ తెలిపాడు.
50 మందితో మా ప్రయాణం మొదలు..
ఐఐటీ పూర్వ పూర్వ విద్యార్థులైన 50 మంది బృందంగా ఏర్పడి రాజకీయ పార్టీ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చామని నవీన్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ పార్టీ రాజకీయ ప్రస్థానం మొదలుపెడతామని భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు.
బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయుల ఫొటోలతో కూడిన పోస్టర్ రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. తమ పార్టీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, సిద్దాంతపరంగా కూడా తమకు ఎవరితో విభేదాలు ఉండబోవని తెలిపారు. కాగా ఈ బృందంలో అత్యధిక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment