Cornea
-
నేత్రదానం.. ఎవరు చేయొచ్చు?.. కార్నియా ఎన్ని గంటల్లోపు...
సాక్షి, తూర్పుగోదావరి: వ్యక్తి మరణించిన తర్వాత కళ్లను దానం చేస్తే.. ఆ కళ్లు మరొకరి జీవితంలో వెలుగును ప్రసాదిస్తాయి. దాతల కళ్లు పునర్జన్మను సంతరించుకుని అంధకారాన్ని పారదోలే కాంతిపుంజంగా మారుతాయనడంలో సందేహం లేదు. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటారు. అంతటి ప్రధానమైన కళ్లను మరణించాక మట్టిపాలు చేసేకంటే, దానం చేయడం ఉత్తమం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకూ జాతీయ 37వ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. నేత్ర దానం ప్రాధాన్యం, ఆవశ్యతకను ప్రజలందరికీ తెలియజేయడం, ఔత్సాహికులకు దిశానిర్దేశం చేయడం ఈ పక్షోత్సవాల ముఖ్యోద్దేశం. కార్నియాల అవసరానికి, సేకరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి ఈ సందర్భంగా ప్రయత్నిస్తారు. కార్నియా ద్వారా అంధత్వానికి గురి కాకుండా ప్రజలను అప్రమత్తం చేయడం. ప్రజలను నేత్రదానానికి సన్నద్ధం చేయడం కూడా ఈ పక్షోత్సవాల్లో లక్ష్యాల్లో కొన్ని. కార్నియా దెబ్బతిని చూపు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. నేత్రదానం చేసే వారి సంఖ్య మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. ఈ వ్యత్యాసం ఏడాదికేడాదీ పెరుగుతోంది. నేత్ర దానానికి ముందుకు వచ్చిన వారిలో కొందరు మృత్యువాత పడిన సమయానికి వారి కళ్లను దానం చేయలేకపోతున్నారు. కొందరు బాధ, దుఃఖంలో మర్చిపోతే, మరికొందరి కళ్లను బంధువులు, కుటుంబ సభ్యులు మూఢనమ్మకాలతో దానం చేయడానికి ఇష్టపడడం లేదు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ లెక్కల ప్రకారం 2017 నుంచి ఇప్పటి వరకూ 2,611 మంది నుంచి కార్నియాలు సేకరించగా, 2,267 మందికి అమర్చారు. ఇది మరింత పెరగాలని, నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 40 శాతం మందికి కార్నియా సమస్యలు ►కంటి ముందు నల్లటి భాగాన్ని కప్పి ఉంచే పొరను కార్నియా అంటారు. ఏటా వందల మంది కార్నియా అంధులుగా మారుతున్నారు. ►వీరిలో 35 శాతం మంది యువతీ యువకులు, ఐదు శాతం చిన్నపిల్లలే. ►విటమిన్–ఎ లోపం, పౌష్టికాహార లేమి, ప్రమాదాలు, గాయాలు, శస్త్రచికిత్సలతో వచ్చే ఇన్ఫెక్షన్లతో కార్నియా అంధత్వం వస్తుంది. ►దీర్ఘకాలిక కాంటాక్ట్ లెన్స్ వాడే వారిలో కూడా కార్నియా అంధత్వం ఏర్పడే అవకాశముంది. ►కార్నియా అంధత్వానికి కార్నియా మార్పిడే మార్గం. ఆరు గంటల్లో సేకరించాలి మనిషి మరణిస్తే ఆరు గంటల్లోగా శరీరం నుంచి కార్నియాను సేకరించాలి. నేత్రదానం అనేది 15–20 నిమిషాల్లో పూర్తయ్యే సామాన్య ప్రక్రియ. మరణించిన వారి నుంచి కేవలం కార్నియాను మాత్రమే తీసుకుంటారు. మొత్తం కంటిని కాదనే విషయాన్ని గమనించాలి. చాలా మందిలో కన్ను మొత్తాన్ని తీసుకుంటారన్న అపోహ ఉంది. అది అవాస్తవం. నేత్రదానం తర్వాత ఎలాంటి వికృతం ఉండదు. ఎందుకంటే కళ్లను తొలగించిన వెంటనే సహజమైన కన్నుల మాదిరిగా కనిపించే కృత్రిమ కన్నులను