ఎవరెస్టుని అధిరోహించిన విద్యార్థి
సంజీవపురం(ఓబులవారిపల్లె): మండలంలోని సంజీవపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన గానుగపెంట హరిప్రసాద్ పట్టుదలతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. పెనగలూరు మండలం సింగిరెడ్డిపల్లె ఎస్సీకాలనీలోని పేద కుటుంబమైన గానుగపెంట నరసయ్య, యల్లమ్మల కుమారుడు హరిప్రసాద్. తల్లిదండ్రులు కూలిపనులు చేసుకుంటూ కుమారుడిని చదివిస్తున్నారు. 22వ తేదీ తెల్లవారుజామున ఎంతో కష్టతరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన హరిప్రసాద్ కన్నతల్లిదండ్రులకే కాకుండా అతను చదువుతున్న గురుకుల పాఠశాలకు, జిల్లాకు పేరు తీసుకువచ్చాడు.
సంజీవపురం సాంఘిక గురుకుల పాఠశాలలో 3వ తరగతిలో అతను ప్రవేశం పొందాడు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో వేయికి 759 మార్కులు సాధించి చదువులో కూడా రాణించాడు. పర్వతారోహణపై మక్కువ పెంచుకున్న హరిప్రసాద్ పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విజయవాడ సమీపంలోని కేధరకొండ, పశ్చిమగోదావరి జిల్లా పెద్దరేగిపల్లె, నేపాల్‌లోని ఖాట్మాండ్‌లో శిక్షణను పొందాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో ఎవరెస్టు శిఖరం అధిరోహించేందుకు అర్హత సాధించాడు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల అనంతరం పర్వతారోహణకు బయలుదేరాడు. కాగా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి మొత్తం 13మంది ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపికయ్యారు. ఈ బృందం ఏప్రిల్ 11వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి బయలుదేరి వెళ్లింది. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి వారు 22తేదీన తెల్లవారుజామున 3.30కు ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుని మనదేశ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరానికి:
పేద కుటుంబానికి చెందిన హరిప్రసాద్ తల్లి యల్లమ్మ, తండ్రి నరసయ్యల ప్రోత్సాహంతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. పర్వతారోహణపై మక్కువ ఉండటంతో ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడంతో సాంఘిక సంక్షేమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తంచేస్తున్నాం. హరిప్రసాద్‌లాగే మున్ముందు ఆసక్తి కనబర్చిన విద్యార్థులను బాగా ప్రోత్సహిస్తాం.
– మోహన్‌రాజు, ప్రిన్సిపల్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, సంజీవపురం.