ఎవరెస్ట్ వీరులకు మోడీ సన్మానం
చిన్న వయసులోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు నెలకొల్పిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం వీరిద్దరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. పూర్ణ, ఆనంద్లను మోడీ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్ణ, ఆనంద్లను మోడీ సన్మానిస్తున్నప్పటి ఫొటోను పీఎంఓ ప్రధాని కార్యాలయం అధికారులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. (చదవండి: మా సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నదైంది)
పూర్ణ, ఆనంద్లు గురువారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని సాధించి దేశంలోని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారితో కలసి ఫొటోలు దిగారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్‌ను కూడా ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. వారిని మంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. (చదవండి: కష్టమనిపించినా.. ఇష్టపడి చేశాం)
తెలుగు తేజం పూర్ణ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి.. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్‌ఇయర్ చదువుతున్నాడు.