ఆనంద్ కుమార్‌రెడ్డి, కొత్త బాబు
బంజారాహిల్స్ (హైదరాబాద్): తనతో పాటు మరో తొమ్మిది మంది డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతి విషయంపై మాట్లాడేందుకే ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కలిసేందుకు ఆమె క్వార్టర్‌కు వెళ్లినట్లు మేడ్చల్ జిల్లా పౌర సరఫరాల శాఖ మాజీ డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి శనివారం పోలీస్ కస్టడీలో వెల్లడించారు. సర్వీస్ మ్యాటర్ డిస్కస్ చేసేందుకే ఆమె ఇంటికి వెళ్లానని చెప్పిన ఆనంద్‌కుమార్, అర్ధరాత్రి ఎందుకు వెళ్లావని పోలీసులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1999లో గ్రూప్–2కు సెలెక్ట్ అయిన మొత్తం 26 మంది అభ్యర్థుల పోస్టింగ్‌లు కోర్టు వివాదంతో రద్దయ్యాయి. అయితే 2018లో కోర్టు జోక్యంతో వారందరికీ డిప్యూటీ తహసీల్దార్లుగా పోస్టింగ్‌లురాగా, ఇందులో 16 మందిని ఏపీకి కేటాయించారు. మిగతా పది మందికి తెలంగాణలో పోస్టింగ్‌లురాగా అందులో ఆనంద్‌కుమార్ కూడా ఒకరు. ఏపీలో 16 మందికి తహసీల్దార్లుగా ప్రమోషన్లు రాగా తెలంగాణలో మాత్రం నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా డీటీలుగానే ఉన్నామని, ఈ విషయం పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆనంద్ కుమార్ వెల్లడించినట్లు తెలుస్తోంది.
సీఎంవోలో కీలక బాధ్యతల్లో ఉన్న స్మితా సబర్వాల్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తే సీఎంతో మాట్లాడి న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే కలవడానికి వెళ్ళినట్లుగా చెప్పాడు. అయితే ఆమెను కలవడానికి క్వార్టర్‌కు వెళ్లడం ఒక తప్పయితే, అర్ధరాత్రి వెళ్లడం మరో తప్పని పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆనంద్ కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేసిన విషయం కూడా విదితమే. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నీలోఫర్ చాయ్ తాగుదామని తనను మేడ్చల్‌నుంచి తీసుకొచ్చాడని స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లే విషయం తనకు తెలియదని, తనను అనవసరంగా ఇందులో ఇరికించాడని మరో నిందితుడు కొత్త బాబు కస్టడీలో పోలీసులకు వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment