అలెసా కార్సన్
వాషింగ్టన్: పెరిగి పెద్దయ్యాక అంతరిక్షయానం చేయాలని ఉందంటూ స్కూలు విద్యార్థులు చెబుతుండడం మనం వింటుంటాం. భవిష్యత్‌లో వారు ఏదో ఒక రంగంలో స్థిరపడి, చిన్నపుడు అనుకున్నది కలగానే మిగిలిపోయిన సందర్భాలే ఎక్కువగా ఉంటుంటాయి. అయితే దీనికి పూర్తి భిన్నంగా అమెరికాలోని లూసియానాకు చెందిన 17 ఏళ్ల అలెసా కార్సన్ మాత్రం అరుణ గ్రహం (మార్స్-అంగారకుడు)పై కాలుమోపబోయే తొలి మహిళగా (ఈ గ్రహంపై మొదట అడుగుపెట్టే వారిలో ఒకరిగా) రికార్డ్ సొంతం చేసుకోనుంది. అయితే అది ఇప్పుడప్పుడే కాదు ఆమె 32 ఏళ్ల వయసులో... 2033 సంవత్సరంలో..
ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగం కోసం కార్సన్ ఇప్పటికే నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్‌వాటర్ సర్వయివల్, తదితర కార్యక్రమాల్లో ప్రాథమిక శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. పద్దెనిమిదేళ్లు నిండిన వారినే నాసా వ్యోమోగామి (ఆస్ట్రోనాట్) గా అధికారికంగా ప్రకటించే వీలుంటుంది కాబట్టి ఇప్పుడామే ’బ్లూ బెర్రీ’కోడ్‌నేమ్‌తో కొనసాగుతోంది. మార్స్ గ్రహానికి వెళ్లేందుకు అవసరమైన ఆరియన్ అంతరిక్షనౌక, స్పేస్ లాంఛ్ సిస్టమ్ రాకెట్‌పై వెళ్లేందుకు ఆమెను ఈ శిక్షణ సిద్ధం చేస్తుంది. ప్రస్తుత సాంకేతికతను బట్టి చూస్తే మార్స్‌పైకి వెళ్లేందుకు ఆరుమాసాల సమయం పడుతుంది.
ఆ తర్వాత ఏడాది పాటు ఆ గ్రహంపైనే గడిపాక తిరుగుపయనమవుతారు. ఈ ట్రిప్ ముఖ్యోద్ధేశ్యం ఏమంటే..అక్కడ వనరుల అన్వేషణ, నీటి నమూనాల పరిశీలన, జీవజాతుల జాడలున్నాయా లేదా అన్నది పరిశీలించడంతో పాటు అక్కడ అవాసాలు అభివృద్ధి చేసుకునేందుకు ఉన్న అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్నది చూస్తారు.
నికోల్ ఒడియన్ ఛానల్ ’ద బాక్‌యార్డిజాన్స్’ కార్టూన్ మిషన్ టు మార్స్ ఎపిసోడ్‌లో ఓ మిత్రుల బృందం అంగారకగ్రహంపై సాహసయాత్రకు వెళ్లడం కార్సన్‌కు మూడేళ్ల వయసులోనే బలమైన ముద్రవేసింది. ఆస్ట్రోనాట్‌గా మారడమే ఆమె జీవితాశయంగా మారింది. చిన్నతనమంతా కూడా నాసాకు చెందిన అంతరిక్ష ప్రయోగకేంద్రాలు సందర్శించింది. ముందుగా వ్యోమోగామిగా అరుణగ్రహం నుంచి తిరుగొచ్చాక, ఓ అధ్యాపకురాలిగా ఆ తర్వాత దేశాధ్యక్షురాలిని కావాలని కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment