
కళ్ల సమస్యలు వచ్చినా... అక్షరాలు లేదా వస్తువులు సరిగా కనిపించకపోయినా డాక్టర్ కళ్ల జోడు వాడాలని సూచిస్తారు. వాటివల్ల కంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని కాదు.. కాస్త ఉపశమనం కలుగుతుంది అంతే. కాటరాక్ట్ శస్త్రచికిత్స కానీ లెన్స్ వాడటం వల్ల, లేజర్ చికిత్స వల్ల కాస్త కంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే వీటన్నింటి సాయం అవసరం లేకుండానే కంటి చుక్కల మందు సాయంతో సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు.
అంతేకాదు ఉన్న సమస్యలను కూడా తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకోసం తాము ఓ ప్రత్యేకమైన కంటి చుక్కల మందు తయారు చేసినట్లు ఇజ్రాయెల్ టెల్ అవీవ్‌లోని బార్ ఇలాన్ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానోటెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ శాస్త్రవేత్తలు తెలిపారు. తామే తయారు చేసిన చుక్కల మందుతో కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చిన స్పష్టం చేస్తున్నారు. ‘రిఫ్రాక్టరీ సమస్యలను సరిచేసేందుకు తాము ఓ వినూత్న పద్ధతిని కనుగొన్నాం’ అని కంటి వైద్య నిపుణుడు డా.డేవిడ్ స్మద్జ తెలిపారు.
ఈ మందు వేసిన పందుల కార్నియా సమస్యలు చాలా వరకు తొలగిపోయాయని తమ పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు. దూరదృష్టి, హ్రస్వ దృష్టి సమస్యలు తొలగిపోయాయని వివరించారు. అయితే మానవులపై వచ్చే నెలలో క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉందని చెప్పారు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి మరి!
Comments
Please login to add a commentAdd a comment