మన్యం పుత్రుడి ఘనత
ఖమ్మం జిల్లా కలివేరులో ఆనందోత్సాహాలు
చర్ల, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని చర్ల మండలంలో ఎక్కడో అడవిలో విసిరిపారేసినట్టున్న ఓ గిరిజన గ్రామం పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఆ గ్రామానికి చెందిన దళిత యువకుడు అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే కారణం. చర్ల మండలం కలివేరుకు చెందిన ఆనంద్‌కుమార్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’ ఆయన స్వగ్రామాన్ని సందర్శిం చింది. ఆనంద్ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందంలో మునిగిపోయారు. తమ కుమారుడు సాధించిన ఘనత కు తల్లిదండ్రులు కొండలరావు, లక్ష్మి మురిసిపోతున్నారు.
స్కూలుకు వెళ్లనన్నాడు: మొదట ఏడో తరగతి వరకు చదువుకున్న ఆనంద్.. కుటుంబ ఆర్థిక పరిస్థితి, స్నేహాల కారణంగా చదువు వద్దనుకున్నాడు. బడికి వెళ్లనంటూ మారాం చేసి మరీ కూలీ పనులకు వెళ్లాడు. ఏడాది పాటు అలాగే గడిచింది. అయితే బడికి వెళ్లకపోతే చనిపోతానని తల్లి బెదిరించడంతో ఆనంద్ మళ్లీ బడి బాట పట్టాడు. సైకిల్ మెకానిక్‌గా పని చేస్తున్న తండ్రి కొండలరావు అతడ్ని చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించాడు.
క్రీడలంటే ప్రాణం...: మొదటి నుంచి ఆట లంటే ఇష్టపడే ఆనంద్ వాలీబాల్, హ్యాండ్‌బా ల్, అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరి చాడు. టెన్‌తలో ప్రథమ శ్రేణిలో పాసై అక్కడే ఏపీఆర్‌జేసీలో ఇంటర్ బైపీసీలో చేరాడు. ఫస్టియర్ చదువుతున్న సమయంలో సాహసయాత్రలకు దరఖాస్తు చేసుకున్నా డు. నల్లగొండ జిల్లా భువనగిరిలో శిక్షణ పొంది.. పలు శిఖరాలను అధిరోహించాడు. ఇదే క్రమంలో కఠిన పరి స్థితులను తట్టుకునే సామర్థ్యం కనబరిచిన ఆనంద్‌ను ఎవరెస్ట్ యాత్రకు ఎంపిక చేశారు. ఎవరెస్ట్‌ను ఎక్కిన ఆనంద్‌కు ఐపీఎస్ అవ్వాలన్న ఆశయం ఉందని, అది కూడా కచ్చితంగా నెర వేరుతుందని అతని తల్లిదండ్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.