ఎవరెస్ట్ సాహసయాత్రలో ట్రైనర్ తో పూర్ణ, ఆనంద్
ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు...14 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాలావత్ పూర్ణ
*
* విజయ పతాకం ఎగరేసిన ఆనంద్ కుమార్
* 52 రోజుల పాటు 30 మంది బృందంతో సాగిన ట్రెక్కింగ్
* ఆదివారం ఉదయం 6 గంటలకు అపూర్వ ఘట్టం
* సత్తా చాటిన గురుకుల విద్యార్థులు
* కాబోయే ప్రధాని మోడీ అభినందనలు అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఆకాశాన్నంటే ఎవరెస్ట్ శిఖరంపై తెలుగు తేజాలు వెలుగులీనాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు పేద విద్యార్థులు ఆదివారం సూర్యోదయ వేళ ఎవరెస్ట్ శిఖరాగ్రంపై అడుగుపెట్టారు. దీంతో సరికొత్త రికార్డు కూడా నమోదైంది. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల మాలావత్ పూర్ణ రికార్డు సృష్టించింది. మొత్తం 30 మంది పర్వతారోహకుల బృందంలో ఉదయం ఆరు గంటలకు మొట్టమొదటగా అక్కడకు చేరుకున్న పూర్ణ ఈ అరుదైన ఘనత సాధించింది. మరో విద్యార్థి 16 ఏళ్ల సాధ నపల్లి ఆనంద్‌కుమార్ అరగంట తేడాతో శిఖరం పైకి చేరుకున్నాడు. మిగిలిన 28 మంది పర్వతారోహకులు మరో రెండు గంటల తర్వాతే యాత్ర పూర్తి చేయగలిగారు.
సముద్రమట్టానికి 8848 మీటర్ల ఎత్తుకు వెళ్లిన ఈ బృందం అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరుగు ప్రయాణమైంది. అత్యంత ప్రమాదకరమైన డెత్‌జోన్ నుంచి బేస్ క్యాంప్ వైపు ఈ బృందం వెనక్కు వస్తోంది. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్), ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంయుక్త ఆధ్వర్యంలో 52 రోజుల క్రితం ఈ యాత్ర ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు లక్ష్మీ, దేవదాస్‌ల కుమార్తె మాలావత్ పూర్ణ స్వేరోస్ (14) ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌ల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇక ఖమ్మం జిల్లా చార్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన కొండలరావు ఓ సైకిల్ షాపులో దినసరి కూలీ. ఇతడి కుమారుడు ఆనంద్‌కుమార్ (17) అన్నపురెడ్డిపల్లిలో ఉన్న గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
వీరి శిక్షకుడు శేఖర్‌బాబు నేతృత్వంలో ఈ సాహస యాత్ర జరిగింది. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసే యత్నాల్లో భాగంగా ఈ సాహస యాత్ర కోసం తొలుత 150 మందిని ఎంపిక చేశారు. వీరిలో 20 మందికి డార్జిలింగ్‌లోని ప్రఖ్యాత సంస్థలో ట్రెక్కింగ్‌పై శిక్షణనిచ్చారు. తర్వాత వీరిలో నుంచి 9 మంది గతంలో ఇండో-చైనా సరిహద్దుల్లో నిర్వహించిన సాహసయాత్రలో పాల్గొన్నారు. అత్యంత కఠిన పరిస్థితులను సైతం ఎదుర్కునే సామర్థ్యం కనబరిచిన పూర్ణ, ఆనంద్ కుమార్ ఎవరెస్ట్ యాత్రకు ఎంపికయ్యారు.
గర్వపడేలా చేశారు: మోడీ
అతి చిన్న వయస్సులోనే ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలవత్ పూర్ణతో పాటు ఆనంద్‌కుమార్‌కు కాబోయే ప్రధాని, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘ఈ విషయం చదివినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు. వారు మనం గర్వపడేలా చేశారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వార్తకు సంబంధించిన కథనాన్ని కూడా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.
దేశం గర్వించేలా నిలిచారు: వైఎస్ జగన్
చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. చిన్నతనంలోనే గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశం యావత్తూ గర్వపడేలా అద్భుతం సాధించారని కొనియాడారు. పూర్ణ, ఆనంద్‌లు మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిదాతలుగా నిలిచారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారిని తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు, గురువులకూ ఆయన అభినందనలు తెలియజేశారు.
టీపీసీసీ తరఫున రూ.5 లక్షలు: పొన్నాల
అవకాశాలను అందిపుచ్చుకుని పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన సాహస బాలురకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నజరానా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన రాష్ర్ట విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు రూ. 5 లక్షల చొప్పున నగదు పురస్కారంతో పాటు, వారిని ఘనంగా సన్మానించనున్నట్లు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. ఇక పూర్ణ, ఆనంద్‌లను టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కూడా అభినందించారు. ఎవరెస్ట్ అధిరోహణతో తెలంగాణ గౌరవాన్ని హిమాలయాలంత ఎత్తుకు పెంచారని శ్లాఘించారు.