ముందు‘చూపే’ మేలుకొలుపు | Residents of increasing blindness and problems | Sakshi
Sakshi News home page

ముందు‘చూపే’ మేలుకొలుపు

Published Mon, Aug 26 2013 2:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

ముందు‘చూపే’ మేలుకొలుపు

ముందు‘చూపే’ మేలుకొలుపు

దేశవ్యాప్తంగా ప్రతి సెకన్‌కు ఒక శిశువు జన్మిస్తుండగా, నిమిషానికి ఒక శిశువు చూపు కోల్పోతుంది. ఏటా కోటి మందికి పైగా మృత్యువాత పడుతుంటే.. వీరిలో రెండు శాతం మంది కూడా నేత్రాలను దానం చేసేందుకు ముందుకు రావ ట్లేదు. ‘ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఏటా లక్ష మంది కార్నియా మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తుండగా, 37 వేలకు మించి దొరకడం లేదు. సేకరించిన కార్నియాల్లో 50 శాతం మాత్రమే ఉపయోగపడుతున్నాయి. దీంతో వేలాది మంది కార్నియా మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 20 వేల మంది ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
 
సాక్షి, సిటీబ్యూరో: దృష్టి మందగిస్తోంది. బాల్యం నుంచే చూపు ‘మసక’బారుతోంది. దృష్టిలోపం నగరవాసిని వెంటాడుతోంది. పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారి కన్ను సైతం ‘జోడు’ కావాలంటోంది. రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం.. రోజంతా కంప్యూటర్లకు, టీవీలకు అతుక్కపోవడం.. చీకటి గదుల్లో పాఠాలు బోధిస్తుండటం.. పోషకాహార లోపం.. కంటికి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా బైకులపై దూసుకుపోవడం.. తదితర కారణాల వల్ల నగరంలో అనేక మంది కంటిచూపును కోల్పోతున్నారు.

నిజానికి 60 ఏళ్ల తర్వాత మందగించాల్సిన చూపు ఆయా కారణాల వల్ల 20 ఏళ్లకే మందగిస్తోంది. ఇటీవల రాజీవ్‌విద్యామిషన్ ఆధ్వర్యంలో న గరంలోని పలు ప్రభుత్వ పాఠశాల్లో 1,83,021 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 17,783 మంది దృష్టిలోపం ఉన్నట్లు వెల్లడైంది. నాంపల్లి, చార్మినార్, బహదూర్‌పురా, బండ్లగూడ, ఆసిఫ్‌నగర్, సికింద్రాబాద్ తదితర మండలాల్లోని చిన్నారుల్లో దృ ష్టిలోప సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే త మ పిల్లలకు కంటిచూపు సమస్య ఉన్నట్లు చాలా మంది త ల్లిదండ్రులకు నేటికీ తెలియదు. హైటెక్ నగరి, ఆరోగ్య రాజ దానిగా పేరొందిన హైదరాబాద్‌లో దృష్టిలోపంతో బాధ పడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువే. సంరక్షణ చర్యలు పాటించకపోవడం, నిర్లక్ష్యం వహించడం, కాలుష్యం వంటి వల్ల శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
 
విటమిన్ ‘ఎ’ సిరఫ్ ఏదీ..
 గ్రేటర్ హైదరాబాద్‌లో 2010లో 1,78,954 మంది శిశువులు జన్మించగా, 2011లో 1,78,123 మంది జన్మించారు. నవంబర్ 2012 నాటికి 1,53,778 మంది జన్మించారు. చిన్నారులకు భవిష్యత్తులో దృష్టిలోపం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా విటమిన్ ‘ఎ’ ద్రావణం అందించాల్సి ఉంది. పుట్టిన ప్రతి శిశువుకు తొమ్మిదో నెలలో 1.5 ఎం.ఎల్ చొప్పున, ఆ తర్వాత ప్రతి ఆరు మాసాలకు ఒక ఎం.ఎల్ చొప్పున ఇలా మొత్తం ఆరుసార్లు దీన్ని తాగించాల్సి ఉంది. కానీ గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఈ ద్రావణాన్ని సరఫరా చేయడం లేదు. చిన్నారుల్లో దృష్టిలోపం పెరగడానికి ఇది కూడా ఒక కారణమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
 
నేత్రాలను సేకరిస్తారిలా..
 వ్యక్తి చనిపోయినా అతని కళ్లు మాత్రం పని చేస్తునే ఉంటాయి. చనిపోయిన ఆరు గంటల్లోగా కంటిగుడ్డు పైభాగంలోని నల్లని పొర(కార్నియా)ను సేకరించాలి. ఇలా సేకరించిన కార్నియాను 48 గంటల పాటు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇన్‌టైమ్‌లో దీన్ని ఇతరులకు అమర్చకపోతే అది పాడై పోయే ప్రమాదం ఉంది. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఎల్వీప్రసాద్ ఆస్పత్రి, చిరంజీవి ఐ బ్యాంక్, వాస న్, పుష్పగిరి ఐ బ్యాంక్ కార్నియాలను సేకరిస్తున్నాయి.
 
 కలెక్టర్ నేత్రదానం
 కళ్లుదానం చేయండి.. అని మాటలు చెప్ప డం కాదు.. ఆయన చేసి చూపారు. ఇతరులకు మార్గదర్శిగా నిలిచారు. ఆయనే మన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో జరిగిన నేత్రదాన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మరణానంతరం తన కళ్లను దానం చేసేందుకు అంగీకరించారు.
 
 టార్గెట్‌ను ఛేదిస్తాం..
 గత ఏడాది జిల్లాలో నాలుగు వేల కార్నియాలు సేకరించాం. ఈ ఏడాది ఐదు వేలు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఇప్పటికే రెండు వేలకుపైగా సేకరించాం. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లాలోని వివిధ మహిళా సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, మతపెద్దలు, సెలబ్రీటీలతో సమావేశాలు నిర్వహించి, నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తాం.
 - డాక్టర్ రవీందర్‌గౌడ్, జిల్లా అంధత్వ నివారణ అధికారి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement