
ఆరేళ్ల తర్వాత వెలుగు చూసిన హత్యోదంతం
దొడ్డబళ్లాపురం : ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి నిందితులను విచారణ జరుపుతుండగా ఆరేళ్ల క్రితం జరిగిన మరో హత్యోదంతం వెలుగు చూసింది. దీంతో పోలీసులు సదరు మృతదేహాన్ని వెలికితీయించి దర్యాప్తు చేపట్టారు. వివరాలు మారళ్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. తాలూకాలోని నారసింగనహళ్లి సమీపంలోని అడవిలో కాలువ ఒడ్డున పూడ్చి పెట్టిన మృతదేహాన్ని గత నెల మే 30న డీవైఎస్పీ కోనప్పరెడ్డి, హసీల్దార్ సిద్ధలింగయ్యల సమక్షంలో గ్రామీణ పోలీసులు వెలికి తీశారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా నారాయణ స్వామి,రామాంజి అనే వ్యక్తులను విచారిస్తుండగా చంద్రశేఖర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణప్ప..ఆరేళ్ల క్రితం ఆనందకుమార్ అనే వ్యక్తిని హత్య చేసి మారళ్లి గ్రామం శివారులోని శ్మశానంలో పూడ్చిపెట్టాడని, తాము సురేశ్,హరీశ్,వెంకటేశ్‌తో కలిసి మృతదేహాన్ని మోయడానికి సహక రించినట్టు నిందితులు గుట్టు విప్పారు.
దీంతో ఆనంద్‌కుమార్ కుటుంబ సభ్యులతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తహశీల్దార్ రమేశ్‌కుమార్, సీఐ శివారెడ్డి, రూరల్ ఎస్‌ఐ నవీన్‌కుమార్ శుక్రవారం మారళ్లి శ్మశానానికి వెళ్లి ఆనంద్(38) మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రధాన నిందితుడు కృష్ణప్ప సెంట్రల్ జైలులో ఉన్నాడని, కోర్టు అనుమతితో అతన్ని కస్టడీకి తీసుకుని హత్యకు దారి తీసిన కారణాలను తెలుసుకుంటామన్నారు.
హతుడు ఆనంద్‌కుమార్ భార్య లక్ష్మమ్మ మాట్లాడుతూ తన భర్త కృష్ణప్ప వద్ద డ్రై వర్‌గా పని చేసేవాడన్నారు, గొడవలు రావడంతో పని మానేశాడన్నారు. ఆ తర్వాత హఠాత్తుగా కనిపించకుండాపోయాడన్నారు, ఎప్పటికయినా వస్తారని ఇన్నేళ్లు వేచి చూసామని, ఇంతలోనే అతను హత్యకు గురైనట్లు పోలీసులు చెప్పారని వివరించింది. నిందితుడు కృష్ణప్ప ఫిల్టర్ ఇసుక దందా నిర్వహిస్తూ ఎదురు తిరిగినవారిని హత్యచేసేవాడని ఆమె ఆరోపించింది. సాక్ష్యాలను, శవాలను మాయం చేయడానికి తన వద్ద పని చేసే కూలీలను ఉపయోగించుకునేవాడని పేర్కొంది.