ఎవరెస్ట్‌ను మించిన సంకల్పం
‘మిషన్ ఎవరెస్ట్’ వెనుక ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ రేపల్లె శివప్రవీణ్‌కుమార్.. సీనియర్ ఐపీఎస్ అధికారి. ‘స్వేరోస్’గా పిలిచే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు ఏడాది క్రితం ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పర్వతంపై తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడించింది. నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌లు ‘మిషన్ ఎవరెస్ట్’ను అధిరోహించినా వారిని వెన్నంటి ముందుకు నడిపింది మాత్రం ఈ ఐపీఎస్ అధికారే!
సంకల్పం మొగ్గతొడిగిందిలా..
ప్రవీణ్‌కుమార్ స్వేరోస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 గురుకుల పాఠశాలల్ని సందర్శించి 90 వేల మందితో స్వయంగా మాట్లాడారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో దాగున్న అద్భుత శక్తిసామర్థ్యాలను గమనించారు. చదువంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదని, ఆ విద్యార్థులకు ప్రపంచాన్ని చూపించాలని భావించారు. సహజంగానే పోలీసు అధికారి కావడంతో వారికి సాహసక్రీడల్ని పరిచయం చేయాలని సంకల్పించారు. అదే సందర్భంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్ ద్వారా శేఖర్‌బాబు అనే వ్యక్తి పరిచయమయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కండక్టర్ కుమారుడైన శేఖర్ దక్షిణ భారతదేశం నుంచి ఎవరెస్ట్ ఎక్కిన ఎకైక వ్యక్తి. 2007లో ఈ ఘనత సాధించారని తెలియడంతో ఆయన సహకారంతో గురుకుల విద్యార్థుల్ని పర్వతారోహకులుగా చేయాలని భావించారు.
భువనగిరి నుంచి తొలి అడుగు
సాహస క్రీడలకు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. దీంతో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్నీ స్వేరోస్ సంప్రదించింది. అనేక ప్రయత్నాల అనంతరం కిందటేడాది మేలో 110 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని సాహసక్రీడల శిక్షణ ఇప్పించేందుకు అంగీకరించారు. శేఖర్‌బాబు పర్యవేక్షణలో 30 రోజుల పాటు భువనగిరిలో శిక్షణ ఇచ్చి అక్కడే ఉన్న 600 మీటర్ల ఏకశిలను ఎక్కించారు. ఇందులో ‘ఏ గ్రేడ్’ వచ్చిన 20 మందిని ఎంపిక చేసి అదనపు శిక్షణ కోసం డార్జిలింగ్‌లో టెంజింగ్ నార్గే స్థాపించిన ప్రతిష్ఠాత్మకమైన హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించాని నిర్ణయించారు.
అప్పటి వరకు కనీసం రైలు కూడా చూడని ఈ విద్యార్థులు 2013 సెప్టెంబర్‌లో రెలైక్కి డార్జిలింగ్‌కు పయనమయ్యారు. కానీ ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలంటే కనీస వయస్సు 17 ఏళ్లు ఉండాలి. ఈ 20 మందిలో అనేక మంది 14 ఏళ్ల వారే ఉండటంతో శిక్షణ ఇవ్వమని చెప్పారు. స్వేరోస్ అభ్యర్థన మేరకు కాస్త మెత్తబడ్డారు. పదేసి కిలోల బరువు భుజాన వేసి పది కిలోమీటర్లు పరిగెత్తమంటూ విద్యార్థులకు పరీక్ష పెట్టారు. ఇందులో ఆర్మీ వారినే అధికమించడంతో అవాక్కైన ఆ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపల్... ఈ గురుకుల విద్యార్థుల కోసం తొలిసారిగా ప్రత్యేక బ్యాచ్ ప్రారంభించారు. శిక్షణ తర్వాత 10 రోజుల ఎక్స్‌పెడిషన్‌లో భాగంగా కాంచనగంగ శిఖరం వైపు నడిపించారు. ఇందులో పాల్గొన్న ఆర్మీ వారు కేవలం 14 వేల అడుగుల నుంచే వెనక్కు వచ్చేయగా... మొత్తం 20 మంది విద్యార్థుల్లో 19 మంది మౌంట్ రీనాక్ పర్వతం వైపు 17 వేల అడుగుల వరకు వెళ్లి అబ్బురపరిచారు.
మిషన్ ఇలా మొదలైంది
ఈ 19 మంది ప్రతిభను అంచనా వేసిన శిక్షకుడు జ్యోతి వీరిలో ఏడుగురు మాత్రం ఎవరెస్ట్ శిఖరం వైపు 17 వేల మీటర్ల వరకు వెళ్లగలరని చెప్పారు. దీంతో ‘టార్గెట్ ఎవరెస్ట్’ మొదలైంది. ఇందుకు 10 మందిని ఎంపిక చేసి గతేడాది సెప్టెంబర్‌లో లడక్ పంపారు. అప్పటి వరకు ఆకాశంలో ఎగిరే విమానాన్ని మాత్రమే చూసిన ఈ గురుకుల విద్యార్థులు జీతంలో తొలిసారిగా అందులో ప్రయాణించి తమ లక్ష్యం వైపు అడుగులు వేశారు. మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో, 18 వేల అడుగుల ఎత్తులో 50 రోజులపాటు శిక్షణ పొందారు. వీరిలో చివరికి నలుగురికి ఎవరెస్ట్ అధిరోహించే శక్తి ఉందని అంచనా వేశారు. ఈ నలుగురిలో ఓ బాలిక కూడా ఉండటంతో ఆమెను కూడా ఎవరెస్ట్ ఎక్కించాలని నిర్ణయించారు. అదనపు పరీక్షల తర్వాత ఈ నలుగురిలో మాలావత్ పూర్ణ, ఎస్.ఆనంద్‌కుమార్‌లను ఎవరెస్ట్ వైపు నడిపించాలని నిశ్చయించుకున్నారు.
షెర్పాలకే స్ఫూర్తినిచ్చిన విద్యార్థులు..
ఆదివారానికి సరిగ్గా 52 రోజుల క్రితం పూర్ణ, ఆనంద్ ఎవరెస్ట్ వైపు అడుగులు వేయడం ప్రారంభించారు. శేఖర్ బాబు సూచలన మేరకు చైనీస్ మౌంటేయినింగ్ ఫెడరేషన్ ద్వారా ఉత్తరం వైపు నుంచి ఎవరెస్ట్ ఎక్కే అనుమతి పొందారు. సురక్షితంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అదేసమయంలో నేపాల్‌లో ఏప్రిల్ 18న జరిగిన ప్రమాదం నేపథ్యంలో పర్వతారోహకులకు మార్గనిర్దేశం చేసే షెర్పాలు సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు పూర్ణ అస్వస్థతకు గురైంది. అయినా ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకే వెళ్తానంటూ పట్టుపట్టడం చూసిన షెర్పాలు.. తమ సమ్మె విరమించారు.
వివిధ దేశాల నుంచి ఎవరెస్ట్ అధిరోహణకు వచ్చిన 100 మంది సాహసికులతో ముందుకు కదిలారు. ఈ బృందంలో ఆదివారం ఉదయానికి కేవలం 30 మందే ఎవరెస్ట్ ఎక్కారు. వారిలో సూర్యోదయ సమయంలో ముందుగా అడుగు పెట్టింది మన పూర్ణే. మరో అరగంటకు ఆనంద్ రాగా.. మిగిలిన 28 మందీ రెండు గంటల తర్వాత శిఖరాన్ని అధిరోహించారు. గురుకుల విద్యార్థులు తమ వెంట భారత జాతీయ పతాకం, బీఆర్ అంబేద్కర్ పతాకం,ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్ వ్యవస్థాపకుడైన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్సార్ శంకర్‌లకు చెందిన పతాకాలను తీసుకువెళ్లారు.
చాలా ఆనందంగా ఉంది
2007లో నేను ఎవరెస్ట్ ఎక్కినప్పటికంటే ఈరోజు ఎక్కువ ఆనందం కలిగింది. పూర్ణ, ఆనంద్ సురక్షితంగా తిరిగి బేస్ క్యాంప్ వైపు బయలుదేరారు. సోమవారానికి అక్కడికి చేరుకోనున్నారు.
- చైనా నుంచి ‘సాక్షి’తో ఫోనులో శేఖర్‌బాబు
పాఠ్యాంశంగా పెడతాం
పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన నిరుపేద విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌లు ఐపీఎస్ అధికారులు కావడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. వీరి సాహస గాథను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని నిర్ణయించాం.
-ప్రవీణ్‌కుమార్, ఏపీఎస్‌డ బ్ల్యూర్‌ఈఐఎస్ కార్యదర్శి