భారతీయుడిగా గర్వపడుతున్నా
భద్రాచలం టౌన్: కష్టసాధ్యమైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినందుకు భారతీయుడిగా గర్వపడుతున్నానని సాధనపల్లి ఆనంద్‌కుమార్ అన్నాడు. ప్రపంచంలో ఎత్తై శిఖరాన్ని అధిరోహించి పలువురి ప్రశంసలు అందుకున్న ఆనంద్‌కుమార్ తన తల్లిదండ్రులతో గురువారం రాత్రి భద్రాచలం చేరుకున్నాడు. ఈ సందర్భంగా విద్యావేత్తలు, ప్రముఖులు, బంధువులు ఆనంద్‌కుమార్‌కు ఘనస్వాగతం పలికారు. భద్రాచలం ఎంఈవో మాధవరావు, పాల్‌రాజ్ ఇంజనీరింగ్ చైర్మన్ అబ్రహం పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ..... భారత దేశ జెండాతో పాటు, తెలంగాణ రాష్ట్ర జెండాను ఎవరెస్టు శిఖరంపై పాతటంతోనే తన గుండె ఉద్వేగంతో నిండిపోయిందని తెలిపాడు. తన విజయంతో భద్రాచలానికి ఖ్యాతి లభించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. పేదరికం దేనికి అడ్డుకాదని, ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పట్టుదల, క్రమశిక్షణతో కష్టపడితే విజయం వరిస్తుందని ఈ యాత్ర ద్వారా తెలిసిందని పేర్కొన్నాడు. తన విజయం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు.
భద్రాచలం వచ్చిన ఆనంద్‌కుమార్‌కు స్వాగతం పలికిన వారిలో కరుణానిధి, జెట్టి రంజిత్‌కుమార్, సాధనపల్లి సతీష్, దాసరి శేఖర్ తదితరులు ఉన్నారు. కాగా, శుక్రవారం ఆనంద్‌కుమార్‌కు ఆర్‌డీవోతో పాటు, పలువురు సన్మాన, అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.