సుప్రీం కోర్టు.. ఎల్జీబీటీ పోరాట జెండా
సాక్షి, న్యూఢిల్లీ: హోమో సెక్సువల్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎల్‌జీబీటీ( లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటీ లైంగిక ప్రాధామ్యాలను పరిరక్షించేందుకు భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిని గురువారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.
ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయాలని కోరుతూ 20 మంది ఐఐటీ విద్యార్థులు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. అయితే తదుపరి వాదనల తేదీ ఎప్పుడన్నది బెంచ్ స్పష్టం చేయలేదు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్-377 ప్రకారం సజాతి లైంగిక కార్యకలాపాలు నేరంగా పరిగణిస్తారు. దీనిని రద్దు చేయాలని దశాబ్దాలుగా గే హక్కుల కార్యకర్తలు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ అంశంపై గతంలో చాలా వరకు పిటిషన్లపై తీర్పు పెండింగ్‌లో ఉన్నాయి కూడా. ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌జీబీటీ హక్కులను అనేక దేశాలు గుర్తిస్తూ వస్తున్నప్పుడు పౌరుల హక్కులను దెబ్బతీసే ఇలాంటి చట్టాలను ఎత్తివేయడమే మంచిదన్న ఓ అభిప్రాయం వ్యక్తమవుతుండగా.. మరోవైపు అసహజ శృంగారాన్ని ప్రోత్సహించే అంశం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందేమోనన్న ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
ఈ సెక్షన్ ఎత్తివేయాల్సిందిగా 2000 సంవత్సరంలోనే లా కమిషన్ సిఫార్సు చేసింది. అయినా వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఎక్కడ సనాతన ధర్మాలు కలిగిన ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందన్న భయం. 2009లో ఢిల్లీ హైకోర్టు సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అయితే 2013, డిసెంబర్ 11న హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు విభేదించింది. తన నిర్ణయాన్ని సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్లను 2014, జనవరి 28న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సెక్షన్ కింద శిక్ష పడేది అతి కొద్ది మందికే కనుక పౌరుల ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలిగినట్లు కాదంటూ సుప్రీం కోర్టు భాష్యం చెప్పింది. 1950 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ పీనల్ కోడ్‌కు 30 సార్లు సవరణలు చేసినా.. సెక్షన్ 377 జోలికి మాత్రం పోలేదు.
Comments
Please login to add a commentAdd a comment