Malavat purna
-
మన్యం పుత్రుడి ఘనత
ఖమ్మం జిల్లా కలివేరులో ఆనందోత్సాహాలు చర్ల, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని చర్ల మండలంలో ఎక్కడో అడవిలో విసిరిపారేసినట్టున్న ఓ గిరిజన గ్రామం పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఆ గ్రామానికి చెందిన దళిత యువకుడు అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే కారణం. చర్ల మండలం కలివేరుకు చెందిన ఆనంద్‌కుమార్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’ ఆయన స్వగ్రామాన్ని సందర్శిం చింది. ఆనంద్ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందంలో మునిగిపోయారు. తమ కుమారుడు సాధించిన ఘనత కు తల్లిదండ్రులు కొండలరావు, లక్ష్మి మురిసిపోతున్నారు. స్కూలుకు వెళ్లనన్నాడు: మొదట ఏడో తరగతి వరకు చదువుకున్న ఆనంద్.. కుటుంబ ఆర్థిక పరిస్థితి, స్నేహాల కారణంగా చదువు వద్దనుకున్నాడు. బడికి వెళ్లనంటూ మారాం చేసి మరీ కూలీ పనులకు వెళ్లాడు. ఏడాది పాటు అలాగే గడిచింది. అయితే బడికి వెళ్లకపోతే చనిపోతానని తల్లి బెదిరించడంతో ఆనంద్ మళ్లీ బడి బాట పట్టాడు. సైకిల్ మెకానిక్‌గా పని చేస్తున్న తండ్రి కొండలరావు అతడ్ని చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించాడు. క్రీడలంటే ప్రాణం...: మొదటి నుంచి ఆట లంటే ఇష్టపడే ఆనంద్ వాలీబాల్, హ్యాండ్‌బా ల్, అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరి చాడు. టెన్తలో ప్రథమ శ్రేణిలో పాసై అక్కడే ఏపీఆర్జేసీలో ఇంటర్ బైపీసీలో చేరాడు. ఫస్టియర్ చదువుతున్న సమయంలో సాహసయాత్రలకు దరఖాస్తు చేసుకున్నా డు. నల్లగొండ జిల్లా భువనగిరిలో శిక్షణ పొంది.. పలు శిఖరాలను అధిరోహించాడు. ఇదే క్రమంలో కఠిన పరి స్థితులను తట్టుకునే సామర్థ్యం కనబరిచిన ఆనంద్‌ను ఎవరెస్ట్ యాత్రకు ఎంపిక చేశారు. ఎవరెస్ట్‌ను ఎక్కిన ఆనంద్‌కు ఐపీఎస్ అవ్వాలన్న ఆశయం ఉందని, అది కూడా కచ్చితంగా నెర వేరుతుందని అతని తల్లిదండ్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఇందూరు బిడ్డకు జేజేలు
సాహసమే పూర్ణ ఊపిరి సిరికొండ/తాడ్వాయి, న్యూస్‌లైన్: సాహసమే ఆమె ఊపిరి. మనోధైర్యమే ఆమె బలం. అందుకే ఎవరెస్ట్ సైతం ఆమెకు తలవంచింది. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి అత్యంత చిన్న వయసులోనే ప్రపంచంలో ఎత్తయిన శిఖరాన్ని అధిరోహిం చింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన గిరిజన బాలిక మాలావత్ పూర్ణ ఈ అరుదైన ఘనత సాధించింది. మాలావత్ దేవీదాస్-లక్ష్మి దంపతుల కూతురు పూర్ణ.. తాడ్వాయిలోని సాంఘిక సంక్షేమ గురుకు ల పాఠశాలలో ఇటీవ లే తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుంది. ఐదో తరగతి వరకు పాకాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివిన పూర్ణ చిన్నప్పటి నుంచే క్రీడల్లో ముందుండేది. గురుకుల పాఠశాలలో చేరిన తర్వాత ఉపాధ్యాయుల ప్రో త్సాహంతో పర్వతారోహణపై దృష్టి సారిం చింది. కఠోరమైన పరిస్థితులు : యాత్రలో భాగంగా 52 రోజుల పాటు సాహసమే ఊపిరిగా ముందుకు సా గిన పూర్ణ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. హిమాలయ పర్వతాన్ని అధిరోహించే సమయంలో 20 కిలోల బరువున్న దుస్తులను ధరించింది. తీవ్రమై న మంచు, చలి, తక్కువ ఆక్సిజన్, ప్రాణాంతక డెత్జోన్ను దాటడం వంటి ఎన్నో కఠోరమైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది. తమ ఊరి బిడ్డ ఉన్నత శిఖరాన్ని అధిరోహించిందని తెలియగానే పాకాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఎంతో గర్వంగా ఉంది నా కూతురు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం ఎంతో గర్వంగా ఉంది. మా పాప అంత పెద్ద గుట్టను, అంత చలిలో ఎక్కాల్సి ఉంటుందని సార్లు మొదట చెప్పగానే చాలా భయమేసింది. పంపించొద్దనుకున్నా. కాని పూర్ణనే నాకు ధైర్యం చెప్పింది. ఏం కాదు నాన్న నేను శిఖరాన్ని సులువుగా ఎక్కుతానని చెప్పి శిక్షణకు వెళ్లింది. చిన్నప్పుడు పూర్ణ ఎంతో స్పీడ్‌గా సైకిల్ తొక్కేది. చాలా వేగంగా కబడ్డీ ఆడేది. ఇలాంటి ఆటల వల్లనేనేమో అంత పెద్ద శిఖరాన్ని నా బిడ్డ ఎక్కగలిగింది. - మాలావత్ దేవీదాస్, పూర్ణ తండ్రి వద్దని ఏడ్చేశాను నా బిడ్డను అంత చలిలో అంత పెద్ద మంచు కొండను ఎక్కేందుకు తీసుకెళ్తామంటే వద్దని బాగా ఏడ్చేశాను. ఆ కొండ ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉంటే ఇంటికి తిరిగి రావొచ్చు. లేదంటే ఇంకా ఏమైనా జరగొచ్చు అని సార్లు చెప్పిండ్రు. అక్కడికి పోవద్దని ఎంత చెప్పినా మా పూర్ణ అస్సలు వినలేదు. నాకైతే బాగానే భయమేసింది. నా బిడ్డ అంత పెద్ద కొండ ఎక్కిందని టీవీల్లో చూపిస్తుంటే ఎంతో ఆనందపడ్డాను. - మాలావత్ లక్ష్మి, పూర్ణ తల్లి -
ఎవరెస్ట్‌ను మించిన సంకల్పం
‘మిషన్ ఎవరెస్ట్’ వెనుక ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: డాక్టర్ రేపల్లె శివప్రవీణ్‌కుమార్.. సీనియర్ ఐపీఎస్ అధికారి. ‘స్వేరోస్’గా పిలిచే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు ఏడాది క్రితం ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పర్వతంపై తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడించింది. నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌లు ‘మిషన్ ఎవరెస్ట్’ను అధిరోహించినా వారిని వెన్నంటి ముందుకు నడిపింది మాత్రం ఈ ఐపీఎస్ అధికారే! సంకల్పం మొగ్గతొడిగిందిలా.. ప్రవీణ్‌కుమార్ స్వేరోస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 గురుకుల పాఠశాలల్ని సందర్శించి 90 వేల మందితో స్వయంగా మాట్లాడారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో దాగున్న అద్భుత శక్తిసామర్థ్యాలను గమనించారు. చదువంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదని, ఆ విద్యార్థులకు ప్రపంచాన్ని చూపించాలని భావించారు. సహజంగానే పోలీసు అధికారి కావడంతో వారికి సాహసక్రీడల్ని పరిచయం చేయాలని సంకల్పించారు. అదే సందర్భంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్ ద్వారా శేఖర్‌బాబు అనే వ్యక్తి పరిచయమయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కండక్టర్ కుమారుడైన శేఖర్ దక్షిణ భారతదేశం నుంచి ఎవరెస్ట్ ఎక్కిన ఎకైక వ్యక్తి. 