Everest mountain
-
శెభాష్ కామ్య..!
జంషెడ్పూర్: కామ్య కార్తికేయన్. 16 ఏళ్లు. చదివేది ప్లస్‌టూ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ వైపు నుంచి చిన్న వయస్సులోనే అధిరోహించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బాలికగా కూడా నిలిచింది. ఈ నెల 20వ తేదీన తండ్రితో కలిసి ఆమె ఈ ఘనత సాధించినట్లు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్(టీఎస్‌ఏఎఫ్) గురువారం తెలిపింది. ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించిన రికార్డు సాధించేందుకు కామ్య మరో అడుగు దూరంలోనే ఉన్నట్లు టీఎస్‌ఏఎఫ్ చైర్మన్ చాణక్య చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం, అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమనే విషయం కామ్య రుజువు చేసిందని, సాహసికులకు ఆమె ప్రేరణగా నిలిచిందని తెలిపారు. ఈ సంస్థే కామ్యకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఏప్రిల్ ఆరో తేదీన తన బృందంతోపాటు కఠ్మాండుకు చేరుకున్న కామ్య..పూర్తిస్థాయి సన్నద్ధతతో మే 16వ తేదీన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి తండ్రి కార్తికేయన్‌తోపాటు సాహసయాత్రను ప్రారంభించింది. తండ్రితో కలిసి మే 20వ తేదీన వేకువజామున 8,848 మీటర్ల ఎత్తయిన శిఖరంపైకి చేరుకుందని టీఎస్‌ఏఎఫ్ వివరించింది. తాజా విజయంతో ఆరు ఘనతలను సాధించిన కామ్య.. ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలన్న ధ్యేయానికి కేవలం అడుగు దూరంలో నిలిచిందని వెస్టర్న్ నేవీ కమాండ్ ‘ఎక్స్’లో పేర్కొంది. ఏడో లక్ష్యమైన అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాస్సిఫ్‌ను వచ్చే డిసెంబర్లో అధిరోహించేందుకు సిద్ధమవుతున్న కామ్య.. ఈ అరుదైన ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా చరిత్ర పుటల్లో నిలవాలని కోరుకుంటున్నట్లు వివరించింది.నేవీ కమాండర్ ఎస్.కార్తికేయన్ కుమార్తె కామ్య. ముంబైలోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో ప్లస్‌టూ చదువుకుంటోంది. పర్వతారోహణ అంటే కామ్యకు చిన్ననాటి నుంచే ఎంతో ఆసక్తి. ఏడో ఏటనే, 2015లో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశిల పర్వతాన్ని అధిరోహించి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2016లో 13,500 అడుగుల ఎత్తున్న మరింత కఠినమైన హరి కీ దున్ను, కేదార్నాథ్ శిఖరాలను అవలీలగా ఎక్కింది. అదేవిధంగా, 16,400 అడుగుల ఎత్తులో రూప్‌కుండ్ సరస్సుకు చేరుకుంది. అసా ధారణ విజయాలను నమోదు చేసిన బాలల కిచ్చే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల శక్తి పుర స్కారం కూడా కామ్య అందుకుంది. 2017లో నేపాల్‌లోని 17,600 అడుగుల ఎత్తున ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకుని ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచింది.ఎవరెస్ట్ కీ బేటీ– ప్రత్యేక కథనం ఫ్యామిలీలో -
‘ఎవరెస్టు’ను అధిరోహించిన 10 ఏళ్ల చిన్నారి
Youngest Mountaineer to Climb Mount Everest: ముంబైకి చెందిన రిథమ్ మమానియా అనే 10 ఏళ్ల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఈ నెల ప్రారంభంలో ఉత్కంఠభరితమైన ఫీట్ సాధించిన భారతీయ పర్వతారోహకులలో ఒకరిగా ఆ బాలిక నిలిచింది. ఆమె సబర్బన్ బాంద్రాలోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయంలో ఐదవ తరగతి చదువుతోంది. రిథమ్ మే 6న సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న నేపాల్‌లోని సౌత్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది. 11 రోజుల పాటు సాగిన యాత్ర బేస్‌క్యాంప్‌కు చేరుకోవడంతో విజయవంతంగా పూర్తయింది. అత్యంత కష్టతరమైన దుర్భేద్యమైన పర్వతమే కాకుండా కఠినతరమైన వాతవరణ పరిస్థితులు తట్టుకుని అధిరోహించే సాహసయాత్ర అయినప్పటికీ ఇవేమి ఆమె లక్ష్యాన్ని నిలువరించలేకపోయాయి. ఐతే రిథమ్ బేస్క్యాంప్కి చేరుకున్న తర్వాత ఆమెతోపాటు పాల్గొన్న ఇతర సభ్యలు విమానంలో తిరిగి వెళ్లేలని నిర్ణయించుకుంటే ఆమె మాత్రం నడచే వెళ్తానని పట్టుబట్టడం విశేషం. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... "తొలిసారిగా కాలినడకన దూద్ సాగర్ ట్రెక్కింగ్‌ని విజయవంతం పూర్తి చేశాను. తదనంతరం సహ్యాద్రి పర్వత శ్రేణులలో కర్నాలా, లోహగడ్, మహులి కోటలతో సహా కొన్ని శిఖరాలను అధిరోహించాను. అంతేకాదు ఈ ట్రెక్కింగ్ బాధ్యయుతమైన ట్రెక్కర్‌గా పర్వత వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడం ఎంత ముఖ్యమో నేర్పింది" అంటూ చెప్పుకొచ్చింది. (చదవండి: మోదీని సర్ప్రైజ్ చేసిన బాలుడు.. ఆశ్యర్యపోయిన ప్రధాని) -
ఎవరెస్ట్ ఎత్తు పెరిగింది, ఎంతంటే..
ఖాట్మండ్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తును నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. తాజా లెక్కల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 8,848.86 మీటర్లు ఉందని తెలిపింది. 2015 భూకంపం తర్వాత ఎత్తు మారి ఉంటుందన్న సందేహాల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం 2017లో ఎవరెస్టు ఎత్తును కొలిచే ప్రక్రియ ప్రారంభించింది. దీని కోసం నేపాల్ సర్కారు చైనా సాయం తీసుకుంది. (చదవండి : చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!) చైనా సహకారంతో నిర్మించిన సర్వేల ద్వారా ఎవరెస్ట్ ఎత్తులో ఎలాంటి తరుగుదల చోటుచేసుకోలేదని వెల్లడైంది. ఎవరెస్ట్ శిఖరం తాజా ఎత్తు 8,848.86 మీటర్లు అని నేపాల్ ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ పర్వతం ఎత్తును భారత ప్రభుత్వం 1954లో కొలిచినపుడు 8,848 మీటర్లు అని నిర్థరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా దీనినే విస్తృతంగా ఆమోదిస్తున్నారు. తాజాగా నేపాల్ సర్వేలో ఎవరెస్ట్ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని, ప్రస్తుతం దాని ఎత్తు 8,848.86 మీటర్లకు చేరిందని ప్రకటించాయి. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, చైనా మంత్రి వాంగ్ యి వర్చువల్ కార్యక్రమంలో ఈ వివరాలను ప్రకటించారు. -
ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందా?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టు ఎత్తు పెరిగినట్టు కనిపిస్తోందని చెబుతున్నాయి కొన్ని సర్వేలు. కానీ ఈ విషయంపై నేపాల్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మారిన ఎవరెస్టు ఎత్తుని నేపాల్ త్వరలోనే చైనాతో కలిసి సంయుక్త ప్రకటించనుంది. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఎవరెస్టు కొత్త ఎత్తుని ప్రకటించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖకు అంగీకారం లభించింది. 2015 భూకంపం తర్వాత ఎత్తు మారి ఉంటుందన్న సందేహాల నడుమ నేపాల్ ప్రభుత్వం 2017లో ఎవరెస్టు ఎత్తును కొలిచే ప్రక్రియ ప్రారంభించింది. తమ సొంత వనరుల మేరకు ఎవరెస్టు ఎత్తు కొలవడం పూర్తయిందని, మరికొన్ని రోజుల్లో అధికారికంగా వెల్లడిస్తామని నేపాల్ ‘భూ నిర్వహణ మంత్రి’ పద్మ కుమారి తెలిపారు. సంయుక్త ప్రకటన ఎందుకు? అధికారిక గణాంకాల ప్రకారం (1954లో భారత్ చేపట్టిన సర్వే ఆధారంగా) ఎవరెస్టు ఎత్తు 8,848 మీటర్లు(29,029 అడుగులు). అయితే ఈ విషయంలో చైనా, నేపాల్ మధ్య ఎప్పటినుంచో అభిప్రాయ భేదాలున్నాయి. ఎవరెస్టుకు ఉత్తర దిశలో ఉన్న టిబెట్ వైపు నుంచి శిఖరం ఎత్తుని లెక్కగట్టిన చైనా, 2015లో ఏకపక్షంగా కేవలం రాతి ఎత్తునే పరిగణలోకి తీసుకుని శిఖరం ఎత్తు 8844.04 మీటర్లుగా ప్రకటించింది. రాతి ఎత్తుతో పాటు మంచుపొర ఎత్తుని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నది నేపాల్ వాదన. గతేడాది అక్టోబరులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా మంచుపొర ఎత్తుని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న నేపాల్ ప్రతిపాదనకు చైనా అంగీకరించింది. ఆ సమయంలోనే మారిన ఎవరెస్టు ఎత్తుని సంయుక్తంగా ప్రకటించాలని ఈ ఇరు దేశాలూ ఒప్పందం చేసుకున్నాయి. -
శిఖరం అంచున విషాద యాత్ర..
ఎడ్ డ్రోహింగ్.. అమెరికాలోని అరిజోనాకు చెందిన వైద్యుడు.. అతడి జీవిత కాల స్వప్నం ఒక్కటే.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించాలని.. సరిగ్గా రెండ్రోజుల క్రితం.. ఎడ్ డ్రోహింగ్ ఎవరెస్టు శిఖరాగ్రానికి చాలా దగ్గరగా వచ్చేశాడు.. యాహూ అందామనుకున్నాడు. కానీ అక్కడి పరిస్థితిని చూసి షాక్ తిన్నాడు.. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.. కూరగాయల మార్కెట్లా కిటకిటలాడుతోంది.. శిఖరాగ్రంపై పర్వతారోహకులు సెల్ఫీలు తీసుకోవడానికి ఒకరినొకరు తోసుకుంటున్నారు... గట్టిగా చూస్తే.. రెండు టేబుల్ టెన్నిస్ టేబుల్స్ పట్టేంత జాగా ఉంటుందేమో అక్కడ.. ఓ 20 మంది పర్వతారోహకులు.. వారి గైడ్లు.. షెర్పాలు కిక్కిరిసిపోయారు.. దీంతో అందరిలాగే తానూ లైనులో వెయిట్ చేయాల్సి వచ్చింది.. చాలా నెమ్మదిగా కదులుతోంది లైను.. దారిలో ఓ మహిళ శవం.. ఎవరెస్టును అధిరోహించి.. తిరిగి వస్తూ.. చనిపోయిందట.. తొక్కేయాల్సిందే.. జస్ట్‌లో మిస్సయ్యాడు.. అక్కడి పరిస్థితి చాలా దారుణంగా కనిపించింది..అదొక జూలాగ అనిపించింది. తోటి వారి శవాలు పక్కనే పడి ఉన్నా..పట్టనట్లుగా.. ఎవరికివారు పోతున్నారు.. మానవత్వం అక్కడే గొంతు కోసుకుని మరణించినట్లు అనిపించింది. – ఎడ్ డ్రోహింగ్.. ఎవరెస్టుపై గత వారం రోజుల్లో 11 మంది చనిపోయారు.. కొందరు తమ కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో.. కొందరు విజయగర్వంతో తిరిగివస్తూ.. అశువులు బాసారు.. ఇందులో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. 1922 నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 200 మందికిపైగా చనిపోయి ఉంటారని అంచనా. కానీ ఇక్కడ వారంలోనే ఇంతమంది చనిపోయారు. అలాగని ఈ మరణాలకు కారణం.. మంచు తుపాన్లు కాదు.. అతి వేగంగా వీచే శీతల గాలులు కానే కాదు.. మరేంటి? ఎన్నడూ లేనంత రద్దీనా.. ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఇంకేంటి? గతంలో పలుమార్లు ఈ శిఖరాన్ని అధిరోహించినవారు ఏం చెబుతున్నారు? ఓసారి చూద్దామా.. 26 వేల అడుగులు దాటితే.. ఈసారి ఎవరెస్టుపై ఎన్నడూ లేనంత రద్దీ కనిపించిందని చెబుతున్నారు. దీనికితోడు పర్వతారోహణ విషయంలో సరైన అనుభవం లేని వారు ఎక్కువగా ఉండటం కూడా మరణాలకు ప్రధాన కారణమని అనుభవజ్ఞులైన పర్వతారోహకులు చెబుతున్నారు. ‘ఈ మధ్య థ్రిల్ కోరుకునేవారు ఎక్కువైపోయారు. దీన్ని క్యాష్ చేసుకునే కంపెనీలు కూడా ఎక్కువయ్యాయి. ఈ అడ్వెంచర్ కంపెనీలకు డబ్బే ప్రధానమైపోయింది. అర్హత లేని గైడ్లు, షెర్పాలను పనిలో పెట్టుకున్నారు. అటు పర్వతారోహణ చేయాలనుకుంటున్నవాళ్లకు సరైన అనుభవం ఉందా వారు ఎవరెస్టు వంటి శిఖరాన్ని అధిరోహించగలరా వంటివేమీ చూసుకోవడం లేదు’ అని ఎవరెస్టును పలుమార్లు అధిరోహించిన అలెన్ చెప్పారు. నువ్వు పోలీసు అవ్వాలంటేనే పలు టెస్టులు పాసవ్వాలి.. అలాంటిది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అధిరోహించడానికి నీకు తగిన అర్హత ఉండాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. నిజానికి 25–26 వేల అడుగులు దాటామంటే.. పర్వతారోహకులకు అది డెత్ జోన్ కిందే లెక్క. మైండ్, బాడీ సరిగా పనిచేయవు. ప్రతి నిమిషం విలువైనదే. ఎవరెస్టు ఎత్తు 29,029 అడుగులు.. అంత పైకి వెళ్తున్నప్పుడు చివరి దశలో వారు తమ వద్ద ఉన్న బ్యాగేజీనంతటినీ వదిలేస్తారు.. వెళ్లి, తిరిగిరావడానికి వీలుగా కంప్రెస్డ్ ఆక్సిజన్ క్యాన్లను మాత్రమే తీసుకెళ్తారు. వారు నిర్ణీత సమయంలో శిఖరాగ్రానికి వెళ్లి తిరిగి వచ్చేయాలి. లేదంటే.. ఆక్సిజన్ అయిపోయి చనిపోతారు. అనుభవం లేని పర్వతారోహకులు వేగంగా తిరిగి రాలేకపోవడం వంటివి జరిగాయని షెర్పాలు చెబుతున్నారు. అదే సమయంలో అనుభవజ్ఞులైన వారు కూడా చనిపోయారు. దీనికి కారణం.. ఎప్పుడూ లేనంత ట్రాఫిక్ జామే.. లైనులో గంటల తరబడి వేచి ఉండటం వల్ల ఆక్సిజన్ అయిపోయి ఉంటుంది.. లేదా శరీరంలో విపరీతమైన మార్పులు ఏర్పడటం వంటివి జరిగి ఉంటాయని పేర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బంది ఉంటుందని తెలిసినా.. చివరి దశకు వచ్చేసరికి కొందరు మొండిగా ముందుకు పోతారని.. దాని వల్ల కూడా మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. ‘మే నెల ఎవరెస్టు అధిరోహణకు సరైన సమయం.. ఆ నెలలోనూ కొన్ని రోజుల్లోనే అక్కడంతా క్లియర్‌గా.. గాలులు తక్కువగా ఉంటాయి.. ఆ సమయంలో శిఖరాగ్రం చేరుకోవడం సులభం.. దాంతో.. ఒకే సమయంలో ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించారు. దీంతో చాలామంది చనిపోయారు’ అని అలెన్ చెప్పారు. నేపాల్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. ‘ఎవరెస్టును రెండువైపుల నుంచి ఎక్కవచ్చు. ఒకటి నేపాల్.. మరొకటి చైనా వైపు నుంచి.. నేపాల్ ఓ పేద దేశం.. దీనిపై వచ్చే డాలర్ల కొద్దీ ఆదాయాన్ని మాత్రమే చూస్తోంది తప్ప.. నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 400 మందికి పర్మిట్లు జారీ చేసింది. అదే చైనా చూస్తే 150 మందికే అనుమతి ఇచ్చింది. జామ్‌కు ఇదీ ఒక కారణం. ఇలా నిబంధనలను ఉల్లంఘిస్తూ పోతే.. మరణాలు పెరుగుతూనే ఉంటాయి’ అని మరో పర్వతారోహకుడు ఆడ్రియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య అర్హత లేని కొన్ని కంపెనీలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.. అందులో నేపాల్‌కు చెందినవి అత్యధికంగా ఉన్నాయి. మరణాలు కూడా ఇటు వైపు నుంచి అధిరోహించినవారివే ఉండటం ఇక్కడ గమనార్హం. అయితే.. నేపాల్ ఉన్నతాధికారులు దీన్ని కొట్టిపడేస్తున్నారు. మరణాలకు కారణం.. ఓవర్‌క్రౌడింగ్ కాదని.. శిఖరాగ్రాన్ని అధిరోహించేందుకు వాతావరణపరంగా అనుకూలించే రోజులు పరిమితంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. పర్వతారోహకుల సంఖ్యను నియంత్రించడం ఎందుకు.. పూర్తిగా ఆపేస్తే పోలా అంటూ తేలికగా తీసిపారేస్తున్నారు. కళ్లముందే కూలిపోయినా సాయం చేయలేని పరిస్థితి..నీ దగ్గర ఉన్న ఆక్సిజన్ ఇస్తే..తర్వాత ఆక్సిజన్ అయిపోయి..చనిపోయేది నువ్వే.. ఏది ముఖ్యం.. మానవత్వమా? లేక మనం బతికుండటమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. మానవత్వాన్ని మంచులో సమాధి చేసి ముందుకు సాగాల్సిందే. ఫాతిమా, పర్వతారోహకురాలు, లెబనాన్ - సాక్షి సెంట్రల్ డెస్క్ -
కొండంత ఆత్మస్థైర్యం!
అతనో ఆటో డ్రైవర్ కుమారుడు. కానీ మంచి పర్వతారోహకుడు. పేదరికం వెంటాడుతున్నా తన అభిరుచిని, ఆసక్తిని మానుకోలేదు. ఇప్పటికే ఎన్నో పర్వతాలను అధిరోహించాడు. కిలిమంజారో, కొజియాస్కీ మౌంటెరెనాక్ వంటివి ఆయనకు పాదాక్రాంతం అయ్యాయి. కానీ తన అసలు లక్ష్యం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. అందుకు ఆర్థికంగా వెసులు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు తిరుపతిరెడ్డి. ఇందుకు దాదాపు రూ.30 లక్షలు అవసరమవుతాయని ఆయన చెబుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండకు చెందిన గుంతల తిరుపతిరెడ్డి ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చేస్తూ ఆటో నడుపుతున్నారు. తండ్రి కూడా ఆటో డ్రైవరే. చిన్నప్పటినుంచీ తిరుపతిరెడ్డికి పర్వతారోహణమంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే 2015 మార్చి 24న ప్రఖ్యాత పర్వతారోహకుడు మస్తాన్ బాబు పర్వతారోహణ చేస్తూ మృతి చెందారు. దీంతో తిరుపతిరెడ్డి ఆలోచనలు మస్తాన్‌బాబు చుట్టే తిరిగాయి. ఐదంకెల జీతం, హాయిగా సాగిపోయే జీవితం.. అవన్నీ వదిలిపెట్టి ఓ వ్యక్తి పర్వతారోహణ చేయడమేంటి? అని ఆలోచించారు. ప్రపంచంలోని ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేశారు. భవనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో చేరారు. ప్రొఫెషనల్ మౌంటనీర్ శేఖర్‌బాబు వద్ద శిక్షణ పొందారు. ఎత్తయిన గుట్టలు ఎలా ఎక్కాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలన్నీ తెలుసుకున్నారు. భువనగిరిగుట్టను తిరుపతిరెడ్డి తొలి ప్రయత్నంలోనే అధిరోహించి.. పర్వతారోహణకు బాటలు వేసుకున్నారు. లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌అవార్డు అందుకుంటూ.. విన్నర్స్ ఫౌండేషన్ వెన్నుదన్ను.. విన్నర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రఘు, జాయింట్ సెక్రటరీ రమేష్ కాంబ్లీలు తిరుపతిరెడ్డి ప్రతిభను గుర్తించి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. నిధుల సేకరణకు తోడ్పడుతున్నారు. భారత డైనమిక్స్ లిమిటెడ్ ఉద్యోగులైన రఘు, రమేష్ కాంబ్లీఉ విన్నర్స్ ఫౌండేషన్ ద్వారా ఎందరో అభాగ్యులకు అండగా నిలిచారు. తిరుపతిరెడ్డికి సైతం ఆపన్నహస్తం అందించేందుకు సాయపడుతున్నారు. రూ.30 లక్షలు అవసరం.. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే అనేక వ్యయ ప్రయాసలతో మూడు శిఖరాలను అధిరోహించిన తిరుపతిరెడ్డి ప్రస్తుతం ఎవరెస్ట్ అధిరోహించాలంటే దాదాపు రూ.30 లక్షలు అవసరమయ్యాయి. ట్రాన్సన్డ్ అడ్వంచర్స్ సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని రెండు విడతల్లో అందించాలి. మొదటి విడత డబ్బును ఇప్పటికే ఇవ్వాలి కానీ తన వద్ద డబ్బు లేకపోవడంతో దాతల కోసం ఎదురుచూస్తున్నారు. నాన్న ఆటోడ్రైవర్. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబం గడవడటమే గగనంగా మారింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే నా జీవిత లక్ష్యం. దాతలు ఆదుకుంటే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసా.– గుంతల తిరుపతిరెడ్డి, పర్వతారోహకుడు తిరుపతిరెడ్డి బ్యాంక్ ఖాతా వివరాలు ఎస్బీఐ అకౌంట్ నంబర్ 37778643692, ఐఎఫ్ఎస్సీ: ఎస్బీఐఎన్0020966, శంకరపల్లి బ్రాంచ్. ఫోన్: 90008 24190, 96761 47611. -
ఎనిమిది సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు కానీ...
డార్జిలింగ్ : ఆయన ఎనిమిది సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు.. కానీ ప్రమాదవశాత్తు ఓ హిమనీనదిలో పడి కనిపించకుండా పోయాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన పెంబా శెర్పా (47) పర్వతారోహకులలో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే పేరుగాంచిన ఎవరెస్ట్ పర్వతాన్ని 8 సార్లు అధిరోహించాడు. మకాలు, కాంచనగంగ వంటి పర్వతాలను కూడా ఎక్కాడు. కొన్ని రోజుల క్రితం పర్వత శిఖరం మీద నుంచి కిందకు దిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ససెర్ కంగ్రి అనే హిమనీనదిలో పడిపోయాడు. అప్పటినుంచి అతని జాడలేకుండా పోయింది. ఐటీబీపీ జవాన్లు, సెర్పాస్ ప్రజలు పెంబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెంబా భార్య మాట్లాడుతూ.. ‘‘ఆయన జూన్ 19న మనాలికి వెళ్తునట్లు తెల్సింది. పెంబా లోయలో పడిపోయినట్లు అతని చిన్న తమ్ముడికి శనివారం ఫోన్ వచ్చింద’’ని ఆమె తెలిపింది. -
ఎవరెస్ట్ అంత పెళ్లి గౌను..!
కాడ్రీ : ప్రపంచంలోని అతి పెద్ద పెళ్లి గౌనును ఫ్రెంచ్ పట్టణం కాడ్రీలో ఆవిష్కరించారు. ఈ గౌను సైజు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరం ఎవరెస్ట్‌ను ఈ డ్రెస్‌తో కప్పేయొచ్చట. దుస్తుల తయారీ కంపెనీ డైనమిక్ ప్రాజెక్ట్స్ ఈ గౌనును తయారు చేసినట్లు గిన్నిస్ బుక్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ గౌనుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. తొలుత విడి భాగాలను తయారు చేసి ఆ తర్వాత మొత్తం డ్రెస్‌ను కుట్టినట్లు తెలిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద పెళ్లి గౌనుగా దీన్ని గుర్తిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కంపెనీ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందజేసింది. ఆ తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్లో గౌను ఫొటోను ట్వీట్ చేసింది. -
ఎవరెస్టుని అధిరోహించిన విద్యార్థి
