అమ్మే గుర్తొచ్చింది...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం ఆషామాషీ కాదు. ఇది సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మొదట్లో చిన్న బండను చూసే భయపడ్డాను. కానీ పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధ్యమేననే ఆలోచనతో ముందుకెళ్లా. ఎవరెస్టు శిఖరం పైకి వెళుతున్నప్పుడు అమ్మే గుర్తొచ్చింది. అమ్మను తలుచుకుంటూనే ఉన్నా. మా ఊరు కూడా గుర్తొచ్చింది. నేను చదువుకున్న పాఠశాల కళ్ల ముందు కదలాడింది. మొదట్లో చెప్పిన విధంగానే ఖమ్మం జిల్లాకు పేరు తేవాలని ముందుకెళ్లా. ఎవరెస్టు శిఖరంపై జాతీయ పతాకంతో పాటు తెలంగాణ జెండాను కూడా ఉంచి వచ్చా.
ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే అసాధ్యమంటూ ఏదీ లేదు’ అని అంటున్నాడు మన జిల్లా ముద్దుబిడ్డ, ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కి ఘనతసాధించిన సాధనపల్లి ఆనంద్‌కుమార్. చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన ఆనంద్ గత నెల 25న ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. అనంతరం అతను భారత భూభాగంలోకి ప్రవేశించి ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో ఉన్నాడు. శుక్రవారం ప్రధానమంత్రి, ఇతర జాతీయ ప్రముఖులను కలిసి అభినందనలు అందుకోనున్న ఆనంద్ గురువారం ‘సాక్షి’ ప్రతినిధికి ఢిల్లీ నుంచి ఫోన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాడు... ఆ ఇంటర్వ్యూ విశేషాలు అతని మాటల్లోనే....
ఖమ్మం పేరు నిలబెట్టా
ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి వెళ్లే ముందు హైదరాబాద్‌లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లోనే గట్టిగా చెప్పా. ఖమ్మం జిల్లా తరఫున సాధించి వస్తానని. అదే స్ఫూర్తితో నా టార్గెట్‌ను పూర్తి చేశా...ఖమ్మం జిల్లా పేరు నిలబెట్టా. నేను పుట్టి పెరిగిన కలివేరు గ్రామానికి, నా తల్లిదండ్రులకు, నేను చదువుకున్న చంద్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లె గురుకుల పాఠశాలకు మంచిపేరు తేవాలన్నదే నా కోరిక. నా ఈ విజయంలో నా తల్లిదండ్రులు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, నా పాఠశాల సిబ్బంది, నా ఉపాధ్యాయులు, నా ప్రాణమిత్రులు, సహచరులందరూ భాగస్వాములే. వారి ఆశీస్సులు, స్ఫూర్తి, సహచర్యం నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లాయి. నేను పుట్టిన గడ్డకు రుణపడి ఉంటా. నా గ్రామానికి ఏదైనా చేయాలన్నది నా కోరిక. ఖమ్మం ఎప్పుడెప్పుడు రావాలా అనిపిస్తోంది. త్వరలోనే వచ్చి నా మాతృభూమి ఆశీర్వాదం తీసుకుంటా.
కాళ్ల కింద భూకంపం పుట్టేది
ఎవరెస్టు ఎక్కేందుకు వెళుతున్నప్పుడు భయమనిపించింది కానీ లక్ష్యం ముందు ఆ భయం చిన్నపోయింది. శవాలు కనిపించినప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది. అందరూ గుర్తొచ్చేవారు. లోతైన లోయల్లో నడుస్తున్నప్పుడు కాళ్ల కింద భూకంపం పుట్టేది. 20 కిలోల బరువు మోసుకుంటూ మంచు గడ్డలను ఛిద్రం చేసుకుంటూ వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస అందేది కాదు. అన్ని అవయవాలను సమన్వయం చేసుకోవాల్సి వచ్చేది. చాలా క్రమశిక్షణతో ముందుకెళ్లాల్సి వచ్చేది. అన్ని పరిస్థితులను అధిగమించడం ముందే అలవాటు చేసుకున్నాం. అయినా కష్టంగానే వెళ్లాం. రాత్రిళ్లు నడవాల్సి వచ్చినప్పుడు, బేస్‌క్యాంపులు దగ్గర్లోకి వచ్చినప్పుడు కొంత ఉత్కంఠకు లోనయ్యాను. ఏదిఏమైనా ఖచ్చితంగా ఎవరెస్టు శిఖరాన్ని తాకి రావాలన్న లక్ష్యంతోనే ముందుకెళ్లి విజయం సాధించా. చాలా సంతోషంగా ఉంది.
అమ్మ కదా... అంతే అంటుంది....
అమ్మా, నాన్నా నన్ను చాలా ప్రోత్సహించారు. వాళ్లు కనిపించిన వెంటనే కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటా. వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. చాలా చిన్న స్థాయి కుటుంబమైనా కష్టపడి నన్ను చదివిస్తున్నారు. అయినా అమ్మకు కొంచెం భయం. నేను ఎవరెస్టు ఎక్కేందుకు వెళుతున్నప్పుడు కూడా భయపడ్డారు. అమ్మ అంతే అంటుందిలే.. నాకు లక్ష్యం నెరవేరుస్తానన్న ధైర్యం ఉంది కదా అని వాళ్లకు కూడా ధైర్యం చెప్పి వెళ్లాను. ఐపీఎస్ కావాలన్నది నా కోరిక. ఇక, దాని కోసం శ్రమిస్తా.