
ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గే సెక్స్ నేరం కాదని స్పష్టం చేస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. హోమో సెక్సువాలిటీ నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్‌ను రద్దు చేయడం ద్వారా ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది.
చరిత్ర క్షమాపణ చెప్పాలి
చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలంటూ సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది.వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా సెక్షన్ 377పై సుదీర్ఘ కాలంగా (సుమారు 157 ఏళ్లు) సాగుతున్న వివాదానికి స్వస్తి పలికింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది.
అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించడం విశేషం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ ఖాన్‌విలకర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. స్వజాతి లైంగిక చర్య నేరం కాదని తాజా తీర్పు తేల్చి వేయడంతో ఎల్‌జీబీటీ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఒక కొత్త శకానికి ఇది నాంది అని వ్యాఖ్యానించారు.
సెక్షన్ 377
పరస్పర అంగీకారంతో జరిపే స్వలింగ సంపర్కంపై మనదేశంలో బ్రిటీష్‌కాలం నుంచే నిషేధం కొనసాగుతోంది. 1861 చట్టం ప్రకారం, స్వలింగ సంపర్కానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 1950 నుంచి ఇప్పటివరకు ఇండియన్ పీనల్ కోడ్‌లో అనేక సార్లు సవరణలు చేసినప్పటికీ సెక్షన్ 377లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే ఈ సెక్షన్‌లోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధమని 2009లో ఢిల్లీ హైకోర్టు తేల్చింది. గే హక్కుల కోసం దాదాపు ఒక దశాబ్దం పాటు పోరాడిన నాజ్ ఫౌండేషన్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సెక్షన్ 377 రాజ్యాంగం ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా వర్ణించింది. ఈ తీర్పును 2013లో సుప్రీం కొట్టి వేసింది.
ఆ అయిదుగురు
సెక్షన్ 377కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఇటీవలి కాలంలో తీవ్ర రూపం దాల్చింది. తమ హక్కులను కాపాడాలంటూ ఎల్‌జీబీటీ కమ్యూనిటీ పిటిషన్ వేసింది. ముఖ్యంగా రెండేళ్ళ క్రితం భరతనాట్యం డ్యాన్సర్ నవతేజ్ ఎస్ జోహర్, జర్నలిస్టు సునీల్ మెహ్రా, రితూ దాల్మియా, నిమ్రాణ హోటల్ కో ఫౌండర్ అమన్ నాథ్, మహిళా వ్యాపార వేత్త అయేషా కపూర్ సెక్షన్ 377నురద్దు చేయాలంటూ పిటీషన్ వేశారు. వీటితో పాటు ఆరు పిటీషన్లను విచారించిన దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం జులై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
సంబరాలు: సుప్రీం తీర్పుపై ఢిల్లీ, ముంబై, బెంగళైరు నగరాలు సహా దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. ఈ తీర్పు కొంచెం ముందువచ్చి వుంటే ఎంతోమంది తమ సన్నిహితులు ప్రాణాలతో ఉండేవారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
#WATCH People in Mumbai celebrate after Supreme Court decriminalises #Section377 and legalises homosexuality pic.twitter.com/ztI67QwfsT
— ANI (@ANI) September 6, 2018
#WATCH Celebrations in Karnataka's Bengaluru after Supreme Court legalises homosexuality. pic.twitter.com/vQHms5C0Yd
— ANI (@ANI) September 6, 2018