వెంటనే మృతదేహానికి అమరుస్తారు. దీనివలన అంతిమ సంస్కారాలకు ఇబ్బంది ఉండదు. ముందుగా ఐ బ్యాంక్ వారికి సమాచారం ఇవ్వాలి. వారు వచ్చేలోగా నేత్ర దాత రెండు కనురెప్పలను మూసివేసి, దూది లేదా మెత్తటి వస్త్రాన్ని వాటిపై కప్పి ఉంచాలి. మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో పెట్టినా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాన్ గాలి కింద మృతదేహాన్ని ఉంచరాదు. ఆర్కే ద్రావకంలో సేకరించిన కార్నియాను భద్రపర్చి 28 రోజుల్లోగా వాడుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు మొదలు.. 18 ఏళ్లు నిండిన వారు వయస్సుతో సంబంధం లేకుండా నేత్రదానం చేయొచ్చు. ఏ వయస్సు వారైనా, కంటి అద్దాలు ధరించిన వారైనా, షుగర్ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు ఉన్న వారైనా మరణానంతరం నేత్రదానం చేయొచ్చు. ప్రమాదవశాత్తూ, గుండె జబ్బులు తదితర దీర్ఘకాలిక జబ్బులతో మరణించిన వారు, సహజ మరణం పొందిన వారు నేత్రదానం చేసేందుకు అర్హులు. ఎవరు అనర్హులంటే.. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు, హెచ్ఐవీ, కామెర్లు, కుష్ఠు వ్యాధి, రుబెల్లా, సిఫిలిస్ వంటి వ్యాధిగ్రస్తులు, కరోనా పాజిటివ్, హెపటైటిస్ ఉన్న వారు నేత్రదానానికి అనర్హులు. పాము, కుక్క కాటు వల్ల మరణించిన వారు, కంటి పాపపై తెల్లని మచ్చలు, కంటిలో నీటి కాసుల వ్యాధి ఉన్న వారు కూడా అనర్హులు. అవగాహన కల్పిస్తున్నాం కలెక్టర్ హిమాన్షు శుక్లా నేతృత్వంలో నేత్రదానంపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. మృతి చెందిన ప్రతి ఒక్కరి కళ్లకు సంబంధించిన కార్నియాను తీసుకుని అమరిస్తే ఇద్దరికి చూపు వస్తుంది. నేత్రదానానికి ప్రజలు ముందుకు వస్తున్నా.. మృతి చెందిన సమయంలో పలు కారణాలతో నేత్రాల సేకరణపై సమాచారం ఇవ్వడం లేదు. మరికొందరు ముందస్తు సమాచారం ఇవ్వకున్నా, మృతి తర్వాత మరో ఇద్దరికి చూపునివ్వాలని కళ్లను దానం చేస్తున్నారు. – డాక్టర్ మల్లికార్జునరాజు, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, అమలాపురం కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగే ఆస్పత్రులివే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కాకినాడ శ్రీకిరణ్ కంటి ఆస్పత్రి, రాజమహేంద్రవరం గౌతమీ నేత్రాలయంలో కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు. అలాగే కాకినాడ నయన, రాజమహేంద్రవరం అకిరా ఆస్పత్రుల్లో కూడా కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ద్వారానే కార్నియాలను గత పదేళ్లుగా సేకరిస్తున్నారు. -
స్వదేశీ త్రీడీ ప్రింటెడ్ మానవ కార్నియా
బంజారాహిల్స్ (హైదరాబాద్): భారతదేశంలో మొదటిసారిగా త్రీడీ ప్రింటెడ్ మానవ కార్నియాను బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, సీసీఎంబీ, ఐఐటీ విద్యార్థులు అభివృద్ధి చేశారు. యుద్ధ సమయంలో సైనికులకు వ్యక్తిగతంగా కార్నియల్ గాయాలు తగిలినప్పుడు, లేదా తృతీయ నేత్ర సంరక్షణ సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల్లో కంటిచూపు అందించడానికి ఇది దోహదపడుతుంది. మేడిన్ ఇండియా ప్రొడక్ట్‌లో భాగంగా భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం కార్నియల్ అంధత్వానికి చవకైన పరిష్కారాన్ని అందజేసింది. మానవదాత కార్నియల్ టిష్యూ నుంచి త్రీడీ ప్రింటెడ్ కార్నియాను ఈ బృందాలు అభివృద్ధి చేశాయి. ప్రభుత్వం, దాతృత్వ నిధుల ద్వారా దీన్ని దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇందులో సింథటిక్ భాగాలు జంతువుల అవశేషాలు లేకుండా రోగులకు ఉపయోగించడానికి సురక్షితమైనవిగా, సహజమైనవిగా ఈ ప్రొడక్ట్‌ను తయారు చేసినట్లు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చెందిన ప్రధాన పరిశోధకులు డాక్టర్ సయ్యన్ బసూ, డాక్టర్ వివేక్‌సింగ్ తెలిపారు. కార్నియా పారదర్శకంగా లేకుండా మారడం లేదా కార్నియా క్రమంగా సన్నగా మారడం వంటి వ్యాధుల చికిత్సలో అద్భుతమైన, చౌకగా అందించగలిగే ఆవిష్కరణ ఇది అన్నారు. ఈ త్రీడీ ప్రింటెడ్ కార్నియా తయారు చేయడానికి ఉపయోగించే బయో ఇంక్, కార్నియల్ చిల్లులను మూసివేయడానికి, యుద్ధ సంబంధితమైన గాయాల సమయంలో ఇన్ఫెక్షన్ నిరోధించడానికి, గాయపడ్డ ప్రదేశంలో చూపు కోల్పోకుండా సహాయ పడుతుందని వెల్లడించారు. కార్నియా అనేది కంటి ముందు పొర అని, ఇది కాంతిని కేంద్రీకరించడంలో చూపు స్పష్టంగా ఉండటంతో సహాయ పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 మిలియన్లకు పైగా కొత్త కార్నియల్ బ్లైండ్నెస్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. -
అసలే వేసవి, ఆపై కంప్యూటర్ కాలం.. కళ్లు ‘కళ’ తప్పితే.. చిన్న వయసులోనే!
సాక్షి, పార్వతీపురం: కళ్లు నిత్యం తడిగా ఉంటాయి.. కంటినిండా నీరు ఉంటుంది.. ఒక విధంగా చెప్పాలంటే నేత్రాలు నిండు జలాశయాలు వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యం కారణంగా కంటిలో తడి ఆరిపోతోంది. నేత్ర వ్యాధులు అధికమవుతున్నాయి. చివరకు చూపు మసకబారుతోంది. అన్ని ఇంద్రియాల్లో కంటే కన్ను చాలా విలువైనది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు కలకాలం చల్లాగా ఉండాలి. చూపు శాశ్వతమవ్వాలి. కానీ మనిషి దుష్ప్రవర్తన కారణంగా కంటి సమస్యలు ఏర్పడి పిన్న వయస్సులోనే అంధత్వం ఏర్పడుతోంది. మనిషి నిమిషానికి ఎనిమిది సార్లు కంటి రెప్పలు ఆర్పుతుంటాడు. అలా చేయడం ద్వారా కార్నియాకు అవసరమైన నీరు చేరి కళ్లు ఎండిపోకుండా చేస్తాయి. వేసవి ప్రయాణాల్లో వేడి గాలులకు కళ్లు తడి ఆరిపోయి దురదలు ప్రారంభమవుతున్నాయి. వేసవి ప్రయాణాల్లో కంటి రెప్పలు నిమిషానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే కొట్టుకుంటున్నాయని వైద్యులు ఒక సర్వేలో పేర్కొన్నారు. ఫలితంగా కంటి సమస్యలు వచ్చి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తలనొప్పి వంటివి కూడా వస్తున్నాయని వెల్లడించారు. చదవండి👉🏼 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! అధిక వినియోగం ముప్పు.. ప్రస్తుతం సాంకేతికత రాజ్యమేలుతోంది. అన్ని చోట్లా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ప్రతి పది మందిలో తొమ్మిది మందికి పైగా ప్రజలు మొబైల్ వినియోగిస్తున్నారు. నిత్యం కంప్యూటర్‌తో వర్క్ చేయడం, మొబైల్ ఆపరేటింగ్‌లో తలమునకలవ్వడం కారణంగా కళ్లు పొడిబారి పోతున్నాయి. ప్రస్తుతం ప్రతి 100 మందిలో 60 నుంచి 70 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 99 శాతం మంది కార్నియ సమస్యలకు గురవుతున్నారు. వేడిగాలుల బారిన పడడం, ఆండ్రాయిడ్, కంప్యూటర్ వినియోగించడం, రాత్రి 12 గంటల వరకు సెల్‌ఫోన్‌తో గడపడం కారణంగా ఈ సమస్య వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. 15 నుంచి 40 ఏళ్ల మద్య ఉన్నవారే అధికంగా ఈ సమస్యకు గురవుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. చదవండి👉🏻 నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి! సాధారణ కన్ను పొడిబారిన కన్ను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► వేసవిలో ప్రయాణించే వారు తప్పనిసరిగా కళ్లజోడు ధరించాలి. ► ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగం తగ్గించుకోవాలి. ► కంప్యూటర్ల వద్ద గంటలకొద్దీ గడపరాదు. ► కంటి రెప్పలు ఎక్కువసార్లు కొట్టుకొనే విధంగా ప్రయత్నించాలి. ► తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ► కంటికి దురదలు వచ్చే సమయంలో చేతితో నలపరాదు ► కళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చదవండి👉🏾 చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స అవగాహన తప్పనిసరి రోజురోజుకూ కంటి సమస్యలు అధిగమవుతున్నాయి. 70 శాతం మంది కంటి రోగాలతో బాధపడుతున్నారు. ఇవి చిన్నవైనప్పటికీ జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో బయట ప్రయాణాలు వద్డు. ఆండ్రాయిడ్ మొబైల్‌ను చిన్నారులకు ఇవ్వరాదు. టీవీ, సెల్‌ఫోన్, కంప్యూటర్ వాడే సమయంలో అరగంట కొకసారి ప్రతి పది నిమిషాలకు ఒకసారి విరామం ఇవ్వాలి. ఏవైనా కంటి సమస్యలు వస్తే నేరుగా వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ జీరు నగేష్‌రెడ్డి, వైఎస్సార్ కంటి వెలుగు జిల్లా ఇన్చార్జ్, పార్వతీపురం మన్యం -
కాంటాక్ట్‌లెన్స్‌తో నిద్రపోవడం ప్రమాదకరం
వాషింగ్టన్: నిద్ర పోయేటప్పుడు కాంటాక్ట్‌లెన్స్ తీయకుండా అలాగే ఉంచడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాంటాక్ట్‌లెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కార్నియాకు ఇన్ఫెక్షన్స్ సోకుతుందంటున్నారు అమెరికాలోని న్యూమెక్సికో యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాన్ ఫెమ్లింగ్. ‘కాంటాక్ట్‌లెన్స్‌తో నిద్రపోవడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి.. శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్, కళ్ల సంబంధ సమస్యలు రాకూడదంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన పరిష్కారం’అని ఆయన పేర్కొన్నారు. -
కళ్ల సమస్యలకు చెక్!
