మెక్‌ డొనాల్డ్స్‌ గ్లోబల్‌ ఆఫీసు హైదరాబాద్‌లో.. | McDonalds GCC office in Hyderabad with 2000 employees | Sakshi
Sakshi News home page

మెక్‌ డొనాల్డ్స్‌ గ్లోబల్‌ ఆఫీసు హైదరాబాద్‌లో..

Published Thu, Mar 20 2025 4:08 AM | Last Updated on Thu, Mar 20 2025 4:08 AM

McDonalds GCC office in Hyderabad with 2000 employees

2000 మంది ఉద్యోగులతో మెక్‌ డొనాల్డ్స్‌ జీసీసీ కార్యాలయం 

అసెంబ్లీలో సీఎం కార్యాలయంలో ప్రభుత్వంతో కీలక ఒప్పందం 

వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతుల నుంచి కొనాలని కోరిన సీఎం రేవంత్‌ 

బెంగళూరు కంటే హైదరాబాద్‌లో మెరుగైన సదుపాయాలున్నాయన్న మెక్‌ డొనాల్డ్స్‌ సీఈవో  

తెలంగాణలో ఏటా మూడు నాలుగు కొత్త ఔట్‌లెట్లు ప్రారంభిస్తామని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాకు చెందిన మెక్‌ డొనా ల్డ్స్‌ సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రం (జీసీసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బుధవారం శాసనసభలోని సీఎం కార్యాలయంలో జీసీసీ విభాగం చైర్మన్, సీఈవో క్రిస్‌ కెంప్కెజెస్స్కెతోపాటు గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్‌ గ్లోబల్‌ ఇంపాక్ట్‌ ఆఫీసర్‌ జాన్‌ బ్యానర్, గ్లోబల్‌ ఇండియా హెడ్‌ దేశాంత కైలా సమావేశంలో పాల్గొన్నారు. 

అనంతరం ఒప్పందంపై సంతకాలు చేశారు. సుమారు 2000 మంది ఉద్యోగులతో మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా సంస్థ గ్లోబల్‌ ఆఫీసును నెలకొల్పనుంది. ఈ కేంద్రాన్ని తమతమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీపడినప్పటికీ. మెక్‌డొనాల్డ్‌ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమున్న ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వర్సిటీని స్కిల్‌ జోన్‌గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్‌ ఆఫీస్‌లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్‌లెట్లలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. 

మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.  

హైదరాబాద్‌లో ప్రతిభావంతులు: సీఈవో 
బెంగళూరు లాంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్‌ డొనాల్డ్స్‌ సీఈవో క్రిస్‌ కెంప్కెజెస్స్కె అన్నారు. అందుకే హైదరాబాద్‌ను తమ గ్లోబల్‌ ఇండియా ఆఫీస్‌ సెంటర్‌గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మెక్‌ డొనాల్డ్స్‌ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.

ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌లెట్లు ఉన్నాయని, ప్రతి ఏటా 3, 4 కొత్త ఔట్‌లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయని తెలిపారు. గ్లోబల్‌ ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement