ప్రపంచ సాగర యాత్ర
సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావాలంటే పెట్టి పుట్టాలి. పట్టిన పట్టు విడువని స్వభావంతో పుట్టాలి. ‘ఓషన్ సెయిలింగ్ అడ్వంచర్స్’లో ఇండియా ఉనికి ప్రపంచానికి తెలియాలంటే అందునా స్త్రీ శక్తి తెలియాలంటే ‘సర్కమ్‌నావిగేషన్’ (ప్రపంచాన్ని చుట్టి రావడం) ఒక్కటే మార్గమని నేవీ వైస్ అడ్మిరల్ మనోహర్ అవతి ఉద్దేశం. అందుకే ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు.
అంటే సముద్ర మార్గాన ప్రపంచాన్ని చుట్టి రావడం. ఇప్పటికి భారతదేశం మూడు సాగర పరిక్రమలు విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో రెండింటిని పురుష ఆఫీసర్లు; ఒకదానిని మహిళా ఆఫీసర్లూ పూర్తి చేశారు. మహిళల కోసమే ‘నావికా సాగర్ పరిక్రమ’ను నేవీ ప్రవేశపెడితే 2017లో ఏడుగురు మహిళా నేవీ ఆఫీసర్లు ఆ పరిక్రమను పూర్తి చేసి జేజేలు అందుకున్నారు. ఆ తర్వాత ‘నావికా సాగర్ పరిక్రమ 2’ యత్నాలు మొదలయ్యాయి.
ఏడుగురి స్థానంలో ఇద్దరినే ఉంచి సాహసవంతంగా పరిక్రమ చేయించాలని నేవీ సంకల్పించింది. ఇందుకు నేవీలో పని చేసే మహిళా ఆఫీసర్ల నుంచి స్వచ్ఛందంగా దరఖాస్తులు ఆహ్వానించగా చాలామంది స్పందించారు. వారిలో అనేక దశల వడ΄ోత తర్వాత ఇద్దరు ఆఫీసర్లు మిగిలారు. వారే రూపా, దిల్‌నా. గత మూడేళ్లుగా వారితో చేయించిన ట్రైనింగ్ ముగియడంతో అతి త్వరలో సాహసయాత్ర మొదలుకానుందని నేవీ తెలిపింది.
→ ఆటల నుంచి సాగరంలోకి...
‘నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఆటలు ఆడుతూనే 2014లో నేవీలోకి వచ్చాను’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ డెల్నా. కేరళకు చెందిన డెల్నా ఆర్మీలో పని చేస్తున్న తండ్రిని చూసి నేవీలో చేరింది. ‘నేవీలో లాజిస్టిక్స్ ఆఫీసర్‌గా పని చేస్తూ ఉండగా ‘నావికా సాగర్ పరిక్రమ 2’ సంగతి తెలిసింది. నేను అప్లై చేశాను. సెలెక్ట్ అయ్యాను. అయితే అప్లై చేసిన చాలామంది మధ్యలోనే కుటుంబ వొత్తిళ్ల వల్ల మానుకున్నారు. సముద్రం మీద సంవత్సరం పాటు కేవలం మరొక ఆఫీసర్ తోడుతోనే ఉండాలంటే ఎవరైనా భయపడతారు. కాని మా నాన్న, నేవీలోనే పని చేస్తున్న నా భర్త నన్ను ్ర΄ోత్సహించారు. నేవీలో పని చేయడం అంటే జీవితం సముద్రంలో గడవడమే. అయినా నేనూ నా భర్త శాటిలైట్ ఫోన్ ద్వారా కనెక్టివిటీలోనే ఉంటాం’ అని తెలిపింది డెల్నా.
→ నన్ను నేను తెలుసుకోవడమే
‘నేలకు దూరంగా సముద్రం మీద ఉండటం అంటే నన్ను నేను తెలుసుకోవడమే’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా. పాండిచ్చేరికి చెందిన రూప తండ్రి నేవీలోనే పని చేస్తుండటంతో 2017లో ఆమె నేవీలో చేరింది. ‘ముంబైలో నేవీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుండగా నావికా సాగర్ పరిక్రమ 2లో పాల్గొనే అవకాశం వచ్చింది. సముద్రం అంటే నాకు ఇష్టం. నేలను ఒదిలి పెట్టి వచ్చిన మనిషిని సముద్రం ఎప్పుడూ నిరాశ పరచదు. అద్భుతమైన ప్రకృతిని సముద్రం మీద చూడవచ్చు. ఒక్కోసారి భయం వేస్తుంది. కాని అంతలో ముందుకు సాగే ధైర్యం వస్తుంది’ అంటోందామె.
→ కఠిన శిక్షణ
‘నావికా సాగర్ పరిక్రమ2’కు ఎంపికయ్యాక గత మూడు సంవత్సరాలుగా డెల్నా, రూపాలు శిక్షణ తీసుకుంటున్నారు. తారిణి అనే సెయిల్ బోట్లో వీరికి శిక్షణ జరుగుతోంది. ఇప్పటికే వీరు ఈ బోట్‌లో సముద్రం మీద 34 వేల నాటికల్ మైళ్లు తిరిగారు. బోట్‌ను నడపడం, దిశను ఇవ్వడం, రిపేర్లు చేసుకోవడం, వైద్యం చేసుకోవడం, శారీరక మానసిక దృడ్వం కలిగి ఉండటం... ఇవన్నీ శిక్షణలో నేర్పిస్తారు. ‘మేము ఇద్దరమే బోట్‌లో ఉంటాం. అంటే పని ఎక్కువ నిద్ర తక్కువ ఉంటుంది. ఊహించని తుఫాన్లు ఉంటాయి. ఒకేవిధమైన పనిని తట్టుకునే స్వభావం, ఓపిక చాలా ముఖ్యం. మేము అన్ని విధాలా సిద్ధమయ్యాము. ఇక ప్రయాణమే ఆలస్యం’ అన్నారు ఈ ఇద్దరు ధీరవనితలు. త్వరలో ్రపారంభం కానున్న వీరి సాగర పరిక్రమ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిద్దాం.
56 అడుగుల సెయిల్ బోట్.
40000 కిలోమీటర్ల దూరం
250 రోజుల ప్రయాణం
రాకాసి అలలు... భీకరగాలులు
వీటన్నింటినీ ఎదుర్కొంటూ ఇద్దరే మహిళా నావికులు. స్త్రీలంటే ధీరలు అని నిరూపించడానికి ఇండియన్ నేవీ త్వరలో తన ఇద్దరు నావికులను సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావడానికి పంపనుంది. పాండిచ్చేరికి చెందిన రూపా కాలికట్‌కు చెందిన డెల్‌నా బయలుదేరనున్నారు. ఈ సాహస యాత్ర గురించి...
Comments
Please login to add a commentAdd a comment