
సిబల్ సహా పలువురి నామినేషన్ల సమర్పణ
న్యూఢిల్లీ: చాందినీచౌక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి కపిల్ సిబల్ గురువారం నామినేషన్ వేశారు. ఇక న్యూఢిల్లీ నుంచి పోటీ కోసం ఆప్ అభ్యర్థి ఆశిష్ ఖేతాన్, ఈశాన్యఢిల్లీలో పోటీ కోసం ఆనంద్‌కుమార్ కూడా నామినేషన్లు సమర్పించారు.
బీజేపీ అభ్యర్థి మహేశ్ గిరి తూర్పుఢిల్లీ స్థానం కోసం నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని ఏడు స్థానాలకు వచ్చే నెల 10 నిర్వహించే ఎన్నికల కోసం గురువారం వరకు 34 మంది నామినేషన్ పత్రాలను అందజేశారని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
వీటిలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒకటి చొప్పున, ఆప్ నుంచి రెండు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మిగతావి వచ్చాయి. ఈ నెల 22 వరకు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. 26వ తేదీ వరకు వాటిని ఉపసంహరించుకునేందుకు అవకాశముంది.