కళ్ల సమస్యలు వచ్చినా... అక్షరాలు లేదా వస్తువులు సరిగా కనిపించకపోయినా డాక్టర్ కళ్ల జోడు వాడాలని సూచిస్తారు. వాటివల్ల కంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని కాదు.. కాస్త ఉపశమనం కలుగుతుంది అంతే. కాటరాక్ట్ శస్త్రచికిత్స కానీ లెన్స్ వాడటం వల్ల, లేజర్ చికిత్స వల్ల కాస్త కంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే వీటన్నింటి సాయం అవసరం లేకుండానే కంటి చుక్కల మందు సాయంతో సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు. అంతేకాదు ఉన్న సమస్యలను కూడా తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకోసం తాము ఓ ప్రత్యేకమైన కంటి చుక్కల మందు తయారు చేసినట్లు ఇజ్రాయెల్ టెల్ అవీవ్‌లోని బార్ ఇలాన్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానోటెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ శాస్త్రవేత్తలు తెలిపారు. తామే తయారు చేసిన చుక్కల మందుతో కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చిన స్పష్టం చేస్తున్నారు. ‘రిఫ్రాక్టరీ సమస్యలను సరిచేసేందుకు తాము ఓ వినూత్న పద్ధతిని కనుగొన్నాం’ అని కంటి వైద్య నిపుణుడు డా.డేవిడ్ స్మద్జ తెలిపారు. ఈ మందు వేసిన పందుల కార్నియా సమస్యలు చాలా వరకు తొలగిపోయాయని తమ పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు. దూరదృష్టి, హ్రస్వ దృష్టి సమస్యలు తొలగిపోయాయని వివరించారు. అయితే మానవులపై వచ్చే నెలలో క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉందని చెప్పారు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి మరి! -
చల్లని చూపు... 2019లోపు
రాష్ట్రంలో కంటి వ్యాధుల నివారణకు వైద్య శాఖ ప్రణాళిక - వ్యక్తుల వారీగా వివరాల సేకరణ - మొదటి దశలో 10 జిల్లాల్లో అమలు - 550 గ్రామాల్లో వివరాల సేకరణ - మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి సాక్షి, హైదరాబాద్: కంటి చూపు సమస్యల నివారణపై కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2019లోపు రాష్ట్రంలో కంటి చూపు సమస్య ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. ‘అంధత్వ రహిత తెలంగాణ (అవైడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ)’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కంటి వైద్యంలో ప్రఖ్యాతి పొందిన... స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంటి చూపు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చిన్నపిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. ఏటా కంటి చూపు సమస్యలకు గురవుతున్న వారిలో 60 శాతం మంది 12 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. భవిష్యత్తుతరం జీవనానికి ప్రమాదకరంగా మారుతున్న కంటి చూపు సమస్యల నివారణపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. కార్నియా సమస్యలతో ఇబ్బందిపడే వారిని గుర్తించి చికిత్స చేయించేలా కార్నియా అంధత్వ్ ముక్తి భారత్ అభియాన్(కాంబా) కార్యక్రమాన్ని చేపట్టింది. మన రాష్ట్రంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ విషయంలో మరింత విస్తృతంగా ఆలోచించింది. కార్నియా సమస్యతోనే కాకుండా... రెటీనా, గ్లుకోమా, మధుమేహం.. ఇతర సమస్యలతోనూ కంటిచూపు కోల్పోతున్న వారికి వైద్యపరంగా అండగా ఉండాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని ప్రతి వ్యక్తి కంటి చూపు సమస్యలను తెలుసుకునేలా ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో 10 జిల్లాలను ఎంపిక చేసింది. ఈ జిల్లాల్లోని 550 గ్రామాల్లో వ్యక్తుల వారీగా కంటి చూపు సమస్యలను తెలుసుకుంటారు. వారికి అవసరమైన వైద్య సేవలను వెంటనే అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుంది. స్థానిక ఆస్పత్రులలో చికిత్స చేయించడం నుంచి ఇది మొదలవుతుంది. సమస్య తీవ్రత ఆధారంగా... ఆయా వ్యక్తులకు జిల్లా స్థాయి ఆస్పత్రులలో, హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్, ఆనంద్, పుష్యగిరి, శరత్ ఆస్పత్రులలో చికిత్స చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల వైద్య చికిత్స పథకాలను వీరికి వర్తింపజేయనున్నారు. ఇదే తరహాలో 2018లో మరో 10 జిల్లాల్లో, 2019లో మిగతా 10 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దానంతోనే చూపు... ఒక్కరు నేత్రదానం చేస్తే ఇద్దరు వ్యక్తులకు చూపు వస్తుంది. ఏ వయస్సు వారైనా నేత్రదానం చేయవచ్చు. వ్యక్తి చనిపోయిన ఆరు గంటలలోపు కార్నియా సేకరించాలి. శిక్షణ పొందిన వైద్యుడు మాత్రమే కార్నియా సేకరించి తిరిగి అమరుస్తాడు. నేత్ర బ్యాంకు బృందం... మరణించిన వ్యక్తి ఇంటి వద్ద, ఆస్పత్రిలో, మార్చురీ వద్ద, స్మశాన స్థలాల్లోనూ కార్నియాను సేకరిస్తుంది. గరిష్టంగా 15 నిమిషాలలో కార్నియా సేకరించే ప్రక్రియ ముగుస్తుంది. కార్నియా సేకరణతో వ్యక్తి రూపురేఖలు ఏమీ మారవు. కంటిపై పొరను మాత్రమే తొలగిస్తారు. చాలా మంది అపోహపడుతున్నట్లు పూర్తిగా కనుగుడ్డును తీయరు. దేశంలో కార్నియా అవసరమైన వారు 2 లక్షలు ఏటా కార్నియా సమస్యవల్ల అంధత్వానికి గురవుతున్న వారు 20 వేలు 45 ఏళ్లలోపు వారు 90శాతం వీరిలో 12 ఏళ్ల లోపు వారు 60 శాతం మొదటి విడతలో ఏబీఎఫ్‌టీ అమలు చేసే గ్రామాలు జిల్లాల వారీగా.. -
ఏడాదిలో 2,043 కార్నియా మార్పిడులు
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి అరుదైన ఘనత: చైర్మన్ గుళ్లపల్లి హైదరాబాద్: ఏడాది వ్యవధిలో 2,043 కార్నియా మార్పిడులు చేసి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సరికొత్త రికార్డు సృష్టించిందని సంస్థ చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 24 వేల కార్నియా మార్పిడులు చేసినట్లు వెల్లడించారు. గత 27 ఏళ్లుగా కార్నియాల సేకరణ, మార్పిడి, కార్నియా వ్యాధులకు స్టెమ్‌సెల్ ఆధారిత చికిత్స తదితర విధానాల్లో తమ సంస్థ అహర్నిశలు శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. అలాగే సంస్థకు భారీ విరాళాలు అందజేసిన దాత తేజ్ కోహ్లీని ఆయన ప్రశంసించారు. -
చనిపోయినా.. కను‘గుడ్’
అమ్మానాన్నలు.. తోబుట్టువులు.. బంధువులు..స్నేహితులు..ఇలా అంతా ఉన్నా.. ఆరోగ్యంగానే ఉన్నా.. చూపులేనికారణంగా అంధులు అన్ని ఆనందాలకు దూరమవుతారు. నిత్యం ఆవేదనలో మునిగిపోతారు. జన్యులోపాలు లేదా పుట్టుకతో అంధులుగా మారినవారు.. ప్రమాదాల్లో కార్నియా పోగొట్టకున్నవారు వెలుగు చూడకుండా బతుకుతున్నారు. వీరిలో చాలామందికి చూపు తెప్పించే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కావాల్సిందే చనిపోయినవారి నేత్రాలు సేకరించి అమర్చడమే! దురదృష్ట వశాత్తు నేత్రదానంపై నేటి సమాజంలో ఇప్పటికీ పూర్తిస్థాయి చైతన్యం కలగలేదు. ప్రస్తుతం దేశంలో లక్షలాదిమంది కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారు. రోజూ ఎంతోమంది లోకం విడిచివెళుతున్నా.. కేవలం 20 వేలకు మించి కార్నియాలు లభ్యం కావడంలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయితే 1575 కార్నియాలే సేకరించగలుగుతున్నారు. నేత్రదానం వీరు చేయవచ్చు.. ఏనిమిదేళ్ల నుంచి 80 ఏళ్ల వయసున్న వ్యక్తులు చనిపోయిన సందర్భాల్లో వారి నుంచి కార్నియాలను సేకరించవచ్చు. శుక్లాలు ఉన్నవారు, కంటి ఆపరేషన్ చేయించుకున్నవారివి కూడా పనికొస్తాయి. అయితే కార్నియా దెబ్బతినకుండా ఉండాలి. మధుమేహం, గుండెజబ్బులు, చత్వారం ఉన్నవారు సైతం నేత్రదానం చేయవచ్చు. ప్రమాదాల్లో, అనుమానాస్పదంగా మరణించిన వారి నుంచి చట్టపరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కార్నియా సేకరించే అవకాశం ఉంటుంది. వీరు అనర్హులు పిచ్చి కుక్కు కరచి.. ర్యాబిస్ వ్యాధితో మరణించవారి నుంచి కార్నియాలు సేకరించకూడదు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు.. కారణం తెలియకుండా మరణించవారి నేత్రాలు కూడా పనికిరావు. క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులతో మరణించిన వారి నుంచి కార్నియాలు సేకరించకూడదు. -
ముందు‘చూపే’ మేలుకొలుపు
దేశవ్యాప్తంగా ప్రతి సెకన్‌కు ఒక శిశువు జన్మిస్తుండగా, నిమిషానికి ఒక శిశువు చూపు కోల్పోతుంది. ఏటా కోటి మందికి పైగా మృత్యువాత పడుతుంటే.. వీరిలో రెండు శాతం మంది కూడా నేత్రాలను దానం చేసేందుకు ముందుకు రావ ట్లేదు. ‘ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఏటా లక్ష మంది కార్నియా మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తుండగా, 37 వేలకు మించి దొరకడం లేదు. సేకరించిన కార్నియాల్లో 50 శాతం మాత్రమే ఉపయోగపడుతున్నాయి. దీంతో వేలాది మంది కార్నియా మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 20 వేల మంది ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, సిటీబ్యూరో: దృష్టి మందగిస్తోంది. బాల్యం నుంచే చూపు ‘మసక’బారుతోంది. దృష్టిలోపం నగరవాసిని వెంటాడుతోంది. పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారి కన్ను సైతం ‘జోడు’ కావాలంటోంది. రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం.. రోజంతా కంప్యూటర్లకు, టీవీలకు అతుక్కపోవడం.. చీకటి గదుల్లో పాఠాలు బోధిస్తుండటం.. పోషకాహార లోపం.. కంటికి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా బైకులపై దూసుకుపోవడం.. తదితర కారణాల వల్ల నగరంలో అనేక మంది కంటిచూపును కోల్పోతున్నారు. నిజానికి 60 ఏళ్ల తర్వాత మందగించాల్సిన చూపు ఆయా కారణాల వల్ల 20 ఏళ్లకే మందగిస్తోంది. ఇటీవల