చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల, మహిళల జట్లు
ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి పసిడి పతకాలు సొంతం
భారత జట్ల విజయంలో కీలకపాత్ర పోషించిన హారిక, అర్జున్
వ్యక్తిగత విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచిన అర్జున్, గుకేశ్, దివ్య, వంతిక
బుడాపెస్ట్: ప్రపంచ చదరంగ సామ్రాజ్యంలో తమకు తిరుగులేదని భారత క్రీడాకారులు నిరూపించారు. ఏ లక్ష్యంతోనైతే చెస్ ఒలింపియాడ్‌లో బరిలోకి దిగారో ఆ లక్ష్యాన్ని భారత క్రీడాకారులు దర్జాగా పూర్తి చేశారు. ఆద్యంతం అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. అంచనాలకు మించి ఎత్తులు వేశారు.
తమ ప్రత్యర్థులను చిత్తు చేశారు. వెరసి ఇన్నాళ్లూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఏకకాలంలో భారత పురుషుల, భారత మహిళల జట్లు చాంపియన్‌గా నిలిచి తొలిసారి స్వర్ణ పతకాలను సొంతం చేసుకొని కొత్త చరిత్రను లిఖించాయి.
» ఆదివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్ (తెలంగాణ), దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద (తమిళనాడు), విదిత్ సంతోష్ గుజరాతి (మహారాష్ట్ర), పెంటేల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచి 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టుకు (17 పాయింట్లు) రజతం, ఉజ్బెకిస్తాన్ జట్టుకు (17 పాయింట్లు) కాంస్యం లభించాయి.
» గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్ (ఢిల్లీ)లతో కూడిన భారత మహిళల జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. కజకిస్తాన్ (18 పాయింట్లు) జట్టుకు రజతం, అమెరికా (17 పాయింట్లు) జట్టుకు కాంస్యం దక్కాయి.
» వ్యక్తిగత విభాగాల్లో గుకేశ్ (బోర్డు–1; 9 పాయింట్లు), అర్జున్ (బోర్డు–2; 10 పాయింట్లు), దివ్య దేశ్‌ముఖ్ (బోర్డు–3; 9.5 పాయింట్లు), వంతిక అగర్వాల్ (బోర్డు–4; 7.5 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.
» చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 3.5–0.5తో స్లొవేనియాపై గెలుపొందగా... భారత మహిళల జట్టు కూడా 3.5–0.5తో అజర్‌బైజాన్ జట్టును ఓడించింది.
» పురుషుల 11వ రౌండ్ గేముల్లో గుకేశ్ 48 ఎత్తుల్లో ఫెడోసీవ్‌పై, అర్జున్ 49 ఎత్తుల్లో జాన్ సుబెల్‌పై, ప్రజ్ఞానంద 53 ఎత్తుల్లో అంటోన్ డెమ్‌చెంకోపై నెగ్గగా... మాతెజ్ సబెనిక్‌తో జరిగిన గేమ్‌ను విదిత్ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
» మహిళల 11వ రౌండ్ గేముల్లో ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో గునె మమాద్‌జాదాపై, దివ్య 39 ఎత్తుల్లో గొవర్ బెదులయేవాపై, వంతిక 53 ఎత్తుల్లో ఖానిమ్ బలజయేవాపై గెలుపొందగా... ఉలివియా ఫతలెవియాతో జరిగిన గేమ్‌ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.
» గతంలో భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో రెండుసార్లు కాంస్య పతకాలు (2014, 2022) గెలుపొందగా... భారత మహిళల జట్టు ఒకసారి (2022) కాంస్య పతకాన్ని సాధించింది.
కల నిజమైంది
చెస్ ఒలింపియాడ్‌లో నా ప్రస్థానం 13 ఏళ్ల వయస్సులో 2004లో మొదలైంది. 20 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు నా స్వర్ణ స్వప్నం సాకారం అయింది. స్వదేశంలో 2022లో జరిగిన ఒలింపియాడ్‌లో పసిడి పతకం సాధించే అవకాశాలున్నా ఆఖర్లో తడబడి చివరకు కాంస్య పతకంతో సంతృప్తి చెందాం. కానీ ఈసారి ఆఖరి రౌండ్‌లో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడి ‘బంగారు’ కలను నిజం చేసుకున్నాం.
ఈసారి ఒలింపియాడ్‌కు నేను ప్రత్యేక సన్నాహాలు చేయకుండానే బరిలోకి దిగాను. ఈ మెగా టోర్నీలో నా అపార అనుభవం ఉపయోగపడింది. నాతోపాటు దివ్య, వంతిక, వైశాలి, తానియా సరైన సమయంలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాం. పటిష్ట జట్లతో ఆడి పోరాడి గెలిచాం. ఈ స్వర్ణ పతకానికి మేమందరం అర్హులం. –‘సాక్షి’తో హారిక
Comments
Please login to add a commentAdd a comment