అమెరికాతో మహిళల బృందం ‘టై’
బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు అజేయంగా సాగుతోంది. శుక్రవారం ఉజ్బెకిస్తాన్ జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను భారత పురుషుల జట్టు 2–2తో టై చేసుకుంది. ఈ పోరులో బరిలోకి దిగిన నలుగురు ఆటగాళ్లు కూడా తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ఈ టోర్నీలో వరుసగా ఎదురులేని విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌ను నిలువరించిన జట్టుగా ఉజ్బెకిస్తాన్ నిలిచింది.
దొమ్మరాజు గుకేశ్... నొదిర్బెక్ అబ్దుసత్తొరొవ్‌తో, ప్రజ్ఞానంద.... జవొఖిర్ సిందరొవ్‌తో, విదిత్ గుజరాతి... జకొంగిర్ వఖిదొవ్‌తో, ఇరిగేశి అర్జున్... షంసిద్దీన్‌తో తమ తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి భారత్ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మహిళల విభాగంలో తొమ్మిదో రౌండ్‌లో భారత బృందం 2–2తో అమెరికా జట్టుతో టై చేసుకుంది.
మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత 2–1తో అమెరికా ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో వంతిక అగర్వాల్ వేసిన ఎత్తులు భారత్‌ను పైఎత్తుకు చేర్చింది. తప్పక గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో ఆమె ఇరినా క్రుశ్‌ను ఓడించి 2–2తో స్కోరును సమం భారత మహిళల జట్టు ఊపిరి పీల్చుకుంది.
అంతకుముందు ఎనిమిదో రౌండ్‌లో అమ్మాయిల జట్టు పోలండ్ చేతిలో ఓడింది. దీంతో ఏడురౌండ్ల దాకా అజేయంగా నిలిచిన భారత మహిళల జట్టుకు ఈ టోరీ్నలో తొలిసారి ఓటమి ఎదురైంది.
ఉత్తమ ఆటగాళ్లుగా కార్ల్‌సన్, పోల్గర్
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తమ శతాబ్ది ఉత్సవాలను బుడాపెస్ట్‌లోనే ఘనంగా నిర్వహించింది. ‘ఫిడే 100’ పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఒలింపియాడ్‌లో ఎనిమిదో రౌండ్ పోటీలు ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. తమ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని మొత్తం 18 కేటగిరీల్లో ‘ఫిడే’ అవార్డులు అందజేసింది.
శతాబ్ది అత్యుత్తమ ఆటగాళ్లుగా పురుషుల విభాగంలో మాగ్నస్ కార్ల్‌సన్, మహిళల విభాగంలో జూడిత్ పోల్గర్ ఎంపికయ్యారు. కార్ల్‌సన్ క్లాసిక్ విభాగంలో ఐదు సార్లు, ర్యాపిడ్ విభాగంలో ఐదు సార్లు, బ్లిట్జ్ విభాగంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
ప్రపంచ చెస్ చరిత్రలోనే అత్యుత్తమ రేటింగ్ (2882) సాధించిన ఘనత కార్ల్‌సన్ సొంతం. మహిళల చెస్‌కు సుదీర్ఘ కాలం చిరునామాగా నిలిచిన పోల్గర్ 15 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ అయింది. 12 ఏళ్లకే టాప్–100 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న పోల్గర్ 2700 రేటింగ్ దాటిన ఏకైక మహిళ.
Comments
Please login to add a commentAdd a comment