ఎడారిలో బుడతడి సాహసయాత్ర!
- ప్రమాదకర లోప్‌నర్ ఎడారిని దాటిన ఆరేళ్ల బాలుడు
- కొంత దూరం కాలినడకన.. మరికొంత దూరం వాహనంలో ప్రయాణం
బీజింగ్: లోప్‌నర్.. ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఎడారి.. అటువంటి ఎడారిని దాటి రికార్డు సృష్టించాడు ఓ ఆరేళ్ల చైనా బుడతడు. హీ యేదే(6) అతిచిన్న వయసులో విమానం నడిపిన వ్యక్తిగా గతంలో గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. డ్యుయోడ్యుయో అని ముద్దుగా పిలుచుకునే హీయేదే మరో 13 మందితో కలసి లోప్‌నర్ ఎడారిలో మూడు వేల కిలోమీటర్ల సాహసయాత్రను గురువారం పూర్తి చేశాడు.
జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ప్రమాదకర ఎడారిని కొంత దూరం కాలినడకన.. మరికొంత దూరం వాహనంలోనూ దాటినట్టు హీయేదే తండ్రి హీలీషెంగ్ చెప్పారు. ఈ యాత్ర కోసం ముందస్తుగా ఎంతో కసరత్తు చేశామని, తమ పిల్లల జీవితాన్ని ప్రమాదంలో పెట్టాలని భావించలేదని చెప్పారు. గత అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ సాహసయాత్ర కోసం మరో ముగ్గురు చిన్నారులను నాన్‌జింగ్‌లో వ్యాపారవేత్త అయిన లీషెంగ్ ఎంపిక చేశారు. వారి కుటుంబాలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నాయి.
ఈ యాత్ర కోసం పెద్ద మొత్తంలో ఇన్‌స్టెంట్ ఫుడ్‌ను, శాండ్ ప్రూఫ్ గ్లాస్‌లను, వంద రకాల మందులు సిద్ధం చేసుకున్నారు. ఈ సాహసయాత్రతో స్కూల్‌లో చెప్పని ఎన్నో విషయాలను తమ పిల్లలు నేర్చుకున్నారని లీషెంగ్ చెప్పారు. డెరైక్షన్స్ ఎలా చెప్పాలి, జంతువులను ఎలా భయపెట్టాలి, ఎడారిలో నీటిని ఎలా గుర్తించాలి వంటివి నేర్చుకున్నారని చెప్పారు.
లోప్‌నర్‌లో ప్రయాణం పబ్లిసిటీ స్టంట్ అన్న ఆరోపణలపై షెంగ్ స్పందిస్తూ.. తమ చిన్నారులను వురింత ధైర్యవంతులుగా చేయాలనేదే ఈ సాహసయాత్ర లక్ష్యమన్నారు. 2012లో న్యూయార్క్ వీధుల్లో సున్నా ఉష్ణోగ్రతలో ఒంటిపై నూలుపోగు లేకుండా పరిగెత్తి.. రన్నింగ్ నేక్‌డ్ బాయ్‌గా చైనాలో గుర్తింపు సాధించాడు డ్యుయోడ్యుయో. అదే ఏడాది ఆగస్ట్‌లో ఒంటరిగా నౌకను నడిపాడు. 2013 ఆగస్ట్‌లో ఆల్ట్రాలైట్ విమానాన్ని 35 నిమిషాలసేపు నడిపి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు.