‘ఉపాధి భరోసా’ యాత్ర
♦ గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల నిరోధానికి సర్కారు నిర్ణయం
♦ కూలీల డిమాండ్‌కు అనుగుణంగా పని కల్పనకు ప్రణాళికలు
♦ దరఖాస్తు చేసిన 10 రోజుల్లోగా పని కల్పించకుంటే నిరుద్యోగ భృతి
♦ ఈ నెల 17న ప్రారంభించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల నుంచి పేద కూలీలు పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వలసల నిరోధానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామంటూ.. భరోసా యాత్రను చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. ప్రతి ఊర్లోనూ గ్రామసభ నిర్వహించి కూలీల డిమాండ్‌కు అనుగుణంగా అక్కడికక్కడే ఉపాధి పనులు మంజూరు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉపాధి పనులు కావాలని దరఖాస్తు చేసిన కూలీలకు 10 రోజుల్లోగా పనులు కల్పించకుంటే ఉపాధి హామీ చట్టం ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు.
రాజస్థాన్ తరహాలో ప్రచారం
పని కోరిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేందుకు ‘కామ్ మాంగో అభియాన్’ పేరిట రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టిన తరహాలోనే రాష్ట్రంలోనూ ఉపాధి భరోసా యాత్రను చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగిన వారిలో కనీసం 10 శాతం మంది కూడా పనులకు రాకపోతుడడంపై రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి క్యాంపెయిన్ నిర్వహించింది. చట్టంలోని అంశాలు, కూలీల హక్కులపై విస్తృతంగా ప్రచారం కల్పించడంతో ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య 40 నుంచి 50 శాతానికి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలోనూ ఉపాధి భరోసా యాత్రను ప్రయోగాత్మకంగా వలసలు అధికంగా ఉండే జిల్లాల్లో చేపట్టాలని సంకల్పించారు.
దీని కోసం మహబూబ్‌నగర్ జిల్లాలోని 20 మండలాలు, నల్లగొండ జిల్లాలోని 10 మండలాలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17న ప్రారంభించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద 14 కోట్ల పనిదినాలను కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, వచ్చే అక్టోబర్ వరకు 10 కోట్ల పనిదినాలను మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనుల నిమిత్తం ఇప్పటివరకు రూ.2,520 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని, అక్టోబర్ తర్వాత డిమాండ్‌ను బట్టి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు.
యాత్రలో ప్రస్తావించే అంశాలివే..
ప్రతి పేద కుటుంబం తప్పనిసరిగా జాబ్ కార్డు పొందే హక్కు కలిగి ఉండడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల ఉపాధి పనిని పొందవచ్చు. అంతేకాక పని ప్రదేశంలో కనీస సౌకర్యాలను పొందే హక్కు కలిగి ఉంటారు. ప్రతి వారం పని కోసం దరఖాస్తు చేయడం ద్వారా ఉపాధి పనులను పొందవచ్చు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా పని కల్పించని పక్షంలో మొదటి పది రోజులకు రోజువారీ వేతనం(రూ.194)లో 1/3 వంతు, తర్వాత 10 రోజులకు 1/2 వంతు నిరుద్యోగ భృతిని పొందవచ్చు. పని ప్రదేశం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే 10 శాతం అదనపు వేతనం పొందవచ్చు. ఉపాధి హామీ చట్టంలో కల్పించిన హక్కులతో పాటు ఈ పథకం ద్వారా చేపట్టే కార్యక్రమాలపైనా భరోసా యాత్ర ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి.. కూలీలకు అవగాహన కల్పించనున్నారు.