శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల విలీనం దిశగా సర్కారు అడుగులు
మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, సీతక్కతో కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం
వీలైనంత త్వరగా నివేదిక సమర్పించనున్న కమిటీ
ఈ ప్రక్రియ పూర్తయితే దేశంలో మరో పెద్ద నగరంగా ఆవిర్భవించనున్న హైదరాబాద్
జీహెచ్‌ఎంసీలో ఉన్న ఉప్పల్ పక్కనే పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లు.. వాటి పక్కనే కొర్రెముల గ్రామ పంచాయతీ...ఆ తరువాత పోచారం మున్సిపాలిటీ. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని పరిస్థితి ఇది. ఒక దగ్గర 60 ఫీట్ల రోడ్డు ఉంటే ఆ వెంటనే 40 ఫీట్ల రోడ్డు, డ్రైనేజీ.. ఆయా రోడ్లలో వరదనీటి కాలువల అనుసంధానమే లేదు. వివిధ సంస్థలు చేపట్టే పనులకు పొంతన ఉండట్లేదు. అందుకే ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న అర్బన్ పరిధిని ఒకే సంస్థ పరిధిలోకి తేవాలని నిర్ణయించాం. – ఇటీవల మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముంబై, ఢిల్లీ వంటి అతిపెద్ద నగరాల సరసన హైదరాబాద్ చేరబోతోంది. ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న ప్రాంతాన్ని ఒకే గొడుగు కిందకు తేవాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీని ఆనుకొని ఉన్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయితీలను కలిపి అతిపెద్ద కార్పొరేషన్‌గా రూపొందించాలని సీఎం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) పేరుతో ఇప్పటికే ఓ సంస్థను ఏర్పాటు చేశారు.
2,053 చదరపు కిలోమీటర్ల పరిధిలోని జీహెచ్‌ఎంసీతోపాటు శివారు పురపాలికలు, గ్రామాల్లో విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలను తొలగించడం, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలో కీలకంగా వ్యవహరించేలా ఈ సంస్థకు విధులు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, పురపాలికల్లో గ్రామాల విలీనానికి సంబంధించి సీఎం రేవంత్.. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్కతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వనుంది.
గ్రామాలు పురపాలికల్లో... ఆ తరువాత జీహెచ్‌ఎంసీలో జీహెచ్‌ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా రక్షణ శాఖ పరిధి నుంచి ప్రభుత్వ అ«దీనంలోకి వచి్చన సికింద్రాబాద్ కంటోన్మెంట్ 40.17 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. 2024 జనాభా అంచనాల ప్రకారం ఈ రెండింటిలో కలిపి 1.06 కోట్ల జనాభా ఉంది. ఇవి కాకుండా శివార్లలోని బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీని ఆనుకొని ఓఆర్‌ఆర్ లోపలే ఉన్నాయి.
వాటితోపాటు మరో 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. విలీన ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పాలకమండళ్ల పదవీకాలం ముగిసిన పంచాయతీలను వాటికి సమీపంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయనున్నారు. ఆయా గ్రామాలను పురపాలికల్లో కలిపిన అనంతరం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ పూర్తికానుంది.
ఓఆర్‌ఆర్ ఆవల ఉన్న కొన్నింటిని కూడా...
హైడ్రా ప్రాజెక్టులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతోపాటు సంగారెడ్డి జిల్లా పరిధిలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీలు, ఓఆర్‌ఆర్ అవతల ఉన్న ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, దుండిగల్ వంటి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను కూడా కలిపారు. 33 గ్రామ పంచాయతీల్లో ఓఆర్‌ఆర్ ఆవల సైతం కొన్ని గ్రామాలు ఉన్నాయి. అయితే జీహెచ్‌ఎంసీలో వాటి విలీనం ఉంటుందా ఉండదా అనే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం తేలుస్తుందని ఓ అధికారి తెలిపారు.
విలీనమైతే భారీ నగరాల చెంతన
ఓఆర్‌ఆర్ లోపలి పట్టణాలు, గ్రామాలు జీహెచ్‌ఎంసీలో విలీనమైతే ‘హైడ్రా’పరిధిలో జనాభా 1.29 కోట్లకు చేరుతుంది. గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం)లో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1.24 కోట్లుకాగా తాజా అంచనాల ప్రకారం ఈ జనాభా 1.75 కోట్లకు చేరవచ్చని తెలుస్తోంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీబీ) జనాభా కూడా 2011 లెక్కల ప్రకారం 1.10 కోట్లుగా ఉండగా తాజా లెక్కల్లో కోటిన్నరకు చేరుకొనే అవకాశం ఉంది.
బృహత్ బెంగుళూరు (బీబీఎంపీ) జనాభా (2011 లెక్కలు) 68 లక్షలుకాగా జీహెచ్‌ఎంసీలో జనాభా 2011 లెక్కల ప్రకారం 69.93 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు విలీనమైతే ముంబై, ఢిల్లీ తరహాలో అధిక జనాభాగల నగరాల సరసన చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment