ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టు ఎత్తు పెరిగినట్టు కనిపిస్తోందని చెబుతున్నాయి కొన్ని సర్వేలు. కానీ ఈ విషయంపై నేపాల్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మారిన ఎవరెస్టు ఎత్తుని నేపాల్ త్వరలోనే చైనాతో కలిసి సంయుక్త ప్రకటించనుంది. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఎవరెస్టు కొత్త ఎత్తుని ప్రకటించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖకు అంగీకారం లభించింది. 2015 భూకంపం తర్వాత ఎత్తు మారి ఉంటుందన్న సందేహాల నడుమ నేపాల్ ప్రభుత్వం 2017లో ఎవరెస్టు ఎత్తును కొలిచే ప్రక్రియ ప్రారంభించింది. తమ సొంత వనరుల మేరకు ఎవరెస్టు ఎత్తు కొలవడం పూర్తయిందని, మరికొన్ని రోజుల్లో అధికారికంగా వెల్లడిస్తామని నేపాల్ ‘భూ నిర్వహణ మంత్రి’ పద్మ కుమారి తెలిపారు.
సంయుక్త ప్రకటన ఎందుకు?
అధికారిక గణాంకాల ప్రకారం (1954లో భారత్ చేపట్టిన సర్వే ఆధారంగా) ఎవరెస్టు ఎత్తు 8,848 మీటర్లు(29,029 అడుగులు). అయితే ఈ విషయంలో చైనా, నేపాల్ మధ్య ఎప్పటినుంచో అభిప్రాయ భేదాలున్నాయి. ఎవరెస్టుకు ఉత్తర దిశలో ఉన్న టిబెట్ వైపు నుంచి శిఖరం ఎత్తుని లెక్కగట్టిన చైనా, 2015లో ఏకపక్షంగా కేవలం రాతి ఎత్తునే పరిగణలోకి తీసుకుని శిఖరం ఎత్తు 8844.04 మీటర్లుగా ప్రకటించింది. రాతి ఎత్తుతో పాటు మంచుపొర ఎత్తుని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నది నేపాల్ వాదన. గతేడాది అక్టోబరులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా మంచుపొర ఎత్తుని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న నేపాల్ ప్రతిపాదనకు చైనా అంగీకరించింది. ఆ సమయంలోనే మారిన ఎవరెస్టు ఎత్తుని సంయుక్తంగా ప్రకటించాలని ఈ ఇరు దేశాలూ ఒప్పందం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment