సాహస యాత్రకు  సబల సిద్ధం | Sailing Expeditions Indian Navy Rise In Sea Water Force | Sakshi
Sakshi News home page

సాహస యాత్రకు  సబల సిద్ధం

Published Tue, Dec 8 2020 8:50 AM | Last Updated on Tue, Dec 8 2020 8:59 AM

Sailing Expeditions Indian Navy Rise In Sea Water Force - Sakshi

సముద్రమంత తెగువ.. అవధులు లేని ఆత్మవిశ్వాసం..  లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన..  సాగరం చిన్నబోయేలా..  సంకల్పం తలవంచేలా.. అలల ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తూ..   తిమిరంతో సమరం చేస్తూ కదన రంగంలోనూ సరిలేరు మాకెవ్వరంటూ  భారత నౌకాదళం లో తమ శకాన్ని లిఖిస్తున్నారు మహిళలు.

నౌకాదళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ వర్తింపజెయ్యాలన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటినుంచి నౌకాదళంలో మహిళా శకం మొదలైంది. లింగసమానత్వానికి సరికొత్త నిర్వచనాన్ని తిరగరాస్తూ.. యుద్ధనౌకల్లో మహిళా అధికారుల్ని నియమించి కొత్త అధ్యాయానికి భారత నౌకాదళం తెరతీసింది. తొలి మహిళా పైలట్‌గా శివాంగి నియామకంతో సముద్రమంత ఉత్సాహం మహిళల్లో నెలకొంది. ఆ తర్వాత కొద్ది కాలానికే... యుద్ధ నౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్‌లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితీసింగ్‌లు అడుగు పెట్టడంతో.. ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. నౌకాదళం అమ్ముల పొదిలో చేరిన అత్యాధునిక ఎంహెచ్‌–60 ఆర్‌ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి నియామకంతో సైన్యంలో మహిళలకు సమ ప్రాధాన్యం, ప్రాతినిధ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపించారు. ఫ్రంట్‌లైన్‌ యుద్ధనౌకలపై మహిళా అధికారులు మోహరించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా...
ఇప్పటి వరకూ నిర్మించిన ఏ యుద్ధ నౌకలోనూ మహిళలకంటూ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చెయ్యలేదు. కనీసం మహిళల కోసం ఏ ఒక్క యుద్ధ నౌకలోనూ ప్రత్యేక టాయిలెట్స్‌ లేవంటే.. తమకు యుద్ధ నౌకల్లో పని చేసే అర్హత లేదన్నట్లుగా భావించారన్న అనుమానాలు మహిళాలోకంలో వ్యక్తమవుతున్నాయి. అయితే.. మారుతున్న కాలానికనుగుణంగా నౌకా నిర్మాణంలోనూ మార్పులు రానున్నాయని తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ ఏకే జైన్‌ నేవీ డే సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే.. యుద్ధ నౌకల్లో మహిళల ప్రవేశం లాంఛనమైన నేపథ్యంలో.. వారికి కావల్సిన సౌకర్యాలతో నౌకల్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.

తరిణి స్ఫూర్తితో బుల్‌ బుల్‌....
 గోవా నుంచి కేప్‌టౌన్‌కు సెయిలింగ్‌ బోట్‌లో వెళ్లి తిరిగి దేశానికి చేరుకుంటూ.. భారతీయ మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఐఎన్‌ఎస్‌వీ తరిణి మహిళా బృందం చేసిన సాహసయాత్ర.. నౌకాదళంలోని మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. సుమారు 21 వేల నాటికల్‌ మైళ్ల దూరం.. ఐదు మహా సముద్రాలు, ఐదు అంచెల ప్రయాణం.. ఆరుగురు మహిళలు కలిసి... భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని ప్రపంచ దేశాలకు చాటిచెప్పడమే లక్ష్యంగా సాగిన ‘నావికా సాగర్‌ పరిక్రమ’.. ఆసియాలోనే తొలిసారిగా కేవలం ఆరుగురు మహిళలతో కూడిన సెయిలింగ్‌ బోట్‌ సాహస యాత్ర ఇది. ఇండియన్‌ నేవీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగినుల్లో 20 మందిని వివిధ పరీక్షల అనంతరం ఈ యాత్రకోసం ఆరుగురిని ఎంపిక చేశారు.

తరిణికి సారధిగా లెఫ్టినెంట్‌ కమాండర్‌ వర్తికా జోషి వ్యవహరించగా లెఫ్టినెంట్‌ కమాండర్‌ ప్రతిభా జమ్వాల్, లెఫ్టినెంట్‌ కమాండర్‌ పాతర్లపల్లి స్వాతి, లెఫ్టినెంట్‌లు విజయదేవి, లెఫ్టినెంట్‌ పాయల్‌గుప్తా, లెఫ్టినెంట్‌ ఐశ్వర్య బొడ్డపాటికి అవకాశం దక్కింది. స్వాతి విశాఖ అమ్మాయి కాగా, ఐశ్వర్య హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. ఈ యాత్ర అందించిన స్ఫూర్తి.. నౌకాదళంలో మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. తరిణి సాహస యాత్రని స్ఫూర్తిగా తీసుకొని.. మరో యాత్రకు మహిళల్ని పంపించేందుకు భారత నౌకాదళం సమాయత్తమవుతోంది. ఈ సాహస యాత్రకు బుల్‌బుల్‌ అని పేరు పెట్టినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సాహసయాత్రకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొదలైందనీ.. త్వరలోనే బుల్‌బుల్‌ యాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా.. నౌకాదళంలో మహిళ పాత్ర అత్యవసరం.. ఆవశ్యకం అని చాటి చెప్పనున్నారు.

మహిళల అంకితభావానికి హ్యాట్సాఫ్‌
‘లింగభేదాన్ని సమూలంగా చెరిపేసేందుకు నౌకాదళం మహిళలకు పెద్ద పీట వేస్తోంది. యుద్ధనౌకల్లో క్రమంగా మహిళల ప్రాధాన్యం పెరిగే రోజులు సమీపంలోనే ఉన్నాయి. ఇప్పటికే వివిధ శాఖల్లో 9 నుంచి 10 మంది మహిళా అధికారులను శాశ్వతంగా నియమించే ప్రక్రియ మొదలైంది. అయితే సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు యుద్ధనౌకల్లో మహిళలకు సరైన మౌలిక వసతులు లేవు. ఇప్పుడా మచ్చ చెరిగిపోతుంది. వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు, వనరులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. కేవలం వృత్తిపరంగానే కాకుండా.. సాహసయాత్రల్లోనూ వారిది పై చేయి ఉండాలని సంకల్పించాం. ఇప్పటికే ఐఎన్‌ఎస్‌వీ తరిణి సాహస ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో త్వరలో బుల్‌బుల్‌ ప్రారంభం కానుంది. మహిళా అధికారులు నౌకాదళంలో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రదర్శిస్తున్న అంకిత భావానికి హ్యాట్సాఫ్‌
– వైస్‌ అడ్మిరల్‌ 
అతుల్‌కుమార్‌ జైన్, 
తూర్పు నౌకాదళాధిపతి

– కరుకోల గోపీకిశోర్‌రాజా
సాక్షి, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement