ఖమ్మం, న్యూస్‌లైన్: ఎవరెస్టు శిఖరాన్ని సాహసోపేతంగా అధిరోహించిన మన్యం బిడ్డ సాధనపల్లి ఆనంద్‌కుమార్‌ను జిల్లా ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఆనంద్ సాధించిన ఘన కీర్తి స్ఫూర్తిదాయమని అంటున్నారు. అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
గొప్ప విజయం సాధించాడు
ఆనంద్ గొప్ప విజయాన్ని సాధించాడు. ఎంతో శ్రమతో కూడుకున్న సాహసమే చేశాడు. అతడి పట్టుదలకు జిల్లా అధికార యంత్రాంగం తరఫున అభినందనలు. ఇలాంటివి సాధించడం చాలా అరుదు. ఇతని స్ఫూర్తి విద్యార్థులందరికీ అవసరం. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు ఆనంద్, ఆయన సహచరి పూర్ణను అభినందించారు. కంగ్రాట్స్... ఆనంద్ కీపిట్‌అప్.. - శ్రీనివాస శ్రీనరేష్, కలెక్టర్
సంకల్పబలం ఉండాలి
ఆనంద్ సాధించిన విజయం గర్వకారణం. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం కష్టమైన పని. ఎంతో సంకల్పబలం ఉంటేనే గానీ సాధ్యం కాదు. ఎత్తయిన కొండల మధ్య చిన్న వయసులో అత్యంత సాహసోపేత యాత్ర చేశాడు. విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆనంద్‌కు అభినందనలు. అతడిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులందరూ విజయాలు సాధించాలి.
-సురేంద్రమోహన్, జాయింట్ కలెక్టర్
ఎవరెస్టుపై జిల్లా కీర్తి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని జిల్లాకు చెందిన విద్యార్థి సాధనపల్లి ఆనంద్‌కుమార్ అధిరోహించి జిల్లా కీర్తిని చాటాడు. ఆయన విజయం జిల్లాకే గర్వకారణం. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి అతిచిన్న వయసులోనే గొప్పసాహస కృత్యం చేయడం అభినందనీయం. ప్రమాదకరమని తెలిసినా పట్టువదలకండా ఈఘనతను సాధిం చడం గొప్ప విషయం. ఆనంద్ కుటుంబ సభ్యులతో పాటు అతడిని ప్రోత్సహించిన అధ్యాపకులు, స్నేహితులు, శిక్షకులకు అభినందనలు. ఆనంద్‌కు నా ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది. - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ
స్ఫూర్తిగా తీసుకోవాలి
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థుకు సరైన శిక్షణ ఇస్తే ఉన్నతులుగా ఎదుగుతారని ఆనంద్ రుజువ చేశాడు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఆనంద్ జిల్లా విద్యార్థి కావడం జిల్లాకే గర్వకారణం. ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విద్యార్థుల ప్రతిభను గుర్తించి, యాత్రకు అన్ని ఏర్పాటు చేయడంతోనే పేద విద్యార్థి పెద్ద రికార్డును సాధించాడు. ఇతర విద్యార్థులు ఆనంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. -రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి
అరుదైన రికార్డు సాధించాడు
అరుదైన రికార్డును జిల్లా విద్యార్థి సొంత చేసుకున్న విషయం తెలియగానే ఉబ్బితబ్బుబ్బిపోయాను. గిరిజన ప్రాంతానికి చెందిన విద్యార్థి ఈ విజయం సాధించడం చరిత్రపుఠల్లో లిఖించదగిన విషయం. సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం చేయూత నిస్తుందనడానికి ఆనంద్ సాహస యాత్రే నిదర్శనం. ఆనంద్ మరెన్ని విజయాలు, రికార్డులు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. -వెంకటనర్సయ్య, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి
దేశానికే గర్వకారణం
జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి ఎవరెస్టు శిఖరం అధిరోహించడం యావత్ భారతావనికే గర్వకారణం. జాతీయ జెండాను ఎవరెస్టు శిఖరంపై పాతిన జిల్లా విద్యార్థి ఆనంద్‌కు అభినందనలు. ప్రతిభావంతులను గుర్తించి వారి ప్రతిభకు మెరుగు పెడితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆనంద్ రుజువు చేశాడు. -పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే
తెలంగాణ బిడ్డ కీర్తి చాటాడు..
కనీస సౌకర్యాలకు కూడా నోచుకొని గిరిజన ప్రాంతం చర్ల మండలానికి చెందిన ఆనందర్ ఎవరెస్టు శిఖరం అధిరోహించడం దేశానికే గర్వకారణం. ప్రత్యేక రాష్ట్రం కల సాకారమవుతున్న తరుణంలో మనందరికీ ఆనందదాయక విషయం. అరుదైన సాహస యాత్ర చేసి విజయం సాధించి తెలంగాణ తేజాన్ని ప్రపంచం కీర్తిస్తోంది. పేద విద్యార్థిని ప్రొత్సహించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌కు, సాహస యాత్రకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృ జ్ఞతలు. - ఆర్జేసీ కృష్ణ, విద్యావేత్త
తెలుగు జాతి గర్వించ దగిన రోజు
ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరం అధిరోహించడం తెలుగుజాతి గర్వించ దగిన విషయం. తెలుగుతేజాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిని జిల్లా విద్యార్థి ఆనంద్‌కు అభినందనలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంలో ఇలాంటి రికార్డులు జిల్లా విద్యార్థి సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. - కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
సాహస వీరుడికి సలాం..
ఎవరెస్టు శిఖరం అధిరోహించిన ప్రముఖుల జాబితాలో జిల్లా విద్యార్థి చేయడం సంతోషకరం. ఎంతో సాహసం, ఓర్పు, పట్టుదల ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఎత్తయిన శిఖరంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఆనంద్‌కు అభినందనలు. పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని రుజువు చేసిన సాహస వీరునికి, మట్టిలో మాణిక్యాన్ని గుర్తించి ప్రోత్సహించిన ఐఏఎస్ అధికారికి సలాం. - శ్రీనివాస్, ఖమ్మం కమీషనర్
ఎవరెస్టంత సంబురం
Published Mon, May 26 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement