'అయినా.. ఎవరెస్ట్ ఎక్కి తీరుతా.. '
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లి భూకంపంలో చిక్కుకున్న పర్వతా రోహకురాలు నీలిమ శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. భూకంపం సృష్టించిన విధ్వంసంతో నేపాల్ సహా ఇతర ప్రాంతాలు అతులాకుతలమైయిన సంగతి తెలిసిందే. అయితే భూకంపం వచ్చిన సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లిన 3++ బృందం చిక్కుకుంది. ఈ బృందంలో ఒకరైన పర్వతరోహకురాలు నీలిమ ఆరు రోజుల తరువాత సురక్షితంగా ఢిల్లీకి చేరింది. ఈ సందర్భంగా ఆమె ఎవరెస్ట్ అధిరోహణ సమయంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వెల్లడించింది. భూకంపం వచ్చినప్పుడు ఎవరెస్టుపై 4,700 అడుగుల ఎత్తులో ఉన్నామని చెప్పింది.
భూకంప ధాటికి తాము చేరుకోవాల్సిన బేస్ క్యాంప్ ధ్వంసమైపోయినట్టు తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున మంచు చెరియలు విరిగిపడ్డాయని చెప్పింది. అయితే అదృష్టం కొద్ది తాము బేస్ క్యాంప్కు కొద్ది దూరంలో ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డామని తెలిపింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎవరెస్ట్ నుంచి కిందికి దిగామని పేర్కొంది. చివరికి అక్కడి ఎయిర్ఫోర్స్ సిబ్బంది తమను కాఠ్మాండ్కు చేర్చారని నీలిమ తెలిపింది. అంతేకాకుండా భూకంప విధ్వంసం కళ్లార చూసినప్పటికి ఎవరెస్ట్ ఎక్కాలని ఆశ ఇంకా ఉందంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రాణం అనేది ఎక్కడున్నా పోతుంది.. ఈసారి ఎవరెస్ట్ ఎక్కి తీరుతా.. నా సాహస యాత్రను కొనసాగిస్తా' అంటూ పర్వతారోహకురాలు నీలిమ తన దృఢ నిశ్చయాన్ని వెల్లడించింది.