ఎవరెస్టుకు చేరువలో తెలుగుతేజాలు
హైదరాబాద్: ఆ ఇద్దరు విద్యార్థుల సంకల్ప బలం ముందు ఎవరెస్టు తలవంచుతోంది. ఆ ఇద్దరు మారుమూల గ్రామాల విద్యార్థులు వయసుకు మించిన సాహసయాత్రకు నడుం బిగించారు. సాంఘిక సంక్షేమశాఖ సహకారంతో భారత జెండాను ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరాగ్రంపై ఎగురవేయబోతున్నా రు. అన్నీ సవ్యంగా సాగితే ఆదివారం ఉద యం 8కల్లా మువ్వన్నెల జెండాను ఎవరెస్టుపై రెపరెపలాడించేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వీరి యాత్ర అత్యంత ప్రమాదకరమైన డెత్‌జోన్‌లో సాగుతుందని యాత్రను పర్యవేక్షిస్తున్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ శనివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం వీరు బేస్ క్యాంప్‌కు 27,390 అడుగుల ఎత్తులో ప్రయాణం సాగిస్తున్నారన్నారు. మరో రెండువేల అడుగులు సాహసయాత్రను పూర్తిచేస్తే.. ఆదివారం ఉదయం 8 గంటల్లోపే లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు.
సాహసయాత్రకు చేయూత..
ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ విద్యార్థులు సాహసయాత్రకు బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన లక్ష్మి, దేవదాస్ వ్యవసాయ కూలీలు. వారి కుమార్తె మాలావత్ పూర్ణ స్వేరోస్(14) ప్రస్తుతం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 9వ తరగతి చదువుతోంది. ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు ఆనంద్‌కుమార్(17) అన్నపురెడ్డిపల్లి ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఇద్దరు విద్యార్థులు ప్రముఖ పర్వతారోహకుడు, అర్జున అవార్డు గ్రహీత శేఖర్‌బాబు నేతత్వంలో ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన 30 మంది ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరు ఎవరెస్టు శిఖరం అధిరోహిస్తే పూర్ణ స్వేరోస్ అత్యంత పిన్నవయస్సులో ఎవరెస్టు అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.