అంటార్కిటికా విహారం తెర మీద చూసినంత సౌకర్యంగా ఉండదు. కానీ మాటల్లో చెప్పలేనంత ఆహ్లాదంగా ఉంటుంది జర్నీ. అంటార్కిటికా గురించి తెలుసుకోవాలంటే స్వయంగా పర్యటించాల్సిందే అనుకున్నాడు హైదరాబాద్ కుర్రాడు హసన్ అరుణ్. లండన్, కింగ్స్ కాలేజ్‌లో ఎకనమిక్స్ చదువుతున్న అరుణ్ గత డిసెంబర్‌లో అంటార్కిటికా సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. విశేషాలను లండన్ నుంచి సాక్షితో పంచుకున్నాడు.
మూడు సముద్రాల కలయిక
‘‘అంటార్కిటికా గురించి తెలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం నాకు సంతృప్తినివ్వలేదు. స్వయంగా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిందే అనుకున్నాను. ఆ అడ్వెంచర్‌ని ఎంజాయ్ చేయాలని కూడా. హైదరాబాద్ నుంచి గత డిసెంబర్ 21వ తేదీ బయలుదేరి దాదాపుగా ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత బ్రెజిల్ లోని ‘రియో డీ జెనీరో’మీదుగా అర్జెంటీనా రాజధాని ‘బ్యూనోస్ ఎయిరిజ్’కి చేరాను. అక్కడ మూడు రోజులున్నాను. ప్రపంచం అంచు అని చెప్పే ‘ఉషుయాయియా’ ను చూశాను. అంటార్కిటికా క్రూయిజ్ అక్కడి నుంచే మొదలవుతుంది.
ఉషుయాయియా నుంచి 26వ తేదీ ఉదయం క్రూయిజ్ ప్రయాణం మొదలైంది. బీగెల్ చానెల్‌లో సాగుతుంది క్రూయిజ్ ప్రయాణం. డ్రేక్ ప్యాసేజ్ మీదుగా ఒకటిన్నర రోజు ప్రయాణించాలి. ఈ జర్నీలో అత్యంత క్లిష్టమైన ప్రదేశం ఇదే. అట్లాంటిక్, పసిఫిక్, సదరన్ ఓషన్ ఈ మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఇది. అలలు నాలుగు మీటర్ల నుంచి పదకొండు మీటర్ల ఎత్తు లేస్తుంటాయి. సీ సిక్‌నెస్ వచ్చేది ఇప్పుడే. తల తిరగడం, వాంతులతో ఇబ్బంది పడతారు. సిక్‌నెస్ తగ్గడానికి మందులు, సీ బ్యాండేజ్ ఇస్తారు.
ఈ స్థితిలో నిద్ర సమయం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత మైనస్ రెండు ఉంటుంది. క్రూయిజ్ లోపల ఏసీ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓపెన్ ప్లేస్‌లో నాలుగైదు నిమిషాలకంటే ఎక్కువసేపు ఉండలేం. అలలు పైకి లేచినప్పుడు అంత భారీ క్రూయిజ్ కూడా నీటి తాకిడికి కదిలిపోతుంటుంది. అలలు ఆరు మీటర్ల ఎత్తు వస్తున్నంత వరకు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అంతకు మించితే మాత్రం క్రూయిజ్ ఆగాల్సిందే. లంగరు వేసి వాతావరణం నెమ్మదించిన తర్వాత కదులుతుంది. మా జర్నీలో నాలుగు మీటర్లకు మించలేదు, కాబట్టి ఆగాల్సిన అవసరం రాలేదు.
నేలను పలకరిస్తూ నీటిలో ప్రయాణం
వెడెల్ సీలోకి ప్రవేశించామంటే అంటార్కిటికా ఖండంలోకి అడుగుపెట్టినట్లే. వెడెల్ సీ లో దాదాపు సగం రోజు సాగుతుంది ప్రయాణం. గ్లేసియర్‌లు, ఐస్‌బెర్గ్‌లు, పర్వతాలు, పెంగ్విన్ కాలనీలు, వేల్స్, సీల్స్ కనిపిస్తుంటాయి. అంటార్కిటికా చేరిన తర్వాత ఆరు రోజుల పా టు రోజుకు రెండు దీవులు లేదా ద్వీపకల్పాల మీద ల్యాండ్ అవుతూ ఆరు రోజుల్లో పన్నెండింటిని కవర్ చేశాను. జనవరి రెండవ తేదీ తిరుగు ప్రయాణం. ‘బ్యూనోస్ ఎయిరిజ్’ నుంచి నేను లండన్‌కి వచ్చేశాను.
రోజంతా పగలే!
అంటార్కిటికాలో రోజంతా నింగికీ నేలకూ మధ్యనే గడిపినప్పటికీ ఆ వారం రోజులూ సూర్యాస్తమయాన్ని చూడలేకపోయాను. సూర్యుడు చండప్రచండంగా ఉదయించే ఉన్నాడు. ఇది అద్భుతమైన అనుభూతి. కాలుష్యం అంటే ఏమిటో తెలియని స్వచ్ఛమైన నీరు, లెక్కకు మించిన హిమనీనదాలు, గుంపుల కొద్దీ పెంగ్విన్ లు, సహజమైన దారుల్లో ట్రెకింగ్ నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు. నేను అడ్వెంచర్స్‌ని బాగా ఇష్టపడతాను, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లో కూడా ట్రెకింగ్ చేశాను. కానీ అంటార్కిటికా ట్రెకింగ్ సహజత్వం ఒడిలో సాగిన సాహసం అనిపించింది’’.
మనిషి వల్లే హాని
అంటార్కిటికా గురించి ప్రయాణంలోనే ఎక్కువ తెలుసుకోగలిగాను. క్రూయిజ్‌లో మెరైన్ ఇంజనీర్‌లు, సైంటిస్ట్‌లు, నేచరిస్ట్‌లు కూడా ఉంటారు. ఒక ప్రదేశానికి వెళ్లడానికి ముందు ఆ ప్రదేశం వివరాలు, అక్కడ మెలగాల్సిన విధానం కూడా చెప్తారు .
పెంగ్విన్ లకు కనీసం ఐదు మీటర్ల దూరంగా ఉండాలని, మనుషుల నుంచి వాటికి ఇన్‌ఫెక్షన్ సోకితే ఏకంగా వేలకొద్దీ ఉన్న కాలనీలే తుడిచిపెట్టుకుపోతాయని తెలిసింది. మనిషి ఎంత హానికారకుడో, ప్రకృతికి ఎంత పెద్ద శత్రువో మొదటిసారి తెలిసింది. వాళ్లు పర్యాటకులను ఆహ్వానిస్తూనే మంచుఖండం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించుకుంటున్నారు. ఇక్కడ పర్యటించడానికి డిసెంబర్ రెండవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకు అనుకూలమైన సమయం.
– హసన్ అరుణ్, సాహస యాత్రికుడు
-- ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment