
ఇక్కడ చదివితే ఐఐటీ గ్యారంటీ...
ఆనంద్‌కుమార్...
ఆ పేరు ప్రపంచానికి పెద్దగా తెలీదు... కానీ ఐఐటీలోకి ప్రవేశించే ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు మాత్రం సుపరిచితం.
ఆయన మీద డిస్కవరీ చానల్‌లో కార్యక్రమం ప్రసారమైంది...
టైమ్ మ్యాగ జైన్ ఒక కథనాన్ని ప్రచురించింది...
ఎన్నో సంస్థలు తమతో చేయి కలపమన్నాయి...
అన్నిటినీ తిరస్కరించారు ఆనంద్‌కుమార్...
ఇంతకీ ఈ ఆనంద్‌కుమార్ ఎవరు?
పాట్నాలోని ఒక మారుమూల ప్రదేశంలోకి ప్రవేశించగానే ‘రామానుజన్ స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్’ అకాడమీ కనిపిస్తుంది. అందులోకి అడుగుపెట్టగానే కూటికి పేదలైన 30 మంది విద్యార్థులు, ‘మేం చదువుకి పేదలం కాము’ అన్నట్లుగా కనిపిస్తారు. వారి మధ్య ఎంతో దీక్షగా పాఠాలు చెబుతూ కనిపిస్తారు అనేక అవార్డులు అందుకున్న 31 సంవత్సరాల ఆనంద్ కుమార్. ‘‘మా నాన్నగారు పోస్టాఫీస్‌లో పని చేసేవారు.
నేను స్థానిక హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే నాకు లెక్కల మీద ఆసక్తి కలిగింది’’ అంటూ లెక్కల మీద ఉన్న ప్రేమ గురించి చెబుతారు ఆనంద్. భారతీయ గణిత శాస్త్రవేత్త ‘శ్రీనివాస రామానుజన్’ ను అమితంగా ఆరాధించే ఆనంద్‌కుమార్ తన అకాడమీకి ఆయన పేరు పెట్టుకున్నాను.
డిగ్రీ చదువుతున్న రోజులలో ఆనంద్‌కుమార్ నంబర్ థియరీ మీద రచించిన వ్యాసాలు ‘మేథమెటికల్ స్పెక్ట్రమ్’, ‘ది మేథమెటికల్ గెజిట్’ లలో ప్రచురితమయ్యాయి.
అందుకే అకాడమీ ప్రారంభించా...
ఆనంద్‌కుమార్‌కు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం రెండుసార్లు వచ్చింది. అయితే రెండుసార్లూ దురదృష్టం వెంటాడింది. ‘‘నిరాశ చెందకుండా నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. నాలాగ బాగా చదువుకుని పై చదువులకు వెళ్లే స్థోమత లేనివారికి సహాయపడాలనే ఉద్దేశంతోనే రామానుజన్ అకాడమీ ప్రారంభించాను’’ అంటారు ఆనంద్.
అప్పుడు పడ్డాయి ఈ అడుగులు...
ఒకసారి ఒక పేద విద్యార్థి తనకు ఐఐటీ చదవాలనే ఉందంటూ ఆనంద్ దగ్గరకు వచ్చాడు. ఆ పిల్లవాడికి ఉచితంగా పాఠాలు బోధించారు. ‘‘మా ఇద్దరి కష్టం ఫలించింది. ఆ కుర్రవాడు ఐఐటీ సీటు సాధించాడు. నా జన్మకు సార్థకత ఏంటో అర్థం చేసుకున్నాను. పెద్ద చదువులు చదువుకోవాలనే కోరిక ఉన్న పేద విద్యార్థులకు సాయపడాలనుకున్నాను. అప్పుడే సూపర్ 30 కార్యక్రమానికి పునాదులు వేసుకున్నాను’’ అంటారు ఆనంద్.
సంస్థ విజయం...
ఏటా 30 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి, వారికి శిక్షణనిచ్చి, ఐఐటీ ఎంట్రన్స్‌కి పంపించడం ప్రారంభించారు ఆనంద్. ఈ సంస్థ నుంచి ఏటా పంపుతున్న 30 మందిలో కనీసం 26 మంది ఎంపికవుతున్నారు. ఐఐటియన్లు అవుతున్నారు. ఇంతమందిని నిస్వార్థంగా వృద్ధిలోకి తీసుకువస్తున్న ఆనంద్‌కుమార్ మరింతమంది మేధావులను దేశానికి అందిస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇటీవల ‘టైమ్’ పత్రిక ఆనంద్ గురించి ఒక వ్యాసం ప్రచురించింది. అది చూసిన ఒబామా, అవసరమైన సహాయం చేస్తానని తన ప్రతినిధితో కబురు పంపారు. ప్రభుత్వం సహాయం అందించడానికి ముందుకు వచ్చినా ఆనంద్ సున్నితంగా తిరస్కరించారు. తన లాంటి పేదవారిని మరో నలుగురిని పైకి తీసుకురావడం తప్ప తన గురించి నలుగురూ గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచన లేదు ఆయనకు.