రాజీవ్‌విద్యామిషన్ ఆధ్వర్యంలో న గరంలోని పలు ప్రభుత్వ పాఠశాల్లో 1,83,021 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 17,783 మంది దృష్టిలోపం ఉన్నట్లు వెల్లడైంది. నాంపల్లి, చార్మినార్, బహదూర్‌పురా, బండ్లగూడ, ఆసిఫ్‌నగర్, సికింద్రాబాద్ తదితర మండలాల్లోని చిన్నారుల్లో దృ ష్టిలోప సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే త మ పిల్లలకు కంటిచూపు సమస్య ఉన్నట్లు చాలా మంది త ల్లిదండ్రులకు నేటికీ తెలియదు. హైటెక్ నగరి, ఆరోగ్య రాజ దానిగా పేరొందిన హైదరాబాద్‌లో దృష్టిలోపంతో బాధ పడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువే. సంరక్షణ చర్యలు పాటించకపోవడం, నిర్లక్ష్యం వహించడం, కాలుష్యం వంటి వల్ల శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. విటమిన్ ‘ఎ’ సిరఫ్ ఏదీ.. గ్రేటర్ హైదరాబాద్‌లో 2010లో 1,78,954 మంది శిశువులు జన్మించగా, 2011లో 1,78,123 మంది జన్మించారు. నవంబర్ 2012 నాటికి 1,53,778 మంది జన్మించారు. చిన్నారులకు భవిష్యత్తులో దృష్టిలోపం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా విటమిన్ ‘ఎ’ ద్రావణం అందించాల్సి ఉంది. పుట్టిన ప్రతి శిశువుకు తొమ్మిదో నెలలో 1.5 ఎం.ఎల్ చొప్పున, ఆ తర్వాత ప్రతి ఆరు మాసాలకు ఒక ఎం.ఎల్ చొప్పున ఇలా మొత్తం ఆరుసార్లు దీన్ని తాగించాల్సి ఉంది. కానీ గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఈ ద్రావణాన్ని సరఫరా చేయడం లేదు. చిన్నారుల్లో దృష్టిలోపం పెరగడానికి ఇది కూడా ఒక కారణమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నేత్రాలను సేకరిస్తారిలా.. వ్యక్తి చనిపోయినా అతని కళ్లు మాత్రం పని చేస్తునే ఉంటాయి. చనిపోయిన ఆరు గంటల్లోగా కంటిగుడ్డు పైభాగంలోని నల్లని పొర(కార్నియా)ను సేకరించాలి. ఇలా సేకరించిన కార్నియాను 48 గంటల పాటు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇన్‌టైమ్‌లో దీన్ని ఇతరులకు అమర్చకపోతే అది పాడై పోయే ప్రమాదం ఉంది. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఎల్వీప్రసాద్ ఆస్పత్రి, చిరంజీవి ఐ బ్యాంక్, వాస న్, పుష్పగిరి ఐ బ్యాంక్ కార్నియాలను సేకరిస్తున్నాయి. కలెక్టర్ నేత్రదానం కళ్లుదానం చేయండి.. అని మాటలు చెప్ప డం కాదు.. ఆయన చేసి చూపారు. ఇతరులకు మార్గదర్శిగా నిలిచారు. ఆయనే మన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్లో జరిగిన నేత్రదాన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మరణానంతరం తన కళ్లను దానం చేసేందుకు అంగీకరించారు. టార్గెట్‌ను ఛేదిస్తాం.. గత ఏడాది జిల్లాలో నాలుగు వేల కార్నియాలు సేకరించాం. ఈ ఏడాది ఐదు వేలు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఇప్పటికే రెండు వేలకుపైగా సేకరించాం. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లాలోని వివిధ మహిళా సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, మతపెద్దలు, సెలబ్రీటీలతో సమావేశాలు నిర్వహించి, నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తాం. - డాక్టర్ రవీందర్‌గౌడ్, జిల్లా అంధత్వ నివారణ అధికారి