2007లో ఈ ఘనత సాధించారని తెలియడంతో ఆయన సహకారంతో గురుకుల విద్యార్థుల్ని పర్వతారోహకులుగా చేయాలని భావించారు. భువనగిరి నుంచి తొలి అడుగు సాహస క్రీడలకు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. దీంతో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్నీ స్వేరోస్ సంప్రదించింది. అనేక ప్రయత్నాల అనంతరం కిందటేడాది మేలో 110 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని సాహసక్రీడల శిక్షణ ఇప్పించేందుకు అంగీకరించారు. శేఖర్‌బాబు పర్యవేక్షణలో 30 రోజుల పాటు భువనగిరిలో శిక్షణ ఇచ్చి అక్కడే ఉన్న 600 మీటర్ల ఏకశిలను ఎక్కించారు. ఇందులో ‘ఏ గ్రేడ్’ వచ్చిన 20 మందిని ఎంపిక చేసి అదనపు శిక్షణ కోసం డార్జిలింగ్‌లో టెంజింగ్ నార్గే స్థాపించిన ప్రతిష్ఠాత్మకమైన హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్కు పంపించాని నిర్ణయించారు. అప్పటి వరకు కనీసం రైలు కూడా చూడని ఈ విద్యార్థులు 2013 సెప్టెంబర్‌లో రెలైక్కి డార్జిలింగ్‌కు పయనమయ్యారు. కానీ ఆ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే కనీస వయస్సు 17 ఏళ్లు ఉండాలి. ఈ 20 మందిలో అనేక మంది 14 ఏళ్ల వారే ఉండటంతో శిక్షణ ఇవ్వమని చెప్పారు. స్వేరోస్ అభ్యర్థన మేరకు కాస్త మెత్తబడ్డారు. పదేసి కిలోల బరువు భుజాన వేసి పది కిలోమీటర్లు పరిగెత్తమంటూ విద్యార్థులకు పరీక్ష పెట్టారు. ఇందులో ఆర్మీ వారినే అధికమించడంతో అవాక్కైన ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్... ఈ గురుకుల విద్యార్థుల కోసం తొలిసారిగా ప్రత్యేక బ్యాచ్ ప్రారంభించారు. శిక్షణ తర్వాత 10 రోజుల ఎక్స్‌పెడిషన్‌లో భాగంగా కాంచనగంగ శిఖరం వైపు నడిపించారు. ఇందులో పాల్గొన్న ఆర్మీ వారు కేవలం 14 వేల అడుగుల నుంచే వెనక్కు వచ్చేయగా... మొత్తం 20 మంది విద్యార్థుల్లో 19 మంది మౌంట్ రీనాక్ పర్వతం వైపు 17 వేల అడుగుల వరకు వెళ్లి అబ్బురపరిచారు. మిషన్ ఇలా మొదలైంది ఈ 19 మంది ప్రతిభను అంచనా వేసిన శిక్షకుడు జ్యోతి వీరిలో ఏడుగురు మాత్రం ఎవరెస్ట్ శిఖరం వైపు 17 వేల మీటర్ల వరకు వెళ్లగలరని చెప్పారు. దీంతో ‘టార్గెట్ ఎవరెస్ట్’ మొదలైంది. ఇందుకు 10 మందిని ఎంపిక చేసి గతేడాది సెప్టెంబర్‌లో లడక్ పంపారు. అప్పటి వరకు ఆకాశంలో ఎగిరే విమానాన్ని మాత్రమే చూసిన ఈ గురుకుల విద్యార్థులు జీతంలో తొలిసారిగా అందులో ప్రయాణించి తమ లక్ష్యం వైపు అడుగులు వేశారు. మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో, 18 వేల అడుగుల ఎత్తులో 50 రోజులపాటు శిక్షణ పొందారు. వీరిలో చివరికి నలుగురికి ఎవరెస్ట్ అధిరోహించే శక్తి ఉందని అంచనా వేశారు. ఈ నలుగురిలో ఓ బాలిక కూడా ఉండటంతో ఆమెను కూడా ఎవరెస్ట్ ఎక్కించాలని నిర్ణయించారు. అదనపు పరీక్షల తర్వాత ఈ నలుగురిలో మాలావత్ పూర్ణ, ఎస్.ఆనంద్‌కుమార్‌లను ఎవరెస్ట్ వైపు నడిపించాలని నిశ్చయించుకున్నారు. షెర్పాలకే స్ఫూర్తినిచ్చిన విద్యార్థులు.. ఆదివారానికి సరిగ్గా 52 రోజుల క్రితం పూర్ణ, ఆనంద్ ఎవరెస్ట్ వైపు అడుగులు వేయడం ప్రారంభించారు. శేఖర్ బాబు సూచలన మేరకు చైనీస్ మౌంటేయినింగ్ ఫెడరేషన్ ద్వారా ఉత్తరం వైపు నుంచి ఎవరెస్ట్ ఎక్కే అనుమతి పొందారు. సురక్షితంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అదేసమయంలో నేపాల్‌లో ఏప్రిల్ 18న జరిగిన ప్రమాదం నేపథ్యంలో పర్వతారోహకులకు మార్గనిర్దేశం చేసే షెర్పాలు సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు పూర్ణ అస్వస్థతకు గురైంది. అయినా ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకే వెళ్తానంటూ పట్టుపట్టడం చూసిన షెర్పాలు.. తమ సమ్మె విరమించారు. వివిధ దేశాల నుంచి ఎవరెస్ట్ అధిరోహణకు వచ్చిన 100 మంది సాహసికులతో ముందుకు కదిలారు. ఈ బృందంలో ఆదివారం ఉదయానికి కేవలం 30 మందే ఎవరెస్ట్ ఎక్కారు. వారిలో సూర్యోదయ సమయంలో ముందుగా అడుగు పెట్టింది మన పూర్ణే. మరో అరగంటకు ఆనంద్ రాగా.. మిగిలిన 28 మందీ రెండు గంటల తర్వాత శిఖరాన్ని అధిరోహించారు. గురుకుల విద్యార్థులు తమ వెంట భారత జాతీయ పతాకం, బీఆర్ అంబేద్కర్ పతాకం,ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్ వ్యవస్థాపకుడైన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్సార్ శంకర్లకు చెందిన పతాకాలను తీసుకువెళ్లారు. చాలా ఆనందంగా ఉంది 2007లో నేను ఎవరెస్ట్ ఎక్కినప్పటికంటే ఈరోజు ఎక్కువ ఆనందం కలిగింది. పూర్ణ, ఆనంద్ సురక్షితంగా తిరిగి బేస్ క్యాంప్ వైపు బయలుదేరారు. సోమవారానికి అక్కడికి చేరుకోనున్నారు. - చైనా నుంచి ‘సాక్షి’తో ఫోనులో శేఖర్‌బాబు పాఠ్యాంశంగా పెడతాం పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన నిరుపేద విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌లు ఐపీఎస్ అధికారులు కావడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. వీరి సాహస గాథను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని నిర్ణయించాం. -ప్రవీణ్‌కుమార్, ఏపీఎస్డ బ్ల్యూర్ఈఐఎస్ కార్యదర్శి -
సాహస యాత్ర సం'పూర్ణం'
ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు...14 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాలావత్ పూర్ణ * అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు * విజయ పతాకం ఎగరేసిన ఆనంద్ కుమార్ * 52 రోజుల పాటు 30 మంది బృందంతో సాగిన ట్రెక్కింగ్ * ఆదివారం ఉదయం 6 గంటలకు అపూర్వ ఘట్టం * సత్తా చాటిన గురుకుల విద్యార్థులు * కాబోయే ప్రధాని మోడీ అభినందనలు సాక్షి, హైదరాబాద్: ఆకాశాన్నంటే ఎవరెస్ట్ శిఖరంపై తెలుగు తేజాలు వెలుగులీనాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు పేద విద్యార్థులు ఆదివారం సూర్యోదయ వేళ ఎవరెస్ట్ శిఖరాగ్రంపై అడుగుపెట్టారు. దీంతో సరికొత్త రికార్డు కూడా నమోదైంది. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల మాలావత్ పూర్ణ రికార్డు సృష్టించింది. మొత్తం 30 మంది పర్వతారోహకుల బృందంలో ఉదయం ఆరు గంటలకు మొట్టమొదటగా అక్కడకు చేరుకున్న పూర్ణ ఈ అరుదైన ఘనత సాధించింది. మరో విద్యార్థి 16 ఏళ్ల సాధ నపల్లి ఆనంద్‌కుమార్ అరగంట తేడాతో శిఖరం పైకి చేరుకున్నాడు. మిగిలిన 28 మంది పర్వతారోహకులు మరో రెండు గంటల తర్వాతే యాత్ర పూర్తి చేయగలిగారు. సముద్రమట్టానికి 8848 మీటర్ల ఎత్తుకు వెళ్లిన ఈ బృందం అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరుగు ప్రయాణమైంది. అత్యంత ప్రమాదకరమైన డెత్జోన్ నుంచి బేస్ క్యాంప్ వైపు ఈ బృందం వెనక్కు వస్తోంది. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంయుక్త ఆధ్వర్యంలో 52 రోజుల క్రితం ఈ యాత్ర ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు లక్ష్మీ, దేవదాస్‌ల కుమార్తె మాలావత్ పూర్ణ స్వేరోస్ (14) ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇక ఖమ్మం జిల్లా చార్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన కొండలరావు ఓ సైకిల్ షాపులో దినసరి కూలీ. ఇతడి కుమారుడు ఆనంద్‌కుమార్ (17) అన్నపురెడ్డిపల్లిలో ఉన్న గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరి శిక్షకుడు శేఖర్‌బాబు నేతృత్వంలో ఈ సాహస యాత్ర జరిగింది. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసే యత్నాల్లో భాగంగా ఈ సాహస యాత్ర కోసం తొలుత 150 మందిని ఎంపిక చేశారు. వీరిలో 20 మందికి డార్జిలింగ్‌లోని ప్రఖ్యాత సంస్థలో ట్రెక్కింగ్‌పై శిక్షణనిచ్చారు. తర్వాత వీరిలో నుంచి 9 మంది గతంలో ఇండో-చైనా సరిహద్దుల్లో నిర్వహించిన సాహసయాత్రలో పాల్గొన్నారు. అత్యంత కఠిన పరిస్థితులను సైతం ఎదుర్కునే సామర్థ్యం కనబరిచిన పూర్ణ, ఆనంద్ కుమార్ ఎవరెస్ట్ యాత్రకు ఎంపికయ్యారు. గర్వపడేలా చేశారు: మోడీ అతి చిన్న వయస్సులోనే ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలవత్ పూర్ణతో పాటు ఆనంద్‌కుమార్‌కు కాబోయే ప్రధాని, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘ఈ విషయం చదివినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు. వారు మనం గర్వపడేలా చేశారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వార్తకు సంబంధించిన కథనాన్ని కూడా ఆన్లైన్లో పోస్ట్ చేశారు. దేశం గర్వించేలా నిలిచారు: వైఎస్ జగన్ చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. చిన్నతనంలోనే గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశం యావత్తూ గర్వపడేలా అద్భుతం సాధించారని కొనియాడారు. పూర్ణ, ఆనంద్‌లు మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిదాతలుగా నిలిచారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారిని తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు, గురువులకూ ఆయన అభినందనలు తెలియజేశారు. టీపీసీసీ తరఫున రూ.5 లక్షలు: పొన్నాల అవకాశాలను అందిపుచ్చుకుని పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన సాహస బాలురకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నజరానా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన రాష్ర్ట విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు రూ. 5 లక్షల చొప్పున నగదు పురస్కారంతో పాటు, వారిని ఘనంగా సన్మానించనున్నట్లు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. ఇక పూర్ణ, ఆనంద్‌లను టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కూడా అభినందించారు. ఎవరెస్ట్ అధిరోహణతో తెలంగాణ గౌరవాన్ని హిమాలయాలంత ఎత్తుకు పెంచారని శ్లాఘించారు.