విధి రాతను ఎదురించి.. విశ్వ వేదికపై నిలిచి.. | - | Sakshi
Sakshi News home page

విధి రాతను ఎదురించి.. విశ్వ వేదికపై నిలిచి..

Published Sat, Sep 23 2023 1:35 AM | Last Updated on Sat, Sep 23 2023 3:39 PM

- - Sakshi

అతడికి కాళ్లు లేవు.. కానీ కలలు ఉన్నాయి. ఆ కుర్రాడికి కదలడానికి శక్తి లేదు.. అయితేనేం ఎదగాలనే కాంక్ష ఉంది. యువకుడి చుట్టూ కష్టాల చీకట్లు అలముకున్నాయి.. మరేం కాదు రేపటి వెలుగు కోసం వెతకడం అతడికి తెలుసు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకుని కన్నీళ్లు పెట్టిన దశ నుంచి విశ్వ వేదికపై మువ్వన్నెల జెండా పట్టుకుని గర్వంగా ఆనంద భాష్పాలు రాల్చినంత వరకు పూర్ణారావు చేసిన ప్రయాణం సాధారణమైనది కాదు. ఒక్క రోడ్డు ప్రమాదం తన బతుకును మార్చేస్తే.. ఆ మార్పును తన కొత్త ప్రస్థానానికి దేవుడిచ్చిన తీర్పుగా చేసుకున్న నేర్పరి అతడు.

శ్రీకాకుళం: ఇండోనేషియాలో ఈ నెల 5నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్‌ పారా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఓ సిక్కోలు కుర్రాడు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిల్వర్‌, డబుల్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. ఇంత ఘనత సాధించిన ఆ క్రీడాకారుడికి రెండు కాళ్లు పనిచేయవు. అది కూడా పుట్టుకతో కాదు. అందరిలాగానే బాల్యంలో సరదాగా గడిపి, చక్కగా చదువుకుని, విదేశంలో ఓ ఉద్యోగం వెతుక్కుని కుటుంబాన్ని పోషించేంత వరకు అతను అందరిలాంటి వాడే. కానీ ఓ రోడ్డు ప్రమాదం అతడిని దివ్యాంగుడిని చేసింది. పరిపూర్ణంగా చె ప్పాలంటే రోడ్డు ప్రమాదానికి ముందు పూర్ణారావు వేరు. ప్రమాదం తర్వాత పూర్ణారావు వేరు.

టెక్కలి మండలం శ్రీరంగం గ్రామంలో ని రుపేద కుటుంబానికి చెందిన చాపరా లక్ష్మణరావు, మోహిని దంపతుల చిన్న కుమారుడు చాపరా పూర్ణారావు. పూర్ణారావు ఇంటర్‌ పూర్తి చేసి 2015 సంవత్సరంలో సింగపూర్‌లో ఫైర్‌ సేఫ్టీలో ఉద్యోగంలో చేరాడు. తన తల్లిదండ్రులను చూసేందుకు 2017 సంవత్సరంలో సొంత గ్రామం వచ్చాడు. మరో రెండు రోజుల్లో సింగపూర్‌ వెళ్లిపోతున్న తరుణంలో వజ్రపుకొత్తూరు మండలం పూండి సమీపంలో ద్విచక్రవాహనంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నుపూసకు తీవ్రంగా గాయం కావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆ ప్రమాదం పూర్ణారావు బతుకులో చీకట్లు నింపింది. 2020 వరకు ఇంటిలో మంచానికే పరిమితమయ్యాడు. చిన్నపాటి పాన్‌షాప్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు పూర్ణారావు పరిస్థితి మరింత ఆవేదనకు గురి చేసింది.

ఫేస్‌బుక్‌ ద్వారా తెలుసుకుని..
అప్పుడే ఫేస్‌బుక్‌లో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రం గురించి పూర్ణారావు తెలుసుకున్నాడు. స్నేహితుల ఆర్థిక సహకారంతో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రంలో చేరాడు. అక్కడ మనోధైర్యంపై నేర్చుకున్న అంశాలు అతడిని ఒక లక్ష్యానికి దగ్గర చేశాయి. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కలిగింది. యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ సొంతంగా నేర్చుకున్నాడు. తోటి మిత్రులతో కలిసి ప్రతి రోజూ సాధన చేసేవాడు.

తొలి ఆటలోనే..
2020లో కర్ణాటకలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్‌ పోటీల్లో పూర్ణారావు మొట్టమొదటిగా పాల్గొని గోల్డ్‌, సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. దీంతో అతని పట్టుదలకు మెడల్స్‌ మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. ఆ తర్వాత భువనేశ్వర్‌లో జరిగిన నాల్గో నేషనల్‌ పారా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్నప్పటికీ ఎలాంటి మెడల్స్‌ రాలేదు. దీంతో కొంత నిరాశ చెందినప్పటికీ, పూర్ణారావు ఆటను కోచ్‌ ఆనంద్‌కుమార్‌ గమనించారు. దీంతో మైసూర్‌లో 2 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత లక్నోలో జరిగిన ఐదో నేషనల్‌ పారా బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొని క్వార్టర్స్‌ ఫైనల్‌ వరకు వెళ్లాడు. 2023 జూలై నెలలో యుగాండాలో జరిగిన ఇంటర్నేషనల్‌ పారా బ్యాడ్మింటన్‌ పోటీలకు సిద్ధమైనప్పటికీ పాస్‌ పోర్టు సక్రమంగా లేదని ఎయిర్‌పోర్టులోనే ఆపివేశారు. దీంతో పూర్ణారావు తీవ్ర నిరాశతో వెనుతిరిగాడు.

మెడల్స్‌తో ఉత్సాహం
తాజాగా సెప్టెంబర్‌ 5 నుంచి 10 తేదీలలో ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్‌ పారా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పూర్ణారావు పాల్గొని మిక్స్డ్‌ డబుల్స్‌లో సిల్వర్‌, డబుల్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. అతను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ను సాధించాడు. కర్ణాటక ఓపెన్‌ స్టేట్‌ టోర్నమెంట్‌లో 2 సిల్వర్‌, ఒక బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. 2002లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్‌లో 2 గోల్డ్‌ మెడల్స్‌ సాధించాడు. 2023లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. వీటితో పాటు 2023 మార్చి నెలలో విశాఖపట్టణంలో జరిగిన ఏపీ నేషనల్‌ ట్రయల్స్‌ టోర్నమెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచాడు.

పారా ఒలింపిక్సే లక్ష్యం
నాకు ఆర్థిక సాయం అందితే పారా ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మరి కొద్ది రోజుల్లో ఖేలో ఇండియా టోర్నమెంట్‌తో పాటు జపాన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నా.
– చాపరా పూర్ణారావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement