Expedition
-
మంచుఖండం మనసైన సాహసం
అంటార్కిటికా విహారం తెర మీద చూసినంత సౌకర్యంగా ఉండదు. కానీ మాటల్లో చెప్పలేనంత ఆహ్లాదంగా ఉంటుంది జర్నీ. అంటార్కిటికా గురించి తెలుసుకోవాలంటే స్వయంగా పర్యటించాల్సిందే అనుకున్నాడు హైదరాబాద్ కుర్రాడు హసన్ అరుణ్. లండన్, కింగ్స్ కాలేజ్‌లో ఎకనమిక్స్ చదువుతున్న అరుణ్ గత డిసెంబర్లో అంటార్కిటికా సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. విశేషాలను లండన్ నుంచి సాక్షితో పంచుకున్నాడు. మూడు సముద్రాల కలయిక ‘‘అంటార్కిటికా గురించి తెలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇంటర్నెట్లో ఉన్న సమాచారం నాకు సంతృప్తినివ్వలేదు. స్వయంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అనుకున్నాను. ఆ అడ్వెంచర్‌ని ఎంజాయ్ చేయాలని కూడా. హైదరాబాద్ నుంచి గత డిసెంబర్ 21వ తేదీ బయలుదేరి దాదాపుగా ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత బ్రెజిల్ లోని ‘రియో డీ జెనీరో’మీదుగా అర్జెంటీనా రాజధాని ‘బ్యూనోస్ ఎయిరిజ్’కి చేరాను. అక్కడ మూడు రోజులున్నాను. ప్రపంచం అంచు అని చెప్పే ‘ఉషుయాయియా’ ను చూశాను. అంటార్కిటికా క్రూయిజ్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఉషుయాయియా నుంచి 26వ తేదీ ఉదయం క్రూయిజ్ ప్రయాణం మొదలైంది. బీగెల్ చానెల్లో సాగుతుంది క్రూయిజ్ ప్రయాణం. డ్రేక్ ప్యాసేజ్ మీదుగా ఒకటిన్నర రోజు ప్రయాణించాలి. ఈ జర్నీలో అత్యంత క్లిష్టమైన ప్రదేశం ఇదే. అట్లాంటిక్, పసిఫిక్, సదరన్ ఓషన్ ఈ మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఇది. అలలు నాలుగు మీటర్ల నుంచి పదకొండు మీటర్ల ఎత్తు లేస్తుంటాయి. సీ సిక్నెస్ వచ్చేది ఇప్పుడే. తల తిరగడం, వాంతులతో ఇబ్బంది పడతారు. సిక్నెస్ తగ్గడానికి మందులు, సీ బ్యాండేజ్ ఇస్తారు. ఈ స్థితిలో నిద్ర సమయం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత మైనస్ రెండు ఉంటుంది. క్రూయిజ్ లోపల ఏసీ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓపెన్ ప్లేస్‌లో నాలుగైదు నిమిషాలకంటే ఎక్కువసేపు ఉండలేం. అలలు పైకి లేచినప్పుడు అంత భారీ క్రూయిజ్ కూడా నీటి తాకిడికి కదిలిపోతుంటుంది. అలలు ఆరు మీటర్ల ఎత్తు వస్తున్నంత వరకు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అంతకు మించితే మాత్రం క్రూయిజ్ ఆగాల్సిందే. లంగరు వేసి వాతావరణం నెమ్మదించిన తర్వాత కదులుతుంది. మా జర్నీలో నాలుగు మీటర్లకు మించలేదు, కాబట్టి ఆగాల్సిన అవసరం రాలేదు. నేలను పలకరిస్తూ నీటిలో ప్రయాణం వెడెల్ సీలోకి ప్రవేశించామంటే అంటార్కిటికా ఖండంలోకి అడుగుపెట్టినట్లే. వెడెల్ సీ లో దాదాపు సగం రోజు సాగుతుంది ప్రయాణం. గ్లేసియర్లు, ఐస్‌బెర్గ్‌లు, పర్వతాలు, పెంగ్విన్ కాలనీలు, వేల్స్, సీల్స్ కనిపిస్తుంటాయి. అంటార్కిటికా చేరిన తర్వాత ఆరు రోజుల పా టు రోజుకు రెండు దీవులు లేదా ద్వీపకల్పాల మీద ల్యాండ్ అవుతూ ఆరు రోజుల్లో పన్నెండింటిని కవర్ చేశాను. జనవరి రెండవ తేదీ తిరుగు ప్రయాణం. ‘బ్యూనోస్ ఎయిరిజ్’ నుంచి నేను లండన్‌కి వచ్చేశాను. రోజంతా పగలే! అంటార్కిటికాలో రోజంతా నింగికీ నేలకూ మధ్యనే గడిపినప్పటికీ ఆ వారం రోజులూ సూర్యాస్తమయాన్ని చూడలేకపోయాను. సూర్యుడు చండప్రచండంగా ఉదయించే ఉన్నాడు. ఇది అద్భుతమైన అనుభూతి. కాలుష్యం అంటే ఏమిటో తెలియని స్వచ్ఛమైన నీరు, లెక్కకు మించిన హిమనీనదాలు, గుంపుల కొద్దీ పెంగ్విన్ లు, సహజమైన దారుల్లో ట్రెకింగ్ నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు. నేను అడ్వెంచర్స్ని బాగా ఇష్టపడతాను, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లో కూడా ట్రెకింగ్ చేశాను. కానీ అంటార్కిటికా ట్రెకింగ్ సహజత్వం ఒడిలో సాగిన సాహసం అనిపించింది’’. మనిషి వల్లే హాని అంటార్కిటికా గురించి ప్రయాణంలోనే ఎక్కువ తెలుసుకోగలిగాను. క్రూయిజ్‌లో మెరైన్ ఇంజనీర్లు, సైంటిస్ట్‌లు, నేచరిస్ట్లు కూడా ఉంటారు. ఒక ప్రదేశానికి వెళ్లడానికి ముందు ఆ ప్రదేశం వివరాలు, అక్కడ మెలగాల్సిన విధానం కూడా చెప్తారు . పెంగ్విన్ లకు కనీసం ఐదు మీటర్ల దూరంగా ఉండాలని, మనుషుల నుంచి వాటికి ఇన్ఫెక్షన్ సోకితే ఏకంగా వేలకొద్దీ ఉన్న కాలనీలే తుడిచిపెట్టుకుపోతాయని తెలిసింది. మనిషి ఎంత హానికారకుడో, ప్రకృతికి ఎంత పెద్ద శత్రువో మొదటిసారి తెలిసింది. వాళ్లు పర్యాటకులను ఆహ్వానిస్తూనే మంచుఖండం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించుకుంటున్నారు. ఇక్కడ పర్యటించడానికి డిసెంబర్ రెండవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకు అనుకూలమైన సమయం. – హసన్ అరుణ్, సాహస యాత్రికుడు -- ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
లెక్కచేయలేదు.. లెక్కచెప్పింది..
మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు... లెక్కచేయలేదు. ఎముకలు కొరికే అత్యంత చల్లటి గాలులు... లెక్కచేయలేదు. వేల మైళ్ల ప్రయాణంలో తోడు ఎవరూ ఉండరు... లెక్కచేయలేదు. 40 రోజుల్లో అంటార్కిటికా దక్షిణ ధ్రువ యాత్రను ఒంటరిగా పూర్తి చేసి లెక్క చెప్పింది ‘700 మైళ్లు ప్రయాణించాను’ అని. ‘నేను గాజు పైకప్పును పగులకొట్టాలనుకోలేదు, దానిని మిలియన్ల ముక్కలు చేయాలనుకున్నాను’ అని సగర్వంగా చాటింది. మొక్కవోని ధైర్యంతో వజ్రంలా మెరిసింది. ‘సైనికుల దృఢ సంకల్పానికి స్ఫూర్తిదాయకం ప్రీత్ చాందీ’ అంటూ బ్రిటిష్ ఆర్మీ ఆమెకు అభినందనలు తెలియజేసింది. బ్రిటిష్ ఆర్మీ అధికారి కెప్టెన్ ప్రీత్ చాందీ అంటార్కిటికా దక్షిణ ధ్రువానికి ఒంటరిగా ప్రయాణించిన భార త సంతతికి చెందిన తొలి మహిళ. ఆమె యాత్ర కిందటేడాది నవంబర్‌లో ప్రారంభమై 700 మైళ్లు అంటే సుమారు 1,127 కిలోమీటర్లు 40 రోజుల పాటు కొనసాగింది. మొన్నటి సోమవారం తన లైవ్ బ్లాగ్‌లో చరిత్ర సృష్టించిన ఘనతను ప్రకటించింది. తెలియని ప్రపంచంలోకి... 32 ఏళ్ల కెప్టెన్ హర్‌ప్రీత్ చాందీ మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో గాలి వేగంతో పోరాడుతూ, తనకు అవసరమైనవన్నీ ఉంచిన స్లెడ్జ్‌ను లాగుతూ దక్షిణ ధ్రువంలో వందల మైళ్లు ప్రయాణించింది. ‘మంచు కురుస్తున్న దక్షిణ ధ్రువానికి చేరుకున్నాను. ప్రస్తుతం చాలా భావోద్వేగాలను అనుభవిస్తున్నాను. మూడేళ్ల క్రితం వరకు ఈ ధ్రువ ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అలాంటిది, ఇక్కడ ఉండటం నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఇక్కడికి రావడం చాలా కష్టం. నేను విజేతగా తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఆమె బ్లాగులో రాసింది. సరిహద్దులను దాటాలి ‘ఈ యాత్ర సాధారణమైనది కాదు, ఎంతో పెద్దది, ఊహకు కూడా అందనిది. ప్రజలు తమ సరిహద్దులను దాటడానికి తమని తాము నమ్మాలి. అందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపడానికే నా ఈ ప్రయాణం. మీరు నన్ను తిరుగుబాటుదారుని అని ముద్ర వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సందర్భాలలో ఈ సాహసం ‘వద్దు’ అనే నాకు చాలా మంది చెప్పారు. ‘సాధారణం అనిపించే పనిని మాత్రమే చేయండి’ అన్నారు. కానీ, నేను నాదైన సాధారణాన్ని సృష్టిస్తాను’ అని చాందీ చెప్పారు. గాజు కప్పును పగలకొట్టేద్దాం తన ప్రయాణం గురించి బయటి ప్రపంచానికి తెలియడానికి ఆమె తన ట్రెక్ లైవ్ ట్రాకింగ్ మ్యాప్‌ను అప్లోడ్ చేసింది. మంచుతో కప్పబడిన ప్రాంతంలోనూ తన ప్రయాణం గురించి బ్లాగులో పోస్ట్ చేస్తూనే ఉంది. ‘40వ రోజు పూర్తయ్యింది. అంటార్కిటికాలో సోలో సాహస యాత్రను పూర్తి చేసిన మొదటి వర్ణ మహిళగా ప్రీత్ చరిత్ర సృష్టించింది’ అని ఆమె బ్లాగ్ చివరి పేర్కొన్న ఎంట్రీ చెబుతుంది. ‘మీకు కావల్సిన దేనినైనా మీరు సాధించగలరు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. నాకు కేవలం మూస పద్ధతిలో ఉన్న గాజు పై కప్పును పగలగొట్టడం ఇష్టం లేదు. దానిని మిలియన్ ముక్కలుగా బద్దలు కొట్టాలనుకుంటున్నాను’ అని దృఢంగా వెలిబుచ్చిన పదాలు మన అందరినీ ఆలోచింపజేస్తాయి. వెడ్డింగ్ ప్లాన్ ఆమె తన సాహసయాత్రకు బయలుదేరే ముందు ఆర్మీ రిజర్విస్ట్ డేవిడ్ జర్మాన్‌తో నిశ్చితార్థం అయ్యింది. ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చాక వివాహ ప్రణాళికల గురించి ఆలోచించడానికి ఆమె తన సమయాన్ని చలిలోనే ఉపయోగించుకుంది. ఈ నెలాఖరులో ఆమె దక్షిణ ధ్రువం నుండి తిరిగి వచ్చాక ఈ జంట చిలీలో తిరిగి కలుస్తారని భావిస్తున్నారు. పోలార్ ప్రీత్ అంటూ అంతా పిలుచుకునే ప్రీత్ చాందీ వాయవ్య ఇంగ్లండ్‌లోని మెడికల్ రెజిమెంట్‌లో భాగంగా సైన్యంలోని వైద్యులకు క్లినికల్ ట్రైనింగ్ ఆఫీసర్‌గానూ శిక్షణ ఇస్తుంది. ఫిజియోథెరపిస్ట్ కూడా. లండన్‌లోని క్వీన్ మెరీస్ యూనివర్శిటీలో పార్ట్‌టైమ్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్ౖసైజ్ మెడిసిన్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేస్తోంది. స్లెడ్జ్‌కి ప్రత్యామ్నాయంగా పోలార్ ట్రైనింగ్ కోసం కొన్ని నెలల పాటు అత్యంత బరువైన రెండు పెద్ద టైర్లను లాగుతూ శిక్షణ తీసుకుంది. స్లెడ్జ్లో కావల్సిన తప్పనిసరి వస్తువులను ఉంచి, అంటార్కిటికా సౌత్‌పోల్ మొత్తం ఇదే ప్రయాణం కొనసాగించింది. -
Sabita Mahato and Shruti Rawat: కూతురి కోసం సందేశం..
సైకిల్ తొక్కుతూ దేశమంతా తిరుగుతూ ‘కూతుళ్లను రక్షించండి, వారిని చదివించండి’ అనే సందేశం ఇవ్వడానికి మూడేళ్ల క్రితమే ఈ సోలో సైకిలిస్ట్ దేశమంతా పర్యటించింది. 173 రోజుల్లో 12,500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి 29 రాష్ట్రాలను చుట్టి వచ్చింది. రాబోయే సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, తన సందేశాన్ని శిఖరాగ్రాన ఉంచాలనుకుంది 24 ఏళ్ల సబితా మహతో. బీహార్ వాసి అయిన సబిత మూడేళ్ల క్రితం తన మొదటి యాత్రను జమ్మూ కాశ్మీర్ నుండి ప్రారంభించి, దక్షిణాన కేరళ, తమిళనాడులను చేరుకుని, అటు తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లింది. చివరకు సిక్కిం మీదుగా పాట్నా చేరుకుంది. దారిలో అన్ని ప్రదేశాలలోనూ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటూ సైకిల్‌పై 12 వేల 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. గత ఫిబ్రవరిలో మరో సైకిలిస్ట్ శ్రుతి రావత్‌తో కలిసి 85 రోజుల్లో 5,800 కిలోమీటర్లు నేపాల్ మీదుగా హిమాలయన్ సైక్లింగ్ టూర్‌ను ప్రారంభించిన సబిత ఈ పర్యటననూ దిగ్విజయంగా పూర్తిచేసింది. లింగ సమానత్వం, పర్యావరణం గురించి పాఠశాల విద్యార్థులతో చర్చించాలనే ఆశయంతో ఇప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. అడగడుగునా ఆహ్వానాలు.. సబిత తన ప్రయాణ అనుభవాల గురించి వివరిస్తూ ‘అడవి గుండా వెళుతున్నప్పుడు కూడా నా నినాదాన్ని వదిలిపెట్టలేదు. ‘కూతురుని రక్షించండి. చదివించండి.’ అనే సందేశాన్ని ప్రజలకు ఇస్తూ ఉన్నాను. వెళ్లిన ప్రతి చోటా ఆ ప్రాంతవాసుల ఆదరాభిమానాలు పొందాను. సైకిల్ ప్రయాణంలో నేను బీహార్ వాసినని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోయారు. శ్రుతి రావత్‌తో కలిసి చేసిన పర్యటనలో ఇవే అనుభవాలను చవిచూశాను. ఎక్కడకెళ్లినా, అక్కడి ప్రజలు నన్ను ఆదరించిన తీరు మాత్రం మర్చిపోలేను.’ అని తన పర్యటన విశేషాలు సంతోషంగా తెలియజేస్తుంది. పేదరికంలో పెరిగినా.. సబిత మత్స్యకారుల కుటుంబంలో పుట్టింది. పేదరికంలోనూ పెద్ద కలలు కనేది. తనకు చిన్నతనంలోనే పెళ్లి చేయబోతే నిరోధించింది, షార్ట్స్ వేసుకొని సైకిల్ తొక్కుతూ తిరిగేది. దీంతో తండ్రి ఆమెను ఎప్పుడూ ‘జనం ఏమనుకుంటారు’ అని అంటూ వెనకడుగు వేసేలా చేసేశాడు. కానీ, అవేమీ పట్టించుకోలేదు సబిత. స్కూల్లో ఉన్న ఇతర అమ్మాయిల బాల్యవివాహాలనూ అడ్డుకుంది. ‘కూతుళ్లను చదివించండి..’ అనే నినాదంతో సబిత మొదలుపెట్టిన సైకిల్ ప్రయాణానికి పాఠశాల యాజమాన్యం కూడా సాయం చేసింది. భూమికి ఏడున్నరవేల మీటర్ల ఎత్తులో ఉండే హిమాలయాల్లోని సంతోపత్ పర్వతంపై సబిత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ‘నిరంతరం నా ప్రయాణం అమ్మాయిల్లో అవగాహన పెంచడం కోసమే’ అంటుంది సబిత. శ్రుతి రావత్‌తో కలిసి.. డార్జిలింగ్‌లో ఉండే శ్రుతి రావత్ ఈ యేడాదే డిగ్రీ పూర్తి చేసింది. సైకిల్ రైడింగ్ అంటే తనకు చాలా ఇష్టం. సైకిల్ రైడర్స్ గురించి తెలుసుకున్నప్పుడు సబిత పరిచయమై, ఆమె తన యాత్ర గురించి చెప్పినప్పుడు ఈ పర్యటనలో పాల్గొనాలన్న ఆలోచన తనకూ కలిగింది. ‘‘మొదట్లో నేను ఎక్కువ దూరం సోలోగా ప్రయాణించలేదు. క్రీడాకారిణిని కూడా కాదు. రోజూ ఏడు గంటలు సైకిల్‌పై ప్రయాణం చేయడం అప్పట్లో కష్టంగా అనిపించేది. కానీ, సబిత ఇచ్చిన శిక్షణ నాలో ఉత్సాహాన్ని నింపింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించే సైకిల్ యాత్ర చీకటి పడటంతో ముగుస్తుంది. బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల మీదుగా ఉత్తరాఖండ్ అటు నుంచి ట్రాన్స్ హిమాలయాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. మా ప్రయాణంలో ముందే భోజన, వసతి సదుపాయాల ప్లానింగ్ కూడా ఉండేది. దాంతో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇంట్లో కూర్చుంటే బయటి ప్రపంచం అంతా అమ్మాయిలకు రక్షణ లేనిదిగానే ఉంటుంది. కానీ, బయటకు వచ్చి చూస్తే ఎంతో అద్భుత ప్రపంచం కనిపిస్తుంది’’ అని తమ యాత్రానుభవాలను పంచుకుంది శ్రుతి. -
106 ఏళ్ల క్రితం మంచులో మునిగిన నౌక కోసం అన్వేషణ
లండన్ : 106 ఏళ్ల క్రితం అంటార్కటిక్ మంచులో కూరుకుపోయిన భారీ నౌక ‘సర్ ఎర్నెస్ట్ శాక్లెటన్స్ ఎండూరన్స్’ను కనుక్కునేందుకు మెరైన్ పురావస్తు శాస్త్రవేత్తల బృందం సిద్ధమైంది. 1914-1917 మధ్య కాలంలో అంటార్కటిక్ అన్వేషణ కోసం ఉపయోగించిన రెండు నౌకల్లో ఎండూరన్స్ ఒకటి. ధ్రువ ప్రాంతంలోని నీళ్లలో అన్వేషణ సాగించటం కోసం ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. 144 అడుగుల పొడవున్న ఈ నౌక 28 మంది పురుషులతో వాసెల్ బేకు బయలుదేరింది. అయితే గమ్యాన్ని చేరుకోకుండానే 1915 జనవరి 18న వెడ్డల్ సముద్రంలో కూరుకుపోయింది. అక్టోబర్ నెలలో ఉష్ణోగ్రతలు మరింత దిగజారటంతో ఎండూరన్స్ ముక్కలు అవసాగింది. ఈ నేపథ్యంలో 1915 డిసెంబర్లో నౌక మొత్తంగా మునిగిపోయింది. ఫాక్లాండ్ మారిటైమ్ హెరిటేజ్ ట్రస్ట్ ప్రస్తుతం ఈ నౌకను కనుక్కునేందుకు ప్రయత్నిస్తోంది. అండర్ వాటర్ రోబోట్స్ ద్వారా నౌకను అన్వేషించనుంది. 2022 ఫిబ్రవరిలో కేప్టౌన్నుంచి ఈ అన్వేషణ ప్రారంభం అవుతుంది. -
సాహస యాత్రకు సబల సిద్ధం
సముద్రమంత తెగువ.. అవధులు లేని ఆత్మవిశ్వాసం.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన.. సాగరం చిన్నబోయేలా.. సంకల్పం తలవంచేలా.. అలల ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తూ.. తిమిరంతో సమరం చేస్తూ కదన రంగంలోనూ సరిలేరు మాకెవ్వరంటూ భారత నౌకాదళం లో తమ శకాన్ని లిఖిస్తున్నారు మహిళలు. నౌకాదళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ వర్తింపజెయ్యాలన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటినుంచి నౌకాదళంలో మహిళా శకం మొదలైంది. లింగసమానత్వానికి సరికొత్త నిర్వచనాన్ని తిరగరాస్తూ.. యుద్ధనౌకల్లో మహిళా అధికారుల్ని నియమించి కొత్త అధ్యాయానికి భారత నౌకాదళం తెరతీసింది. తొలి మహిళా పైలట్‌గా శివాంగి నియామకంతో సముద్రమంత ఉత్సాహం మహిళల్లో నెలకొంది. ఆ తర్వాత కొద్ది కాలానికే... యుద్ధ నౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితీసింగ్‌లు అడుగు పెట్టడంతో.. ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. నౌకాదళం అమ్ముల పొదిలో చేరిన అత్యాధునిక ఎంహెచ్–60 ఆర్ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి నియామకంతో సైన్యంలో మహిళలకు సమ ప్రాధాన్యం, ప్రాతినిధ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపించారు. ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలపై మహిళా అధికారులు మోహరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా... ఇప్పటి వరకూ నిర్మించిన ఏ యుద్ధ నౌకలోనూ మహిళలకంటూ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చెయ్యలేదు. కనీసం మహిళల కోసం ఏ ఒక్క యుద్ధ నౌకలోనూ ప్రత్యేక టాయిలెట్స్ లేవంటే.. తమకు యుద్ధ నౌకల్లో పని చేసే అర్హత లేదన్నట్లుగా భావించారన్న అనుమానాలు మహిళాలోకంలో వ్యక్తమవుతున్నాయి. అయితే.. మారుతున్న కాలానికనుగుణంగా నౌకా నిర్మాణంలోనూ మార్పులు రానున్నాయని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏకే జైన్ నేవీ డే సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే.. యుద్ధ నౌకల్లో మహిళల ప్రవేశం లాంఛనమైన నేపథ్యంలో.. వారికి కావల్సిన సౌకర్యాలతో నౌకల్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. తరిణి స్ఫూర్తితో బుల్ బుల్.... గోవా నుంచి కేప్‌టౌన్‌కు సెయిలింగ్ బోట్లో వెళ్లి తిరిగి దేశానికి చేరుకుంటూ.. భారతీయ మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఐఎన్ఎస్వీ తరిణి మహిళా బృందం చేసిన సాహసయాత్ర.. నౌకాదళంలోని మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. సుమారు 21 వేల నాటికల్ మైళ్ల దూరం.. ఐదు మహా సముద్రాలు, ఐదు అంచెల ప్రయాణం.. ఆరుగురు మహిళలు కలిసి... భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని ప్రపంచ దేశాలకు చాటిచెప్పడమే లక్ష్యంగా సాగిన ‘నావికా సాగర్ పరిక్రమ’.. ఆసియాలోనే తొలిసారిగా కేవలం ఆరుగురు మహిళలతో కూడిన సెయిలింగ్ బోట్ సాహస యాత్ర ఇది. ఇండియన్ నేవీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగినుల్లో 20 మందిని వివిధ పరీక్షల అనంతరం ఈ యాత్రకోసం ఆరుగురిని ఎంపిక చేశారు. తరిణికి సారధిగా లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి వ్యవహరించగా లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జమ్వాల్, లెఫ్టినెంట్ కమాండర్ పాతర్లపల్లి స్వాతి, లెఫ్టినెంట్లు విజయదేవి, లెఫ్టినెంట్ పాయల్‌గుప్తా, లెఫ్టినెంట్ ఐశ్వర్య బొడ్డపాటికి అవకాశం దక్కింది. స్వాతి విశాఖ అమ్మాయి కాగా, ఐశ్వర్య హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. ఈ యాత్ర అందించిన స్ఫూర్తి.. నౌకాదళంలో మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. తరిణి సాహస యాత్రని స్ఫూర్తిగా తీసుకొని.. మరో యాత్రకు మహిళల్ని పంపించేందుకు భారత నౌకాదళం సమాయత్తమవుతోంది. ఈ సాహస యాత్రకు బుల్బుల్ అని పేరు పెట్టినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సాహసయాత్రకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొదలైందనీ.. త్వరలోనే బుల్బుల్ యాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా.. నౌకాదళంలో మహిళ పాత్ర అత్యవసరం.. ఆవశ్యకం అని చాటి చెప్పనున్నారు. మహిళల అంకితభావానికి హ్యాట్సాఫ్ ‘లింగభేదాన్ని సమూలంగా చెరిపేసేందుకు నౌకాదళం మహిళలకు పెద్ద పీట వేస్తోంది. యుద్ధనౌకల్లో క్రమంగా మహిళల ప్రాధాన్యం పెరిగే రోజులు సమీపంలోనే ఉన్నాయి. ఇప్పటికే వివిధ శాఖల్లో 9 నుంచి 10 మంది మహిళా అధికారులను శాశ్వతంగా నియమించే ప్రక్రియ మొదలైంది. అయితే సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు యుద్ధనౌకల్లో మహిళలకు సరైన మౌలిక వసతులు లేవు. ఇప్పుడా మచ్చ చెరిగిపోతుంది. వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు, వనరులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. కేవలం వృత్తిపరంగానే కాకుండా.. సాహసయాత్రల్లోనూ వారిది పై చేయి ఉండాలని సంకల్పించాం. ఇప్పటికే ఐఎన్ఎస్వీ తరిణి సాహస ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో త్వరలో బుల్బుల్ ప్రారంభం కానుంది. మహిళా అధికారులు నౌకాదళంలో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రదర్శిస్తున్న అంకిత భావానికి హ్యాట్సాఫ్ – వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, తూర్పు నౌకాదళాధిపతి – కరుకోల గోపీకిశోర్‌రాజా సాక్షి, విశాఖపట్నం -
మార్స్‌పై తొలి అడుగు ఈమెదే
వాషింగ్టన్: పెరిగి పెద్దయ్యాక అంతరిక్షయానం చేయాలని ఉందంటూ స్కూలు విద్యార్థులు చెబుతుండడం మనం వింటుంటాం. భవిష్యత్‌లో వారు ఏదో ఒక రంగంలో స్థిరపడి, చిన్నపుడు అనుకున్నది కలగానే మిగిలిపోయిన సందర్భాలే ఎక్కువగా ఉంటుంటాయి. అయితే దీనికి పూర్తి భిన్నంగా అమెరికాలోని లూసియానాకు చెందిన 17 ఏళ్ల అలెసా కార్సన్ మాత్రం అరుణ గ్రహం (మార్స్-అంగారకుడు)పై కాలుమోపబోయే తొలి మహిళగా (ఈ గ్రహంపై మొదట అడుగుపెట్టే వారిలో ఒకరిగా) రికార్డ్ సొంతం చేసుకోనుంది. అయితే అది ఇప్పుడప్పుడే కాదు ఆమె 32 ఏళ్ల వయసులో... 2033 సంవత్సరంలో.. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగం కోసం కార్సన్ ఇప్పటికే నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్‌వాటర్ సర్వయివల్, తదితర కార్యక్రమాల్లో ప్రాథమిక శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. పద్దెనిమిదేళ్లు నిండిన వారినే నాసా వ్యోమోగామి (ఆస్ట్రోనాట్) గా అధికారికంగా ప్రకటించే వీలుంటుంది కాబట్టి ఇప్పుడామే ’బ్లూ బెర్రీ’కోడ్‌నేమ్‌తో కొనసాగుతోంది. మార్స్ గ్రహానికి వెళ్లేందుకు అవసరమైన ఆరియన్ అంతరిక్షనౌక, స్పేస్ లాంఛ్ సిస్టమ్ రాకెట్‌పై వెళ్లేందుకు ఆమెను ఈ శిక్షణ సిద్ధం చేస్తుంది. ప్రస్తుత సాంకేతికతను బట్టి చూస్తే మార్స్‌పైకి వెళ్లేందుకు ఆరుమాసాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఏడాది పాటు ఆ గ్రహంపైనే గడిపాక తిరుగుపయనమవుతారు. ఈ ట్రిప్ ముఖ్యోద్ధేశ్యం ఏమంటే..అక్కడ వనరుల అన్వేషణ, నీటి నమూనాల పరిశీలన, జీవజాతుల జాడలున్నాయా లేదా అన్నది పరిశీలించడంతో పాటు అక్కడ అవాసాలు అభివృద్ధి చేసుకునేందుకు ఉన్న అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్నది చూస్తారు. నికోల్ ఒడియన్ ఛానల్ ’ద బాక్యార్డిజాన్స్’ కార్టూన్ మిషన్ టు మార్స్ ఎపిసోడ్లో ఓ మిత్రుల బృందం అంగారకగ్రహంపై సాహసయాత్రకు వెళ్లడం కార్సన్‌కు మూడేళ్ల వయసులోనే బలమైన ముద్రవేసింది. ఆస్ట్రోనాట్‌గా మారడమే ఆమె జీవితాశయంగా మారింది. చిన్నతనమంతా కూడా నాసాకు చెందిన అంతరిక్ష ప్రయోగకేంద్రాలు సందర్శించింది. ముందుగా వ్యోమోగామిగా అరుణగ్రహం నుంచి తిరుగొచ్చాక, ఓ అధ్యాపకురాలిగా ఆ తర్వాత దేశాధ్యక్షురాలిని కావాలని కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది. -
మీ పిల్లలు క్షేమం.. నన్ను క్షమించండి
మే సాయ్ (థాయ్‌లాండ్): గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ జట్టులోని పిల్లల తల్లిదండ్రులకు వారి కోచ్ ఎకపోల్ ఛంథవాంగ్ క్షమాపణలు తెలిపారు. తామంతా క్షేమంగానే ఉన్నామనీ, తమ కుటుంబ సభ్యులు బాధపడకుండా ధైర్యంగా ఉండాలని బాలురు కూడా కోరారు. గుహలో చిక్కుకుపోయిన తర్వాత తొలిసారిగా కోచ్, పిల్లలు కలిసి తల్లిదండ్రులకు లేఖలు రాశారు. ఈ లేఖలను సహాయక బృందంలోని డైవర్లు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ‘బాలుర తల్లిదండ్రులకు నా క్షమాపణలు. పిల్లలంతా క్షేమంగానే ఉన్నారు. సహాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు’ అని ఎకపోల్ తన లేఖలో పేర్కొన్నారు. మరో బాలుడు రాసిన లేఖలో ‘నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నా పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేయడం మరచిపోకండి’ అని ఉంది. టున్ అనే మరో బాలుడు ‘అమ్మా, నాన్న! దయచేసి బాధపడకండి. నేను బాగున్నా. నేను రాగానే ఫ్రైడ్ చికెన్ తినడానికి బయటకు వెళదాం’ అని రాశాడు. ఓ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలురు, కోచ్‌తో కలసి థామ్ లువాంగ్ గుహలో జూన్ 23న సాహసయాత్రకు వెళ్లగా అప్పుడే కురిసిన భారీ వర్షాలకు లోపలే చిక్కుకుపోవడం తెలిసిందే. ఇప్పటికిప్పుడు తీసుకురాలేం.. పిల్లలందరికీ ఈత సరిగ్గా రాకపోవడం, అదీ గుహలో కావడంతో ఇప్పటికిప్పుడు వారందరినీ నీటి కింద నుంచే బయటకు తీసుకొచ్చే సాహసం ఏదీ చేయబోమని చియాంగ్ రాయ్ గవర్నర్ నరోగ్సక్ చెప్పారు. ఇప్పటికే నైపుణ్యవంతుడైన డైవర్ నీటి కింద నుంచి వస్తూ చనిపోయాడనీ, పిల్లలను తీసుకురావడం సురక్షితం కాదని ఆయన చెప్పారు. మళ్లీ భారీ వర్షాలు మొదలైతే సహాయక సిబ్బంది గుహ లోపలికి చేరుకోవడానికి కూడా అవకాశం ఉండదనీ, వర్షాలు తగ్గినందున ఇప్పుడు వారిని కాపాడాలని కొందరు అంటున్నారు. 100కు పైగా రంధ్రాలతో ప్రయత్నం.. కొండకు వందకుపైగా రంధ్రాలు చేసి వారంతా ఎక్కడున్నారో కనిపెట్టేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కొన్ని రంధ్రాలను 400 మీటర్ల లోతుకు వేసినా పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు. గుహలో ఆక్సిజన్ స్థాయులు తగ్గకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. -
సముద్రంలోకి వెళ్లి టైటానిక్‌ను చూడొచ్చు!
లండన్: వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ ఓడను సముద్రగర్భంలోకి వెళ్లి సందర్శించడానికి ఓ కంపెనీ పర్యాటకులకు అవకాశం కల్పించనుంది. ఈ సాహసయాత్రకు ఒక్కో వ్యక్తికి టికెట్ ధర 1,05,129 డాలర్లు (రూ.68 లక్షలు). వచ్చే ఏడాది మే నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర తొలిదశకు ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. 8 రోజులు సాగే ప్రయాణం కెనడా నుంచి మొదలవుతుంది. ‘బ్లూ మార్బుల్ ప్రైవేట్’ అనే సంస్థ పర్యాటకులను అట్లాంటిక్ మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున ఉన్న టైటానిక్ ఓడ వద్దకు పర్యాట కులను తీసుకెళ్లనుంది. 1912 ఏప్రిల్ 14న ఆర్ఎంఎస్–టైటానిక్ ఓడ ఇంగ్లండ్ నుంచి అమెరికా వెళ్తూ తన తొలి ప్రయాణంలోనే మునిగిపోవడం తెలిసిందే. -
‘ఉపాధి భరోసా’ యాత్ర
♦ గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల నిరోధానికి సర్కారు నిర్ణయం ♦ కూలీల డిమాండ్‌కు అనుగుణంగా పని కల్పనకు ప్రణాళికలు ♦ దరఖాస్తు చేసిన 10 రోజుల్లోగా పని కల్పించకుంటే నిరుద్యోగ భృతి ♦ ఈ నెల 17న ప్రారంభించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల నుంచి పేద కూలీలు పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వలసల నిరోధానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామంటూ.. భరోసా యాత్రను చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. ప్రతి ఊర్లోనూ గ్రామసభ నిర్వహించి కూలీల డిమాండ్‌కు అనుగుణంగా అక్కడికక్కడే ఉపాధి పనులు మంజూరు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉపాధి పనులు కావాలని దరఖాస్తు చేసిన కూలీలకు 10 రోజుల్లోగా పనులు కల్పించకుంటే ఉపాధి హామీ చట్టం ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు. రాజస్థాన్ తరహాలో ప్రచారం పని కోరిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేందుకు ‘కామ్ మాంగో అభియాన్’ పేరిట రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టిన తరహాలోనే రాష్ట్రంలోనూ ఉపాధి భరోసా యాత్రను చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగిన వారిలో కనీసం 10 శాతం మంది కూడా పనులకు రాకపోతుడడంపై రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి క్యాంపెయిన్ నిర్వహించింది. చట్టంలోని అంశాలు, కూలీల హక్కులపై విస్తృతంగా ప్రచారం కల్పించడంతో ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య 40 నుంచి 50 శాతానికి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలోనూ ఉపాధి భరోసా యాత్రను ప్రయోగాత్మకంగా వలసలు అధికంగా ఉండే జిల్లాల్లో చేపట్టాలని సంకల్పించారు. దీని కోసం మహబూబ్‌నగర్ జిల్లాలోని 20 మండలాలు, నల్లగొండ జిల్లాలోని 10 మండలాలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17న ప్రారంభించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద 14 కోట్ల పనిదినాలను కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, వచ్చే అక్టోబర్ వరకు 10 కోట్ల పనిదినాలను మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనుల నిమిత్తం ఇప్పటివరకు రూ.2,520 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని, అక్టోబర్ తర్వాత డిమాండ్‌ను బట్టి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. యాత్రలో ప్రస్తావించే అంశాలివే.. ప్రతి పేద కుటుంబం తప్పనిసరిగా జాబ్ కార్డు పొందే హక్కు కలిగి ఉండడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల ఉపాధి పనిని పొందవచ్చు. అంతేకాక పని ప్రదేశంలో కనీస సౌకర్యాలను పొందే హక్కు కలిగి ఉంటారు. ప్రతి వారం పని కోసం దరఖాస్తు చేయడం ద్వారా ఉపాధి పనులను పొందవచ్చు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా పని కల్పించని పక్షంలో మొదటి పది రోజులకు రోజువారీ వేతనం(రూ.194)లో 1/3 వంతు, తర్వాత 10 రోజులకు 1/2 వంతు నిరుద్యోగ భృతిని పొందవచ్చు. పని ప్రదేశం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే 10 శాతం అదనపు వేతనం పొందవచ్చు. ఉపాధి హామీ చట్టంలో కల్పించిన హక్కులతో పాటు ఈ పథకం ద్వారా చేపట్టే కార్యక్రమాలపైనా భరోసా యాత్ర ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి.. కూలీలకు అవగాహన కల్పించనున్నారు. -
అతగాడితో విహార యాత్ర!
‘‘ఒంటరిగా విహార యాత్రకు వెళ్లినా... జంటగా వెళ్లిందని జనాలు చెప్పుకునే రోజులివి. ఫలానా కథానాయిక విహార యాత్రకెళ్లిందట అనే వార్త వస్తే చాలు.. తనతో పాటు ‘అతను’ కూడా వెళ్లాడని ఏదో ఒక హీరోతో లింకు పెట్టేస్తారు’’ అని సోనాక్షీ సిన్హా అంటున్నారు. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. ఇటీవల ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం ఆమె మాల్దీవులు వెళ్లారు. అక్కడ కొంచెం విరామం దొరికితే, ఓ రెండు రోజులు విహార యాత్ర ప్లాన్ చేసుకున్నారు. దాంతో, ఈ ట్రిప్‌కి సోనాక్షీ ఎవర్నో తీసుకెళ్లారనీ, అతగాడెవరనీ కొంతమంది ఆరా తీసే పని మీద పడ్డారు. ఈ విషయం విన్న సోనాక్షీ హాయిగా నవ్వుకున్నారట. ‘‘నాతో తీసుకెళ్లడానికి బాయ్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. నేను ఒంటరిగా వెళ్లా. ఇక ఆరా తీయడం ఆపితే బెటర్’’ అంటున్నారామె. ప్రస్తుత సింగిల్‌గా ఉన్నాననీ, జీవితం చాలా ఆనందంగా ఉందనీ సోనాక్షీ స్పష్టం చేశారు. -
ఎడారిలో బుడతడి సాహసయాత్ర!
ప్రమాదకర లోప్నర్ ఎడారిని దాటిన ఆరేళ్ల బాలుడు కొంత దూరం కాలినడకన.. మరికొంత దూరం వాహనంలో ప్రయాణం బీజింగ్: లోప్నర్.. ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఎడారి.. అటువంటి ఎడారిని దాటి రికార్డు సృష్టించాడు ఓ ఆరేళ్ల చైనా బుడతడు. హీ యేదే(6) అతిచిన్న వయసులో విమానం నడిపిన వ్యక్తిగా గతంలో గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. డ్యుయోడ్యుయో అని ముద్దుగా పిలుచుకునే హీయేదే మరో 13 మందితో కలసి లోప్నర్ ఎడారిలో మూడు వేల కిలోమీటర్ల సాహసయాత్రను గురువారం పూర్తి చేశాడు. జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని ప్రమాదకర ఎడారిని కొంత దూరం కాలినడకన.. మరికొంత దూరం వాహనంలోనూ దాటినట్టు హీయేదే తండ్రి హీలీషెంగ్ చెప్పారు. ఈ యాత్ర కోసం ముందస్తుగా ఎంతో కసరత్తు చేశామని, తమ పిల్లల జీవితాన్ని ప్రమాదంలో పెట్టాలని భావించలేదని చెప్పారు. గత అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ సాహసయాత్ర కోసం మరో ముగ్గురు చిన్నారులను నాన్జింగ్లో వ్యాపారవేత్త అయిన లీషెంగ్ ఎంపిక చేశారు. వారి కుటుంబాలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నాయి. ఈ యాత్ర కోసం పెద్ద మొత్తంలో ఇన్స్టెంట్ ఫుడ్‌ను, శాండ్ ప్రూఫ్ గ్లాస్‌లను, వంద రకాల మందులు సిద్ధం చేసుకున్నారు. ఈ సాహసయాత్రతో స్కూల్లో చెప్పని ఎన్నో విషయాలను తమ పిల్లలు నేర్చుకున్నారని లీషెంగ్ చెప్పారు. డెరైక్షన్స్ ఎలా చెప్పాలి, జంతువులను ఎలా భయపెట్టాలి, ఎడారిలో నీటిని ఎలా గుర్తించాలి వంటివి నేర్చుకున్నారని చెప్పారు. లోప్నర్లో ప్రయాణం పబ్లిసిటీ స్టంట్ అన్న ఆరోపణలపై షెంగ్ స్పందిస్తూ.. తమ చిన్నారులను వురింత ధైర్యవంతులుగా చేయాలనేదే ఈ సాహసయాత్ర లక్ష్యమన్నారు. 2012లో న్యూయార్క్ వీధుల్లో సున్నా ఉష్ణోగ్రతలో ఒంటిపై నూలుపోగు లేకుండా పరిగెత్తి.. రన్నింగ్ నేక్డ్ బాయ్‌గా చైనాలో గుర్తింపు సాధించాడు డ్యుయోడ్యుయో. అదే ఏడాది ఆగస్ట్‌లో ఒంటరిగా నౌకను నడిపాడు. 2013 ఆగస్ట్‌లో ఆల్ట్రాలైట్ విమానాన్ని 35 నిమిషాలసేపు నడిపి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. -
‘ఎవరెస్టు’ వీరులకు ఘనస్వాగతం
సాక్షి,హైదరాబాద్: ఎవరెస్టు శిఖరంపై భారత పతాకాన్ని ఎగరువేసిన తెలుగు తేజాలు లావత్పూర్ణ, సాధనపల్లి అనంద్‌కుమార్‌కు ఆదివారం ఇక్కడ ఘనస్వాగతం లభించింది. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే అభిమానులు గురుకుల సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గీలో ర్యాలీగా బయటికి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి ర్యాలీగా శంషాబాద్‌కు చేరుకున్న పూర్ణ, ఆనంద్‌లు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా పాతబస్తీకి చేరుకున్నారు. ఫలక్‌నుమాలోనూ స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మొజంజాహిమార్కెట్, గన్‌పార్కు మీదుగా ట్యాంక్‌బంక్‌కు భారీ ర్యాలీ చేరుకుంది. -
ఎవరెస్టుకు చేరువలో తెలుగుతేజాలు
హైదరాబాద్: ఆ ఇద్దరు విద్యార్థుల సంకల్ప బలం ముందు ఎవరెస్టు తలవంచుతోంది. ఆ ఇద్దరు మారుమూల గ్రామాల విద్యార్థులు వయసుకు మించిన సాహసయాత్రకు నడుం బిగించారు. సాంఘిక సంక్షేమశాఖ సహకారంతో భారత జెండాను ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరాగ్రంపై ఎగురవేయబోతున్నా రు. అన్నీ సవ్యంగా సాగితే ఆదివారం ఉద యం 8కల్లా మువ్వన్నెల జెండాను ఎవరెస్టుపై రెపరెపలాడించేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వీరి యాత్ర అత్యంత ప్రమాదకరమైన డెత్జోన్లో సాగుతుందని యాత్రను పర్యవేక్షిస్తున్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ శనివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం వీరు బేస్ క్యాంప్‌కు 27,390 అడుగుల ఎత్తులో ప్రయాణం సాగిస్తున్నారన్నారు. మరో రెండువేల అడుగులు సాహసయాత్రను పూర్తిచేస్తే.. ఆదివారం ఉదయం 8 గంటల్లోపే లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. సాహసయాత్రకు చేయూత.. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ విద్యార్థులు సాహసయాత్రకు బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన లక్ష్మి, దేవదాస్ వ్యవసాయ కూలీలు. వారి కుమార్తె మాలావత్ పూర్ణ స్వేరోస్(14) ప్రస్తుతం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 9వ తరగతి చదువుతోంది. ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు ఆనంద్‌కుమార్(17) అన్నపురెడ్డిపల్లి ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఇద్దరు విద్యార్థులు ప్రముఖ పర్వతారోహకుడు, అర్జున అవార్డు గ్రహీత శేఖర్‌బాబు నేతత్వంలో ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన 30 మంది ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరు ఎవరెస్టు శిఖరం అధిరోహిస్తే పూర్ణ స్వేరోస్ అత్యంత పిన్నవయస్సులో ఎవరెస్టు అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. -
త్వరలో బయటపడనున్న అంటార్కిటికా చిక్కుముడులు