కోటి రూపాయల ఆఫర్ను తిరస్కరించారు!
న్యూఢిల్లీ: ఏడాదికి కోటి రూపాయల జీతమంటే ఐఐటీ విద్యార్థులు ఎగిరిగంతేసేవారు. విదేశాలకు వెళ్లాలనే మోజుతో ఈ ఆఫర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూసేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విదేశాల్లో పనిచేయడం కోసం ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు ఏడాదికి దాదాపు కోటి రూపాయలకు పైగా జీతాన్ని ఆఫర్ చేయగా.. ఢిల్లీ ఐఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు తిరస్కరించారు. జీతం కాస్త తక్కువయినా స్వదేశంలో పనిచేసేందుకు మొగ్గుచూపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' ఈ మార్పునకు కారణమని భావిస్తున్నారు.
గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాతక కంపెనీలు ప్రతి ఏడాది ఢిల్లీలో ఐఐటీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి. ప్రతిభావంతులైన ఉద్యోగులకు భారీ జీతాన్ని ఆఫర్ చేస్తుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఢిల్లీ ఐఐటీకి చెందిన ఎనిమిదిమంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఒక్కొక్కరి జీతం ఏడాదికి దాదాపు కోటి రూపాయలకు పైనే. అయితే నలుగురు విద్యార్థులు ఈ భారీ ఆఫర్ను తిరస్కరిస్తున్నట్టు ప్లేస్మెంట్ సెల్లో చెప్పారు. అంతర్జాతీయ కంపెనీల్లోనే భారత్లో కాస్త తక్కువ జీతంతో పనిచేస్తామని చెప్పారు. విదేశీ కంపెనీలు 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సంస్థలు భారత్లో ఉత్పత్తులు ప్రారంభించడం దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నది దీని లక్ష్యం.