సంజీవపురం(ఓబులవారిపల్లె): మండలంలోని సంజీవపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన గానుగపెంట హరిప్రసాద్ పట్టుదలతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. పెనగలూరు మండలం సింగిరెడ్డిపల్లె ఎస్సీకాలనీలోని పేద కుటుంబమైన గానుగపెంట నరసయ్య, యల్లమ్మల కుమారుడు హరిప్రసాద్. తల్లిదండ్రులు కూలిపనులు చేసుకుంటూ కుమారుడిని చదివిస్తున్నారు. 22వ తేదీ తెల్లవారుజామున ఎంతో కష్టతరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన హరిప్రసాద్ కన్నతల్లిదండ్రులకే కాకుండా అతను చదువుతున్న గురుకుల పాఠశాలకు, జిల్లాకు పేరు తీసుకువచ్చాడు. సంజీవపురం సాంఘిక గురుకుల పాఠశాలలో 3వ తరగతిలో అతను ప్రవేశం పొందాడు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో వేయికి 759 మార్కులు సాధించి చదువులో కూడా రాణించాడు. పర్వతారోహణపై మక్కువ పెంచుకున్న హరిప్రసాద్ పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విజయవాడ సమీపంలోని కేధరకొండ, పశ్చిమగోదావరి జిల్లా పెద్దరేగిపల్లె, నేపాల్‌లోని ఖాట్మాండ్లో శిక్షణను పొందాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో ఎవరెస్టు శిఖరం అధిరోహించేందుకు అర్హత సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల అనంతరం పర్వతారోహణకు బయలుదేరాడు. కాగా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి మొత్తం 13మంది ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపికయ్యారు. ఈ బృందం ఏప్రిల్ 11వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి బయలుదేరి వెళ్లింది. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి వారు 22తేదీన తెల్లవారుజామున 3.30కు ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుని మనదేశ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరానికి: పేద కుటుంబానికి చెందిన హరిప్రసాద్ తల్లి యల్లమ్మ, తండ్రి నరసయ్యల ప్రోత్సాహంతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. పర్వతారోహణపై మక్కువ ఉండటంతో ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడంతో సాంఘిక సంక్షేమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తంచేస్తున్నాం. హరిప్రసాద్లాగే మున్ముందు ఆసక్తి కనబర్చిన విద్యార్థులను బాగా ప్రోత్సహిస్తాం. – మోహన్‌రాజు, ప్రిన్సిపల్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, సంజీవపురం. -
'అయినా.. ఎవరెస్ట్ ఎక్కి తీరుతా.. '
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లి భూకంపంలో చిక్కుకున్న పర్వతా రోహకురాలు నీలిమ శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. భూకంపం సృష్టించిన విధ్వంసంతో నేపాల్ సహా ఇతర ప్రాంతాలు అతులాకుతలమైయిన సంగతి తెలిసిందే. అయితే భూకంపం వచ్చిన సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లిన 3++ బృందం చిక్కుకుంది. ఈ బృందంలో ఒకరైన పర్వతరోహకురాలు నీలిమ ఆరు రోజుల తరువాత సురక్షితంగా ఢిల్లీకి చేరింది. ఈ సందర్భంగా ఆమె ఎవరెస్ట్ అధిరోహణ సమయంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వెల్లడించింది. భూకంపం వచ్చినప్పుడు ఎవరెస్టుపై 4,700 అడుగుల ఎత్తులో ఉన్నామని చెప్పింది. భూకంప ధాటికి తాము చేరుకోవాల్సిన బేస్ క్యాంప్ ధ్వంసమైపోయినట్టు తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున మంచు చెరియలు విరిగిపడ్డాయని చెప్పింది. అయితే అదృష్టం కొద్ది తాము బేస్ క్యాంప్‌కు కొద్ది దూరంలో ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డామని తెలిపింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎవరెస్ట్ నుంచి కిందికి దిగామని పేర్కొంది. చివరికి అక్కడి ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది తమను కాఠ్మాండ్కు చేర్చారని నీలిమ తెలిపింది. అంతేకాకుండా భూకంప విధ్వంసం కళ్లార చూసినప్పటికి ఎవరెస్ట్ ఎక్కాలని ఆశ ఇంకా ఉందంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రాణం అనేది ఎక్కడున్నా పోతుంది.. ఈసారి ఎవరెస్ట్ ఎక్కి తీరుతా.. నా సాహస యాత్రను కొనసాగిస్తా' అంటూ పర్వతారోహకురాలు నీలిమ తన దృఢ నిశ్చయాన్ని వెల్లడించింది. -
ఎవరెస్ట్‌పై మన లెక్క తప్పు
లండన్: ప్రపంచంలోకెల్లా ఎతై్తనది ఎవరెస్ట్ పర్వతమని, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోందని, చంద్రుడికి ఆవలివైపు చీకటి ఉంటుందని, చంద్రుడి పైనుంచి చైనా వాల్ కనిపిస్తుందని, పొద్దు తిరిగుడు పూవు సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుందని, ఊసరవెల్లి పరిసరాలకు అనుగుణంగా రంగులు మారుస్తుందని, గబ్బిలాలకు కళ్లుండవని....ఎవరు చెప్పినా నమ్మేస్తాం. కాదంటే కసురుకుంటాం. కానీ ఇవన్నీ మన భ్రమలని, మన ముందువాళ్లు చెబుతూ వచ్చిన మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల మనలోనూ ఇలాంటి అభిప్రాయాలు బలంగా నాటుకుపోయాయని ‘బిలీఫ్ ఇట్ ఆర్ నాట్’ కాలం కింద ‘రిప్లీస్ డాట్ కామ్’ వీటన్నింటిని శాస్త్రీయంగా విశ్లేషించింది. ఎవరెస్ట్ పర్వతం: ప్రపంచంలోకెల్లా ఎతై్తన పర్వతం ఎవరెస్ట్ అని అధికారికంగా ప్రపంచమే గుర్తించింది. అయితే సాంకేతికంగా పరిశీలిస్తే దానికన్నా అమెరికా హవాయి దీవిలోని మౌనా కియా పర్వతమే ఎతై్తనదని జియాలజిస్టులే నిరూపించారు. సముద్ర మట్టంతో పోలిస్తే ఎవరెస్ట్ పర్వతం 8,850 మీటర్లు ఉంటుంది. బేస్‌ను ప్రామాణికంగా తీసుకుంటే మౌనా కియా పర్వతం ఎత్తు 13,796 మీటర్లు. దీని బేస్ సముద్ర జలాల్లోకి చొచ్చుకుపోయి ఉంటుంది. ఊసరవెల్లి: ఉష్ణోగ్రత, కమ్యూనికేషన్, వెలుతురు, మూడ్స్ కారణంగానే ఊసరవెల్లి రంగులు మారుస్తుంది. పరిసరాలతో సంబంధం లేదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా : చంద్రుడి పైనుంచి చైనా గోడ కనిపించదని, భూమే తెల్లటి, నీలి రంగు మార్బుల్స్లా కనిపిస్తుందని అపోలో వ్యోమగాములు ధ్రువీకరించారు. చంద్రుడికి ఆవల చీకటి: చంద్రడుకి ఆవల చీకటి ఉండదు. భూమిలాగే అది తన అక్షంలో తిరుగుతుంది. భూమిలాగానే దానికి అన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రిగా వుంటింది. సూర్యుడి చుట్టూ భూమి: సాంకేతికంగా ఆలోచిస్తే సూర్యుడి చుట్టూ భూమి తిరగదు. మొత్తం సౌర కుటుంబమే అంతరిక్ష ద్రవ్యరాశిలో తన అక్షంలో తిరుగుతుంది కనుక మనకు సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భ్రమ కలుగుతుంది. బైబిల్లో ఆపిల్: ఈడెన్ గార్డెన్లో నిషేధిత ఫలం ఆపిల్ అని బైబిల్ ఎక్కడా పేర్కొనలేదు. తినకూడదని హెచ్చరించిన ఫలం అని మాత్రమే ఉంటుంది. ఫలం అంటే ఫలం కాదని, మంచి చెడుల విశ్లేషణకు ప్రతీకగా మాత్రమే ఫలం అన్నారనే వాదనలు కూడా ఉన్నాయి. పొద్దు తిరుగుడు పూవు: సూర్య భ్రమణంబట్టి పొద్దు తిరుగుడు పూవు తిరగదు. మొగ్గ దశలో మాత్రమే అది సూర్యుడి వైపు నిలుస్తుంది. పూవు వికసించాక పొద్దుతో సంబంధం లేకుండా ఒకే దిక్కులో ఉంటుంది. గబ్బిలాలకు కళ్లు: గబ్బిలాలకు చిన్ని కళ్లు ఉంటాయి. చీకటిలో అవి ప్రకంపనల ఆధారంగా సంచరిస్తాయి కనుక వాటికి కళ్లు ఉండవని భావిస్తూ వచ్చారు. బుల్‌ఫైట్: ఎర్ర గుడ్డలను చూస్తే దున్నపోతులు రెచ్చిపోతాయన్నది కూడా అబద్ధం. ఎందుకంటే తెలుపు, నీలి రంగులు మినహా మిగతా రంగులను గుర్తించే శక్తి వాటికి లేవు. బుల్ ఫైట్ సందర్భంగా చుట్టూ జనంచేసే కోలాహలం, ఎదురుగా ఓ మనిషి రెచ్చగొడుతుండడం వల్ల అవి చిర్రెత్తుకొచ్చి అలా రెచ్చిపోయి ప్రవర్తిస్తాయట. టమోట: అంటే కూరగాయనుకుంటాం. కానీ ఇది పండు జాతికి చెందింది. మెదడు: మెదడులో మనం కేవలం పది శాతాన్ని మాత్రమే ఉపయోగిస్తాం అని చెబుతారు చాలామంది. ఇది కూడా తప్పే. మెదడులోని అన్ని భాగాలను పనిచేయిస్తాం. అలా జరగకపోతే శరీరంలోని ఏదో భాగం పని చేయకుండా పోతుంది. మెదడును మనం ఎలా ఉపయోగిస్తామన్న అంశాన్నిబట్టి మనిషి తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. -
ఎవరెస్ట్‌పై స్వచ్ఛభారత్
న్యూఢిల్లీ: హిమాలయాల్లోకెల్లా అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతి పర్వతారోహకుడి స్వప్నం. దశాబ్దాలుగా ఈ శిఖరాన్ని ఎంతోమంది అధిరోహించారు. ఈ క్రమంలో వీరు తీసుకెళ్లిన ప్లాస్టిక్ కవర్లు, నీళ్ల సీసాలు, ఇతరత్రా చెత్త ఈ మంచు శిఖరంపై పేరుకుపోతూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ను స్ఫూర్తిగా తీసుకున్న భారత సైనికులు ఇప్పుడీ చెత్తను కిందకుతెచ్చే కార్యక్రమం చేపట్టారు. 8,848 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరంపైకి మేజర్ రణ్‌బీర్‌సింగ్ సారథ్యంలోని బృందం శనివారం నేపాల్‌వైపు నుంచి బయలుదేరింది. ఎవరెస్ట్ పర్వత సానువుల్లో పేరుకుపోయిన నాలుగు వేల కిలోల చెత్తను పోగేసి... కిందకు తేనున్నారు. -
ఎవరెస్టు అధిరోహించనున్న విశాఖ బాలిక
విశాఖపట్నం: పిన్న వయసులోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికి సంకల్పించింది విశాఖపట్నానికి చెందిన 12 ఏళ్ల జాహ్నవి. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని (8,848 మీటర్లు) అధిరోహించడంతో పాటు మిగతా ఆరు శిఖరాలనూ ఎక్కేందుకు సాధన చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 2న హిమాచల్‌ప్రదేశ్ లడఖ్ ప్రాంతంలోని లే మౌంటైన్ (20,080 అడుగులు) ఎక్కడంతో పాటు ప్రపంచంలో ఏడు శిఖరాలపైనా పాదం మోపేందుకు అక్కడ 15 రోజులు శిక్షణ పొందనుంది. అనంతరం ప్రపంచంలో ఎత్తయిన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారో (5,895 మీటర్లు) సెప్టెంబర్‌లో తొలిసారిగా అధిరోహించనుంది. తరువాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించనుంది. ఈ వివరాలను ఆమె తండ్రి డాక్టర్ కృష్ణారావు సోమవారం విశాఖపట్నంలో విలేకరులకు చెప్పారు. -
ఆనందం.. ఉద్విగ్నం
అతని సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నబోయింది..మంచుకొండల మీద ఆయన వేసిన ఒక్కో అడుగు భారతఖ్యాతిని, భద్రాద్రి ప్రతిష్టను ప్రపంచనలుమూలలా చాటింది..ఎముకలు కొరికే చలికి స్పర్శ కోల్పోయిన శరీరం లక్ష్యం గుర్తొచ్చినప్పుడల్లా శక్తిని కూడగట్టి అడుగుముందుకు వేయించింది. అడ్వాన్స్బేసిక్ క్యాంప్ మొదలు ఒక్కో క్యాంప్ దాటుతున్నప్పుడు ఆనందంతో అతని మనసు ఉప్పొంగింది. చివరి దశలో పెద్దపెద్ద లోయలు..ఏమాత్రం పట్టుతప్పినా ప్రాణాలకు ముప్పు.. అక్కడే శవాల కుప్పలు..అయినా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా మరో విజేత పూర్ణతో కలిసి ఆనంద్‌కుమార్ ముందుకెళ్లారు. ఎవరెస్ట్ శిఖరాధిరోహణలో చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన సాధనపల్లి ఆనంద్‌కుమార్‌కు ఎన్నెన్నో ఒడిదొడుకులు. మొక్కవోని ఆత్మవిశ్వాసం..‘విజయమో వీరస్వర్గమోనన్న’ పట్టుదల..లక్ష్య ‘సాధనే’ ధ్యేయంగా సాగిన ఆ ప్రస్థానంతో 46 రోజుల కఠోర శ్రమ ఫలించింది..తనపై నమ్మకం ఉంచిన వారి ఆశలు..ఆశయాలు నెరవేరుతున్నాయన్న ‘ఆనందం’ ముందు బాధలన్నీ దూరమయ్యాయంటున్న ‘ఎవరెస్ట్’ విజేత మనోగతం... భద్రాచలం టౌన్: ‘భూ భాగానికి 8,848 మీటర్ల ఎత్తున, మైనస్ 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో అత్యంత ఎత్తై శిఖరం ఎవరెస్టును అధిరోహించగానే ఐఏఎస్ ప్రవీణ్‌కుమార్ సార్‌కు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా శిఖరాన్ని అధిరోహిస్తామని చెప్పిన మాటలు మదిలో మెదిలాయి. ఆనందంతో గుండె నిండిపోయింది.’ అని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సాధనపల్లి ఆనంద్‌కుమార్ తెలిపారు. శిఖరం ఎక్కిన తరువాత తొలిసారి జన్మస్థలానికి వచ్చిన ఆయన అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. అలా నా జీవన గమనం మారింది.. ‘నా జీవితంలో కీలక మలుపు అంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జాయిన్ కావటమే. ఆరో తరగతి వరకు మా స్వగ్రామం చర్ల మండలం కలివేరులోనే చదువుకున్నాను. అప్పటి వరకు చదువు అంతంతమాత్రంగా సాగింది. మా నాన్న (ఏడుకొండలు) నన్ను రెసిడెన్షియల్ పాఠశాలలో చదవించాలని అనుకున్నారు. దీనికి ఆర్. కొత్తగూడెంకు చెందిన ఇందుల బుచ్చిబాబు సహకరించారు. చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతిలో చేరాను. మొన్న ఇంటర్ ప్రథమ సంవత్సరం కూడా అక్కడే పూర్తి చేశాను. ఆటలంటే నాకు ఎంతో ఇష్టం. అన్ని ఆటల్లో ప్రవేశం ఉంది. కళాశాల స్పోర్ట్స్ చాంపియన్‌ను కూడా. బహుషా శిఖర అధిరోహనకు కావాల్సిన శక్తిసామర్థ్యం, పట్టుదల ఆటల వల్లే అలువడి ఉంటుంది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయాలని ఆ శాఖ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ నిర్ణయించుకున్నారు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చేసింది. 2013లో నల్లగొండ జిల్లా భువనగిరిలో రాక్‌క్లైంబింగ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆ శిబిరానికి మా కళాశాల నుంచి నాతోపాటు మరొకరిని పంపారు. మొత్తం ఈ శిక్షణకు 110 మంది హాజరయ్యారు. దానిలో 20 మందిని ఎంపిక చేశారు. అందులో నేనొక్కన్ని. ఆ 20 మందికి అర్జున అవార్డు గ్రహీత, ఎవరెస్టు శిఖర అధిరోహకుడు శేఖర్‌బాబు, పరమేశ్వరరెడ్డి శిక్షణ ఇచ్చారు. శేఖర్‌బాబు ఇచ్చిన అనేక సలహాలు, సూచనలు మాకెంతగానే ఉపయోగపడ్డాయి. అప్పటి వరకు ఎవరెస్టు ఎక్కిన వారి వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను చూపించి మమ్మల్ని ఉత్తేజపర్చారు. ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా ఎవరెస్టు విజేతగా నిలవాలని...అప్పటి నుంచి వారి మార్గదర్శకత్వంలో ముందుకెళ్లా. వారి సూచనలను తూ.చ తప్పకుండా పాటించా విజేతనయ్యా. సర్దుకుపోయే తత్వమే నా ఎంపికకు కారణమేమో.. పరిస్థితులను బట్టి నడుచుకోవడం నాకు చిన్ననాటి నుంచి అలవాటు. మారుమూల ప్రాంతం, అదీ పేదరికంలో జన్మించడం..కష్టనష్టాలను ఎదుర్కోవడం వల్లనేమో నాకు సర్దుకుపోయే మనస్థత్వం అలువడింది. నాకున్న ఆ లక్షణమే మా శిక్షకులను మెప్పించి ఉండొచ్చు. నన్ను సెలెక్ట్ చేయడానికి అదే కారణమై ఉంటుందని నా అభిప్రాయం. భువనగిరిలో శిక్షణ తరువాత డార్జిలింగ్, సిక్కిం, హిమాలయ పర్వతాలు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎవరెస్టు వాతావరణం అలవాటయ్యేలా మాకు తర్ఫీదు నిచ్చారు. ఇక్కడ మైనస్ 20 డిగ్రీల చలిలో శిక్షణ తీసుకున్నాం. ఇవన్నీ అయ్యాక 20 మందిలో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ శిక్షణ ఇచ్చారు. మొత్తం నాలుగుదశల శిక్షణ. దానిలో ఇద్దరం నిలిచాం. శిక్షణలో భాగంగా చల్లదనాన్ని తట్టుకోవడం, ధరించాల్సిన దుస్తులు, తీసుకోవాల్సిన ఆహారం, ఆక్సిజన్ తదితర వాటిపై క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. రోజుకు 30 కిలోమీటర్లు జాగింగ్, యోగాసనాలను ప్రాక్టీస్ చేయించారు. ఫైనల్‌గా తొమ్మిది మందిలో నేను, నిజామాబాద్‌కు చెందిన పూర్ణ సెలెక్ట్ అయ్యాం. ఆ తర్వాత కళాశాలకు వచ్చాం. ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి తిరిగి వెళ్లాం. స్పర్శ లేదు.. శక్తి కోల్పోయాం.. మంచు ప్రభావంతో శరీరానికి స్పర్శలేకుండా పోయింది. ఒట్లో సత్తువకూడా లేదు. అయినా పట్టుదలతో ముందుకుపోయాం. ఏప్రిల్ 6న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాం. ఢిల్లీ, నేపాల్‌లోని ఖాట్మాండ్ మీదుగా చైనా వరకు బస్సులో వెళ్లాం. అడ్వాన్స్బేసిక్ క్యాంప్‌గా భావించే 6,400 మీటర్ల వరకు భారతీయఫుడ్ను తీసుకుంటూ వెళ్లాం. అక్కడి నుంచి ప్యాకింగ్ఫుడ్ను తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఫుడ్‌ను నీటిలో వేడిచేసి తినాల్సి వచ్చేది. కష్టంగా ఉన్నా ఆ ఫుడ్‌ను తీసుకున్నాం. అక్కడి నుంచి క్యాంప్ 1- 7,100 మీటర్లు, క్యాంప్ 2- 7,700, క్యాంప్ 3 -8,300 మీటర్లను దాటుకుంటూ ముందుకు వెళ్లాం. మైనస్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే ఉండటంతో శరీరానికి స్పర్శ లేకుండా పోయింది. ఒంట్లో సత్తువ లేదు. చనిపోయినా ఫర్వాలేదనుకుంటూ ముందుకెళ్లాం. బస్తాలు మోయడం వల్లనేమో.. బరువు అనిపించలేదు.. పాఠశాలలో చదివే రోజుల్లో సెలవుల్లో కలివేరులో పనులకు వెళ్లే వాడిని. ధాన్యం బస్తాలు మోయటం, తాపీ పనులు చేయటం వంటివి చేసేవాణ్ని. దీనివల్లనేమో 20 కేజీల బరువుండే బ్యాగ్ పర్వతారోహణలో ఎప్పుడూ వీపుపై ఉన్నా పెద్దభారం అనిపించేది కాదు. ఈ బ్యాగ్‌లో రెండు ఆక్సిజన్ సిలిండర్లు, జాకెట్స్, జ్యూస్, చాక్లెట్స్ తదితర సామగ్రి ఉండేది. ఇంతబరువును వీపుపై ఉంచుకొని పగలంతా ప్రయాణించేవాళ్లం. రాత్రి ళ్లు నిద్రపట్టేది కాదు. నిద్రపోయే కొద్ది సమయం లో మాత్రమే ఆ బ్యాగ్‌ను తీసి కిందపెట్టేవాళ్లం. శవాలను దాటివెళ్లాం.. చివరి దశలో చాలా కష్టమనిపించింది. తల్లిదండ్రులు, మాపై నమ్మకం ఉంచి డబ్బులు ఖర్చుపెట్టిన సార్లు, శిక్షకులు గుర్తొచ్చారు. 8,300 అడుగులు దాటాక పెద్దపెద్ద లోయలు ఉండేవి. వాటిని దాటేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయినట్టే. ఆ సమయంలో అక్కడ చాలా శవాలు కనిపించాయి. వాటిని చూసినప్పుడు గుండెనిబ్బరం కోల్పోకూడదనుకున్నాం. మనోధైర్యంతో ముందుకెళ్లాం. తొలి అడుగు ఓ మధుర క్షణం చివరిగా 8,848 మీటర్లు దాటి ఎవరెస్టు శిఖరంపై తొలి అడుగువేసిన ఆ క్షణం...