వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీ కుమార్
సాక్షి, సిటీబ్యూరో: కేవలం పగటి వేళల్లోనే కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, చోరీలకు పాల్పడుతున్న ఆనంద్‌కుమార్ అలియాస్ నందును నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14న ఓ ఇంటి నుంచి రూ.11 లక్షల సొత్తు, నగదు ఎత్తుకు వెళ్లిన ఇతడిని కేవలం 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని 15నే అరెస్టు చేసినా గురువారంఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్, కాచిగూడ ఏసీపీ నర్సయ్యలతో కలిసి సీపీ అంజనీకుమార్ గురువారం వివరాలు వెల్లడించారు. బాగ్ అంబర్‌పేటలోని గంగబౌలి ప్రాంతానికి చెందిన ఆనంద్‌కుమార్ పాత నేరస్తుడు. 2001–15 మధ్య హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ ఠాణాల పరిధుల్లోనూ నేరాలకు పాల్పడ్డాడు. పగటి వేళల్లో, యజమానులు ఉద్యోగాలకు వెళ్లే సమయాల్లో కాలనీల్లో సంచరించే ఇతను తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు.
అదును చూసుకుని తాళం పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించి సొత్తు, సొమ్ము ఎత్తుకెళ్లేవాడు. ఇదే పంథాలో గతంలో మహంకాళి, నల్లకుంట, చిక్కడపల్లి, ఎస్సార్‌నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి, కోదాడ పోలీసు స్టేషన్ల పరిధుల్లో నేరాలు చేశాడు. తాజాగా ఈ నెల 14న నల్లకుంట పరిధిలో నివసిస్తున్న నర్సు సముద్ర ఇంట్లోకి ప్రవేశించిన ఇతను 25 తులాల బంగారం, రూ.4.57 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నల్లకుంట పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని నందుగా గుర్తించారు. ముమ్మరంగా వేటాడిన అధికారులు 15న అతడిని అరెస్టు చేసి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నందుపై మహంకాళి, నల్లకుంట, చిక్కడపల్లి, ఎస్సార్‌నగర్ ఠాణాల్లో నమోదైన కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. కోదాడలో నమోదైన ఓ కేసులో ఇతడికి మూడేళ్ళ జైలు శిక్ష కూడా పడింది. నందు నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించామని సీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment