చల్లని చూపు... 2019లోపు
రాష్ట్రంలో కంటి వ్యాధుల నివారణకు వైద్య శాఖ ప్రణాళిక
- వ్యక్తుల వారీగా వివరాల సేకరణ
- మొదటి దశలో 10 జిల్లాల్లో అమలు
- 550 గ్రామాల్లో వివరాల సేకరణ
- మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి
సాక్షి, హైదరాబాద్: కంటి చూపు సమస్యల నివారణపై కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2019లోపు రాష్ట్రంలో కంటి చూపు సమస్య ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. ‘అంధత్వ రహిత తెలంగాణ (అవైడబుల్ బ్లైండ్‌నెస్ ఫ్రీ తెలంగాణ)’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కంటి వైద్యంలో ప్రఖ్యాతి పొందిన... స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంటి చూపు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చిన్నపిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది.
ఏటా కంటి చూపు సమస్యలకు గురవుతున్న వారిలో 60 శాతం మంది 12 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. భవిష్యత్తుతరం జీవనానికి ప్రమాదకరంగా మారుతున్న కంటి చూపు సమస్యల నివారణపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. కార్నియా సమస్యలతో ఇబ్బందిపడే వారిని గుర్తించి చికిత్స చేయించేలా కార్నియా అంధత్వ్ ముక్తి భారత్ అభియాన్(కాంబా) కార్యక్రమాన్ని చేపట్టింది. మన రాష్ట్రంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ విషయంలో మరింత విస్తృతంగా ఆలోచించింది. కార్నియా సమస్యతోనే కాకుండా... రెటీనా, గ్లుకోమా, మధుమేహం.. ఇతర సమస్యలతోనూ కంటిచూపు కోల్పోతున్న వారికి వైద్యపరంగా అండగా ఉండాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని ప్రతి వ్యక్తి కంటి చూపు సమస్యలను తెలుసుకునేలా ప్రణాళిక రూపొందించింది.
మొదటి దశలో 10 జిల్లాలను ఎంపిక చేసింది. ఈ జిల్లాల్లోని 550 గ్రామాల్లో వ్యక్తుల వారీగా కంటి చూపు సమస్యలను తెలుసుకుంటారు. వారికి అవసరమైన వైద్య సేవలను వెంటనే అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుంది. స్థానిక ఆస్పత్రులలో చికిత్స చేయించడం నుంచి ఇది మొదలవుతుంది. సమస్య తీవ్రత ఆధారంగా... ఆయా వ్యక్తులకు జిల్లా స్థాయి ఆస్పత్రులలో, హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్, ఆనంద్, పుష్యగిరి, శరత్ ఆస్పత్రులలో చికిత్స చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల వైద్య చికిత్స పథకాలను వీరికి వర్తింపజేయనున్నారు. ఇదే తరహాలో 2018లో మరో 10 జిల్లాల్లో, 2019లో మిగతా 10 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
దానంతోనే చూపు...
ఒక్కరు నేత్రదానం చేస్తే ఇద్దరు వ్యక్తులకు చూపు వస్తుంది. ఏ వయస్సు వారైనా నేత్రదానం చేయవచ్చు. వ్యక్తి చనిపోయిన ఆరు గంటలలోపు కార్నియా సేకరించాలి. శిక్షణ పొందిన వైద్యుడు మాత్రమే కార్నియా సేకరించి తిరిగి అమరుస్తాడు. నేత్ర బ్యాంకు బృందం... మరణించిన వ్యక్తి ఇంటి వద్ద, ఆస్పత్రిలో, మార్చురీ వద్ద, స్మశాన స్థలాల్లోనూ కార్నియాను సేకరిస్తుంది. గరిష్టంగా 15 నిమిషాలలో కార్నియా సేకరించే ప్రక్రియ ముగుస్తుంది. కార్నియా సేకరణతో వ్యక్తి రూపురేఖలు ఏమీ మారవు. కంటిపై పొరను మాత్రమే తొలగిస్తారు. చాలా మంది అపోహపడుతున్నట్లు పూర్తిగా కనుగుడ్డును తీయరు.
దేశంలో కార్నియా అవసరమైన వారు 2 లక్షలు
ఏటా కార్నియా సమస్యవల్ల అంధత్వానికి గురవుతున్న వారు 20 వేలు
45 ఏళ్లలోపు వారు 90శాతం
వీరిలో 12 ఏళ్ల లోపు వారు 60 శాతం
మొదటి విడతలో ఏబీఎఫ్‌టీ అమలు చేసే గ్రామాలు జిల్లాల వారీగా..