క్లాస్ రూమ్‌ను కాల్ సెంటర్‌గా చేసుకుని కేరళ వరద బాధితులతో సంభాషిస్తున్న ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్న కేరళవాసులకు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఓవైపు సాంకేతికంగా సహకారం అందిస్తూ, మరోవైపు బాధి తులకు అవసరమైన దుస్తులు, ఇతర వస్తు సామగ్రిని సమకూర్చే పనిలో నిద్రాహారాలు లేకుండా పని చేస్తున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇందులో ఐఐటీ హైదరాబాద్ ఎన్‌ఎస్‌ఎస్ విభాగంతోపాటు, కేరళకు చెందిన విద్యార్థులు పాలుపంచుకుం టున్నారు. చెన్నై, ముంబై, బెంగళూరుల్లోని తమ మిత్ర బృందాలను భాగస్వాములను చేస్తున్నారు.
30 వేల మంది ఫోన్ నంబర్లు
వరద బాధితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు కేరళ ఐటీ విభాగం ‘కేరళ రెస్క్యూ డాట్‌కామ్’పేరిట ఓ వెబ్‌సైట్ ఏర్పాటు చేసింది. వేలాది మంది వరద బాధితులు తమను ఆదుకోవాలంటూ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ వెబ్‌సైట్ నుంచి ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన కొందరు కేరళ విద్యార్థులు సుమారు 30 వేల మంది వరద బాధితుల ఫోన్ నంబర్లు సేకరించారు. ఈ నంబర్లను గ్రూపులుగా విభజించి ఐఐటీ హైదరాబాద్‌తోపాటు, ముంబై, బెంగళూరు, చెన్నైలోని తమ మిత్ర బృందాలకు పంపించారు. క్లాస్ రూమ్‌ను కాల్ సెంటర్‌గా మార్చుకున్నారు. ఒక్కో సభ్యుడు కనీసం 50 నుంచి వంద మంది బాధితులతో మాట్లాడి వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే బాధ్యతను తీసుకున్నారు.
బాధితులతో నేరుగా సంభాషణ
బాధితులతో ఫోన్‌లో సంభాషిస్తున్న విద్యార్థులు.. వారి వివరాలను సేకరించి సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు, రెస్క్యూ బృందాలతో సమన్వయం చేస్తున్నారు. గత గురువారం ఒక్కరోజే తాము ఏడు వేల మంది బాధితులతో సంభాషించినట్లు ఐఐటీహెచ్ విద్యార్థిని అనఘ ‘సాక్షి’కి వెల్లడించారు. సెల్ ఫోన్ నెట్‌వర్క్ కొన్నిచోట్ల దెబ్బతినడంతో బాధితులను అందరినీ చేరుకోలేకపోయినట్లు విద్యార్థి బృందం తెలిపింది. గత గురువారం నుంచి ఆదివారం వరకు మొత్తంగా సుమారు 30 వేల మందిని సంప్రదించగలిగామని చెప్పారు.
విరాళాలు, సామగ్రి సేకరణ
ఓ వైపు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరేలా చూస్తూనే, మరోవైపు బాధితులకు ధన, వస్తు రూపంలో సాయం అందించడంపైనా విద్యార్థులు దృష్టి సారించారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోని 12 హాస్టళ్లతోపాటు సిబ్బంది నుంచి ఇప్పటి వరకు 2.50 లక్షలకు పైగా రూపాయాలను విరాళాలు సేకరించి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. అంతేకాకుండా విద్యార్థులు, సిబ్బంది నుంచి రూ.4 లక్షలకు పైగా విలువ చేసే దుస్తులు, ఔషధాలు, సెల్‌ఫోన్ చార్జర్లు, టార్చ్‌లైట్లు, బ్లాంకెట్లు, చెప్పులు తదితర సామగ్రిని సేకరించారు. ఈ వస్తువుల నాణ్యతను సరిచూసిన తర్వాతే ప్యాక్ చేస్తుండటం విశేషం. కొచ్చిలో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ వస్తువులను వరద బాధితులకు అందేలా ఏర్పాటు చేసినట్లు కణ్ణన్ అనే విద్యార్థి తెలిపారు.
నిరంతరాయంగా సంప్రదించాం..
కేరళ వరదలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టింగులతో అప్రమత్తమయ్యాం. వెంటనే బృందాలుగా ఏర్పడ్డాం. కేరళ ప్రభుత్వ వెబ్‌సైట్‌కు కుప్పలు తెప్పలుగా వస్తున్న అభ్యర్థనలను స్వీకరించి, ఫోన్ల ద్వారా బాధితులను నిరంతరాయంగా సంప్రదిస్తూ వచ్చాం. గత నాలుగు రోజుల్లో కనీసం 30 వేల మంది బాధితులను మా బృందం ఫోన్ ద్వారా సంప్రదించి, వారి వివరాలను కంట్రోల్ రూమ్, రెస్క్యూ బృందాలకు అందిస్తూ వచ్చింది. ఎవరెవరు, ఎక్కడెక్కడ చిక్కుకున్నారో చెబుతూ, బాధితులు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేంత వరకు ఫాలో అప్ చేస్తూ వచ్చాం.
– అనురాగ్ అశోకన్, ఐఐటీహెచ్ ఉద్యోగి
మా శ్రమకు ఫలితం దక్కింది
పతనందిట్ట, తిరువల్లూరు తదితర ప్రాంతాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉంది. పథనంథిట్ట జిల్లాలోని మా సొంతూరు కోజెన్‌చెర్రిలో ఇళ్లు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. మా మందుల దుకాణం కూడా మునిగిపోయింది. అక్కడి ఆస్పత్రిలోని రోగులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలంటూ అభ్యర్థనలు అందాయి. మా బృందం సాయంతో వారిని రక్షించాం. వేలాది మందిని ఫోన్‌లో సంప్రదించి వరదల నుంచి బయట పడేలా చూశాం. ప్రాంతాలకు అతీతంగా ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు మాకు సహకరిస్తున్నారు. మా శ్రమకు ఫలితం దక్కింది.
– దివిజ, రీసెర్చ్ అసోసియేట్, ఐఐటీహెచ్
Comments
Please login to add a commentAdd a comment