సాక్షి, పాడేరు: రాష్ట్రంలో అత్యంత ఎత్తైన (1,680 మీటర్లు) సీతమ్మ కొండకు అరుదైన గౌరవం దక్కనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా హకుంపేట మండలంలోని సీతమ్మ (అర్మ) కొండపైకి వెళ్లి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు సర్వం సిద్ధమైంది. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని అత్యున్నత శిఖరాలపై జాతీయ జెండా ఎగురవేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ‘హర్ శిఖర్ తిరంగా’ మిషన్ పనిచేస్తోంది.
పర్వత ప్రాంతాల్లో సాహసయాత్ర చేసి.. జాతీయ జెండా ఎగురవేయడం దీని ప్రధాన ఉద్దేశం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ నాయకత్వంలో ఈ నెల 4వ తేదీ సోమవారం 15 మందితో కూడిన ఆర్మీ బృందం అర్మ కొండపై యాత్ర చేపట్టి జాతీయ జెండా ఎగురవేయనుంది. ఈ కార్యక్రమానికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు సాధనపల్లి ఆనంద్‌కుమార్ హాజరవుతారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో..
ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ఎత్తులో ఉన్న సీతమ్మ (అర్మ) కొండపై హర్ శిఖర్ తిరంగా మిషన్ సాహసయాత్రతో పాటు జాతీయ జెండా ఆవిష్కరిస్తుందని ఇండియన్ ఆర్మీ ఏపీ ప్రభుత్వానికి గత నెలలో లేఖ పంపింది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డి పోలీస్, రెవెన్యూ, టూరిజం శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ టూరిజం అథారిటీతో పాటు ప్రభుత్వంచే స్థాపించబడిన అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా క్‌లైంబింగ్, లాజిస్టిక్స్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది.
సోమవారం ఉదయం ఈ యాత్ర ప్రారంభమవుతుంది. హుకుంపేటలో ముందుగా పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తీగలవలస–తడిగిరి పంచాయతీల సరిహద్దు నుంచి కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ నేతృత్వంలోని ఆర్మీ బృందం అర్మ కొండకు సాహస యాత్ర చేపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment