
రెండు వేల కోట్లు దోపిడి!
గోల్డ్ మెడల్స్ సాధించి, ఉన్నత స్థాయికి ఎదగాల్సిన ఐదుగురు ఐఐటీ విద్యార్థులు అనుకోని విధంగా 2000 కోట్ల రూపాయలను ఏ విధంగా దోచేశారు? ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? అనే కథాంశంతో పవన్ రెడ్డి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘2000 క్రోర్ బ్లాక్‌మనీ’. రమేశ్ ముక్కెర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సీడీని మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ ఆవిష్కరించి, దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డికి అందించారు.
దర్శకుడు మల్లికార్జున్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి తనయుడు ప్రశాంత్, దర్శకుడు ప్రేమ్‌రాజ్ కూడా పాల్గొన్నారు. ‘‘ఇది బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా తెరపై పెద్ద సినిమా’’ అని దర్శకుడు అన్నారు. ‘‘చిన్న చిత్రాలకు విమర్శకులు రివ్యూలు రాయరు. కానీ, ఈ చిత్రాన్ని చూసి, రేటింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను’’ అని పవన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జనార్ధన్ రెడ్డి ఎల్లనూరు.