పట్నా : ఐఐటీ జేఈఈ పరీక్షకు సిద్ధం అవుతోన్న వారికి బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత వేత్త ఆనంద్ కుమార్ గురించి తెలిసే ఉంటుంది. ప్రతిభావంతులైన 30 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించి.. వారు ఐఐటీలో సీటు సాధించేందుకు తోడ్పడుతూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఆనంద్ కుమార్. ఈ ఐఐటీ ట్యూటర్ జీవిత చరిత్ర ఆధారంగా... బాలీవుడ్‌లో ‘సూపర్ 30’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఆనంద్ కుమార్ పాత్రలో నటించారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలోనూ దూసుకుపోతుంది.
ఆనంద్ కుమార్ కృషి గురించి తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అంతేకాక ‘ఆనంద్ చేస్తోన్న పని గురించి తెలిసి అతడిని అభినందించడానికి వెళ్లాను. నా వంతుగా ఆయనకు ఆర్థిక సాయం చేద్దామని భావించాను. కానీ ఆశ్చర్యం.. ఆనంద్ నా సాయాన్ని తిరస్కరించారు. తన స్వంతంగానే ఈ సూపర్ 30 కార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన పట్టుదల చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఆయన కృషిని అభినందిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ కుమార్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు సార్.. మీ అభినందనలే నాకు ఎంతో బలాన్నిస్తాయి’ అంటూ రీట్వీట్ చేశాడు.
Anand Kumar says in the article that he turned down my offer to fund his efforts. I confirm that when we met, he courteously declined my offer of financial support. I remain an admirer of how he’s changed the lives of so many. https://t.co/3Gn3V1Qdlp pic.twitter.com/fAFqYg6UtU
— anand mahindra (@anandmahindra) July 13, 2019
ఆనంద్ కుమార్ 2002లో ఈ సూపర్ 30 ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. నైపుణ్యం కలిగిన 30 మంది పేద పిల్లలను ఎంచుకుని వారికి ఉచిత వసతి కల్పిస్తూ పాఠాలు చెప్తుంటారు. మొదటి ఏడాదిలోనే ఈ అకాడమీకి చెందిన 30 మందిలో 18 మంది ఐఐటీకి సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2010 లో ఈ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈకి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ఆనంద్ కుమార్ గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. ఫారిన్ మీడియా కూడా ఆనంద్ కుమార్ కృషిని ప్రశంసించింది.
Comments
Please login to add a commentAdd a comment