నా జీవితంలో మర్చిపోలేనిది. ఆ మధుర క్షణం కోసం ఇన్నిరోజులు నాకు తోడ్పడిన నా తల్లిదండ్రులు, మా కళాశాల ప్రిన్సిపాల్ శివనారాయణ, పీడీ, అధ్యాపకులు, ప్రవీణ్‌కుమార్ సార్, శిక్షకులు శేఖర్, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరూ నా కళ్ల ముందు కదలాడారు. వారందరికీ నా విజయాన్ని అంకితమిస్తూ అక్కడ జాతీయ, తెలంగాణ జెండాలను ఉంచాం. అంబేద్కర్, ఎస్ఆర్ శంకర్ల ఫొటోలను పెట్టాం. స్పార్సో జెండాను పాతం. భారతదేశం, భద్రాచలం ఖ్యాతిని మరోమారు ప్రపంచశిఖరంపై రెపరెపలాడించటం నాకు గర్వంగా అనిపించింది. కృషి ఉంటే.. కృషి, పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదు. దీనికి నా జీవితమే నిదర్శనం. అతి పేద కుటుంబం నుంచి వచ్చిన నేను..నేడు పదిమందికి ఆదర్శంగా నిలిచాను. మాపై నమ్మకం ఉంచి కోట్లు ఖర్చుపెట్టిన అధికారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రమించాం.నాలాంటి పేదలు ఎంతో మంది ఉన్నారు. వారికి చేయూత నందిస్తే విజేతలుగా నిలుస్తారు. పేదవారికి, అట్టడుగు వర్గాల వారికి సాయం, మార్గదర్శకత్వం అందించేలా నేను ఉండాలనేది నా అభిమతం. ఐపీఎస్ సాధనే లక్ష్యం.. ఐపీఎస్‌ను సాధించడమే నా లక్ష్యం. మా స్వగ్రామానికి వెళ్లి వస్తా. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుపై దృష్టి పెడతా. ఉన్నతచదువులు చదివి ఐపీఎస్ సాధిస్తా. ఆ తర్వాత నా జిల్లా, మండలం, గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలనేదే నా లక్ష్యం. ఆ దిశగా నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్నందర్ని వేడుకుంటున్నా. -
భారతీయుడిగా గర్వపడుతున్నా
భద్రాచలం టౌన్: కష్టసాధ్యమైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినందుకు భారతీయుడిగా గర్వపడుతున్నానని సాధనపల్లి ఆనంద్‌కుమార్ అన్నాడు. ప్రపంచంలో ఎత్తై శిఖరాన్ని అధిరోహించి పలువురి ప్రశంసలు అందుకున్న ఆనంద్‌కుమార్ తన తల్లిదండ్రులతో గురువారం రాత్రి భద్రాచలం చేరుకున్నాడు. ఈ సందర్భంగా విద్యావేత్తలు, ప్రముఖులు, బంధువులు ఆనంద్‌కుమార్‌కు ఘనస్వాగతం పలికారు. భద్రాచలం ఎంఈవో మాధవరావు, పాల్‌రాజ్ ఇంజనీరింగ్ చైర్మన్ అబ్రహం పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ..... భారత దేశ జెండాతో పాటు, తెలంగాణ రాష్ట్ర జెండాను ఎవరెస్టు శిఖరంపై పాతటంతోనే తన గుండె ఉద్వేగంతో నిండిపోయిందని తెలిపాడు. తన విజయంతో భద్రాచలానికి ఖ్యాతి లభించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. పేదరికం దేనికి అడ్డుకాదని, ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పట్టుదల, క్రమశిక్షణతో కష్టపడితే విజయం వరిస్తుందని ఈ యాత్ర ద్వారా తెలిసిందని పేర్కొన్నాడు. తన విజయం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. భద్రాచలం వచ్చిన ఆనంద్‌కుమార్‌కు స్వాగతం పలికిన వారిలో కరుణానిధి, జెట్టి రంజిత్‌కుమార్, సాధనపల్లి సతీష్, దాసరి శేఖర్ తదితరులు ఉన్నారు. కాగా, శుక్రవారం ఆనంద్‌కుమార్‌కు ఆర్డీవోతో పాటు, పలువురు సన్మాన, అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. -
చిన్న వయసులోనే పెద్దలక్ష్యాన్ని సాధించారు: ప్రధాని
తెలుగు తేజాలకు ప్రధాని అభినందన సాక్షి, న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లను శుక్రవారం ప్రధాని మోడీ అభినందించారు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని సాధించారని వారిని ప్రశంసించారు. ప్రధాని నివాసమైన రేస్‌కోర్సులో శుక్రవారం పూర్ణ, ఆనంద్‌లు నరేంద్రమోడీని కలశారు. శుభాకాంక్షలు తెలిపిన మోడీ.. భారత ఖ్యాతిని ఇనుమడింపజేశారంటూ వారిని అభినందనలతో ముంచెత్తారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వీరికి ఎవరెస్టు ఎక్కేందుకు సహకరించిన వారి వివరాలను పూర్ణ, ఆనంద్‌ల నుంచి తెలుసుకున్న ప్రధాని ముగ్ధుడైనట్లు కోచ్ శేఖర్‌బాబు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మోడీ వారిద్దరినీ ఆశీర్వదించారని ప్రధానమంత్రి కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది. -
ఆదర్శంగా నిలిచారు: రాహుల్‌గాంధీ
ఎవరెస్ట్ విజేతలను ప్రశంసించిన రాహుల్‌గాంధీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఎవరెస్ట్‌ను అధిరోహించి దిగ్విజయంగా తిరిగొచ్చిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లు గురువారమిక్కడ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని సాధించి దేశంలోని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారితో కలసి ఫొటోలు దిగారు. అనంతరం పూర్ణ, ఆనంద్‌లు కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. వారిని మంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. వారిద్దరికి రూ.11,001ల చెక్‌ను అందజేశారు. ఇదిలా ఉండగా పూర్ణ, ఆనంద్‌లను ఆల్ ఇండియా దళిత్ ఫెడరేషన్, ఏపీభవన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీభవన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఏపీభవన్‌లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీలు కె.కేశవరావు, దత్తాత్రేయ, రాపోలు ఆనంద్ భాస్కర్, జాతీయ సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్, ఆయా సంఘాల నేతలు ఆనంద్‌రావు, లింగరాజులు పాల్గొన్నారు. విజేతలకు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి రూ.10వేల చెక్ అందించారు. 8న హైదరాబాద్‌కు ఎవరెస్టు వీరులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డును సృష్టించిన మాలావత్ పూర్ణ(13), ఆనంద్(18)లు ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ అధికారి కె.వెంకటేశ్వర్లు, ఫిజికల్ డెరైక్టర్ బద్రినాథ్ తెలిపారు. వారిద్దరికి ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.