త్రీడీ ప్రింటెడ్ మానవ కార్నియాను అభివృద్ధి చేసిన పరిశోధక బృందం
బంజారాహిల్స్ (హైదరాబాద్): భారతదేశంలో మొదటిసారిగా త్రీడీ ప్రింటెడ్ మానవ కార్నియాను బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, సీసీఎంబీ, ఐఐటీ విద్యార్థులు అభివృద్ధి చేశారు. యుద్ధ సమయంలో సైనికులకు వ్యక్తిగతంగా కార్నియల్ గాయాలు తగిలినప్పుడు, లేదా తృతీయ నేత్ర సంరక్షణ సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల్లో కంటిచూపు అందించడానికి ఇది దోహదపడుతుంది. మేడిన్ ఇండియా ప్రొడక్ట్‌లో భాగంగా భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం కార్నియల్ అంధత్వానికి చవకైన పరిష్కారాన్ని అందజేసింది.
మానవదాత కార్నియల్ టిష్యూ నుంచి త్రీడీ ప్రింటెడ్ కార్నియాను ఈ బృందాలు అభివృద్ధి చేశాయి. ప్రభుత్వం, దాతృత్వ నిధుల ద్వారా దీన్ని దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇందులో సింథటిక్ భాగాలు జంతువుల అవశేషాలు లేకుండా రోగులకు ఉపయోగించడానికి సురక్షితమైనవిగా, సహజమైనవిగా ఈ ప్రొడక్ట్‌ను తయారు చేసినట్లు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చెందిన ప్రధాన పరిశోధకులు డాక్టర్ సయ్యన్ బసూ, డాక్టర్ వివేక్‌సింగ్ తెలిపారు. కార్నియా పారదర్శకంగా లేకుండా మారడం లేదా కార్నియా క్రమంగా సన్నగా మారడం వంటి వ్యాధుల చికిత్సలో అద్భుతమైన, చౌకగా అందించగలిగే ఆవిష్కరణ ఇది అన్నారు.
ఈ త్రీడీ ప్రింటెడ్ కార్నియా తయారు చేయడానికి ఉపయోగించే బయో ఇంక్, కార్నియల్ చిల్లులను మూసివేయడానికి, యుద్ధ సంబంధితమైన గాయాల సమయంలో ఇన్ఫెక్షన్ నిరోధించడానికి, గాయపడ్డ ప్రదేశంలో చూపు కోల్పోకుండా సహాయ పడుతుందని వెల్లడించారు. కార్నియా అనేది కంటి ముందు పొర అని, ఇది కాంతిని కేంద్రీకరించడంలో చూపు స్పష్టంగా ఉండటంతో సహాయ పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 మిలియన్లకు పైగా కొత్త కార్నియల్ బ్లైండ్‌నెస్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment