Deputy tahsildar
-
సర్వీస్ మ్యాటర్ మాట్లాడేందుకే వెళ్లాను..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తనతో పాటు మరో తొమ్మిది మంది డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతి విషయంపై మాట్లాడేందుకే ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కలిసేందుకు ఆమె క్వార్టర్‌కు వెళ్లినట్లు మేడ్చల్ జిల్లా పౌర సరఫరాల శాఖ మాజీ డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి శనివారం పోలీస్ కస్టడీలో వెల్లడించారు. సర్వీస్ మ్యాటర్ డిస్కస్ చేసేందుకే ఆమె ఇంటికి వెళ్లానని చెప్పిన ఆనంద్‌కుమార్, అర్ధరాత్రి ఎందుకు వెళ్లావని పోలీసులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో గ్రూప్–2కు సెలెక్ట్ అయిన మొత్తం 26 మంది అభ్యర్థుల పోస్టింగ్‌లు కోర్టు వివాదంతో రద్దయ్యాయి. అయితే 2018లో కోర్టు జోక్యంతో వారందరికీ డిప్యూటీ తహసీల్దార్లుగా పోస్టింగ్లురాగా, ఇందులో 16 మందిని ఏపీకి కేటాయించారు. మిగతా పది మందికి తెలంగాణలో పోస్టింగ్లురాగా అందులో ఆనంద్‌కుమార్ కూడా ఒకరు. ఏపీలో 16 మందికి తహసీల్దార్లుగా ప్రమోషన్లు రాగా తెలంగాణలో మాత్రం నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా డీటీలుగానే ఉన్నామని, ఈ విషయం పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆనంద్ కుమార్ వెల్లడించినట్లు తెలుస్తోంది. సీఎంవోలో కీలక బాధ్యతల్లో ఉన్న స్మితా సబర్వాల్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తే సీఎంతో మాట్లాడి న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే కలవడానికి వెళ్ళినట్లుగా చెప్పాడు. అయితే ఆమెను కలవడానికి క్వార్టర్‌కు వెళ్లడం ఒక తప్పయితే, అర్ధరాత్రి వెళ్లడం మరో తప్పని పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆనంద్ కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేసిన విషయం కూడా విదితమే. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నీలోఫర్ చాయ్ తాగుదామని తనను మేడ్చల్‌నుంచి తీసుకొచ్చాడని స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లే విషయం తనకు తెలియదని, తనను అనవసరంగా ఇందులో ఇరికించాడని మరో నిందితుడు కొత్త బాబు కస్టడీలో పోలీసులకు వెల్లడించాడు. -
Smita Sabharwal: నెల క్రితమే నిందితుడి రెక్కీ.. ప్లజెంట్ వ్యాలీలో కరువైన నిఘా
బంజారాహిల్స్: తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి గురువారం అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్ కుమార్‌రెడ్డి చొరబడిన వ్యవ హారంలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు నెల క్రితమే యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో ఉన్న ప్లజెంట్ వ్యాలీలో స్మితా సబర్వాల్ ఇంటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆ రోజు ఇంట్లో ఆమె లేకపోవడంతో తిరిగి వెళ్ళినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో నిందితుడు బాబును జూబ్లీహిల్స్ వైపు వెళ్ళొద్దామంటూ తీసుకొచ్చిన నిందితుడు స్మితా సబ ర్వాల్ ఇంటిదాకా తీసుకొచ్చి ఆయనను కూడా ఈ కేసులో అడ్డంగా ఇరికించినట్లయింది. ఇదిలా ఉండగా బాబు బయట కారులో కూర్చోగా నిందితుడు ఆనంద్ కుమార్ రెడ్డి నేరుగా ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. కారులో కూర్చున్న బాబు బయటికి దిగి తన సెల్ఫోన్లో అక్కడి క్వార్టర్లు అ న్నింటిని దర్జాగా వీడియో తీస్తున్నా ఏ ఒక్కరూ గుర్తించలేకపోయారు. సీసీ కెమెరాలు ఉండవా..?: స్మితా సబర్వాల్ ఉంటున్న ప్లజెంట్ వ్యాలీలో మొత్తం 23 క్వార్టర్స్ ఉన్నాయి. ఆమెది బి–11వ నెంబర్‌క్వార్టర్. తెలంగాణకు చెందిన ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ క్వార్టర్లలో ఉంటున్నారు. అయితే ప్రధాన గేటు వద్ద జూబ్లీహిల్స్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఒకటి మాత్రమే రోడ్డు వైపు పని చేస్తోంది. లోనికి వెళ్ళిన తర్వాత ఒక్క కెమెరా కూడా లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం నిందితుడికి సంబంధించిన రాకపోకలకు దృష్టిపెట్టిన పోలీసులు నిఘా నేత్రాల కోసం ఆరా తీయగా ఒక్క చోట కూడా వాటి జాడ లేకుండా పోయింది. కమ్యూనిటీ పోలీసింగ్, నేనుసైతం అంటూ బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసే అధికార యంత్రాంగానికి తాము ఉంటున్న ప్రాంతంలో మాత్రం ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన లేకుండా పోయింది. ఈ క్వార్టర్లలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారన్నది కూడా నిఘా గాలికి వదిలేసినట్లుగా గత మూడు రోజుల నుంచి పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఎవరిని కదిపితే ఏం సమస్యలొస్తాయోనని ఇక్కడి నిఘా విషయంలో పోలీసులు నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా ఈ క్వార్టర్స్ వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా నిందితుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ సస్పెన్షన్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌కుమార్‌రెడ్డిపై వేటు పడింది. జిల్లా పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న ఆనంద్‌కు మార్రెడ్డిని సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనుజా చంచల్‌గూడ జైలులో నిందితుడు ఆనంద్‌కుమార్‌రెడ్డికి సోమవారం సిబ్బంది ద్వారా సస్పెన్షన్ ఉత్తర్వులను అందజేశారు. -
స్మితా సబర్వాల్ ఇంట్లో చొరబడిన నిందితుడిపై అనుమానాలు
బంజారాహిల్స్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవిలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి గురు వారం రాత్రి అనుమానాస్పదంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితుడు బాబుతో కలిసి రాత్రి 11.34 గంటలకు ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆనంద్ అక్కడినుంచి ‘ఎట్ యువర్ డోర్ స్టెప్’అంటూ ట్వీట్ చేశాడు. ఆమె నివాసముంటున్న ప్లాట్ యూసుఫ్‌గూడ పోలీసు లైన్స్‌లోని ప్లెజెంట్ వాలీ గేటెడ్ కమ్యూనిటీలో. అంతేకాకుండా 24 గంటలు పోలీసు సెక్యూరిటీ ఉంటుంది. ఇంత బందోబస్తు ఉన్న ప్లాట్‌లోకి అంత ధీమాతో ఎలా వెళ్లాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడా లేక మానసిక స్థితి కోల్పోయాడా అన్నది తేలాల్సి ఉంది. నిందితుడు పక్కాప్లాన్‌తోనే వచ్చినట్లుగా తెలుస్తోంది. స్నేహితుడిని బయట కారులో ఉంచి ఆనంద్ మాత్రమే లోనికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగం విషయం మాట్లాడాలంటే పగలు రావాలిగానీ రాత్రి ఎందుకు వచ్చారు అన్నది అర్థం కావడం లేదు. మరోవైపు నిందితుడు విద్యావంతుడు. ఎమ్మెస్సీ మ్యాథ్స్, లా, జర్నలిజం చదివి న్యూఢిల్లీలో వార్త పత్రిక కరస్పాండెంట్‌గా, దక్కన్ క్రానికల్ ఆసియా ఏజ్ పత్రిక జర్నలిస్ట్‌గా, సూర్య పత్రిక న్యూఢిల్లీ జర్నలిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఇంత కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఈయన ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి ఆ విధంగా వెళ్లడం విడ్డూరంగా ఉంది. ఏదేమైనా నిందితులను కస్టడీలోకి తీసుకుంటేనే పూర్తి వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా స్మితా సబర్వాల్ ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పోలీసుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. చదవండి: తొలుత ఎస్ఏలు.. తర్వాత ఎస్జీటీలు -
భయానక పరిస్థితిని ఎదుర్కొన్నా
సాక్షి, హైదరాబాద్: ‘నా ఇంట్లో ఒక అగంతకుడు చొరబడటంతో గత రాత్రి అత్యంత భయానక పరిస్థితిని ఎదుర్కొన్నా. అప్రమత్తతతో ఉండటంతో నా ప్రాణాలను రక్షించుకోగలిగాను’అని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎంత సురక్షితంగా ఉన్నామనే భావనలో ఉన్నా.. ప్రతిసారీ తలుపులు, గడియలను స్వయంగా మనమే సరిచూసుకోవాలి’అన్న పాఠాన్ని ఈ ఘటన నేర్పిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఇంట్లో అర్ధరాత్రి వేళలో చొరబడిన ఓ డిప్యూటీ తహశీల్దార్‌తో పాటు అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించిన విషయం తెలిసిందే. -
మహిళా పోలీసుకు డిప్యూటీ తహసీల్దార్ లైంగిక వేధింపులు
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ఊటీలో మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఊటీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబు (35) డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సాయంగా ఓ మహిళా పోలీసు సహా ఇద్దరు పోలీసులను కేటాయించారు. మగ కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేయమని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళా పోలీసును డిప్యూటీ తహసీల్దారు లైంగిక వేధించినట్లు తెలిసింది. ఆమె దీనిని ఖండించారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో బాధితురాలు ఊటీలో ని మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు డిప్యూటీ తహసీల్దారును అరెస్టు చేశారు. చదవండిః ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు -
డిప్యూటీ తహసీల్దార్ బలవన్మరణం
బనగానపల్లె రూరల్: ఉరి వేసుకుని డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. డోన్ పట్టణానికి చెందిన సురేంద్ర(35)కు బనగానపల్లె పట్టణం రాంభూపాల్ నగర్‌కు చెందిన రంగనాయకులు కూతురు జగదీశ్వరితో వివాహమైంది. సురేంద్ర నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా, జగదీశ్వరి కోవెలకుంట్ల సెబ్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ బనగానపల్లెలోని రాంభూపాల్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి రుత్విక్, ఆదిత్య అనే ఇద్దరు చిన్నారులు సంతానం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేంద్ర రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని ఆదివారం ఇంటికి వచ్చారు. ఉదయం భార్య డ్యూటీకి వెళ్లగా తనకు ఒంట్లో నలతగా ఉందని ఇంట్లోనే ఉండిపోయారు. కార్తీక సోమవారం కావడంతో పిల్లలిద్దరినీ మామ(జగదీశ్వరి తండ్రి) రవ్వల కొండకు తీసుకెళ్లాడు. ఒంటరిగా ఉన్న సురేంద్ర ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రండ్యూటీ నుంచి వచ్చిన భార్య తలుపులు తీయగా భర్త ఫ్యాన్‌కు వేలాడుతుండటం చూసి బోరున విలపించింది. కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్‌బాజ్‌పేయి, తహసీల్దార్ ఆల్ఫ్రెడ్ ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. -
చోడవరం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని చోడవరం తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం బయటపడింది. భూమి మార్పిడి పేరిట నాలుగు లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఏసీబికి అడ్డంగా దొరికొపోయారు. వీరికి సహకరించిన డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. చోడవరం సమీపంలోని నరసాపురం వద్ద ఓ వ్యవసాయ భూమిని నివాసభూమి గా మార్చేందుకు ఓ వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ పనులు చేయకుండా ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది జాప్యం చేశారు. ఈ దశలో దరఖాస్తుదారుడు ఎమ్మార్వో రవికుమార్‌తో పాటు డిప్యూటీ తాసిల్దారు రాజాను కలిసి భూముల రికార్డుల మార్పిడి చేయాలని కోరాడు. ఈ పని పూర్తి చేయాలంటే నాలుగున్నర లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తాసిల్దారు డ్రైవర్ రమేష్ కు ఇవ్వాలని తెలిపారు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సదరు వ్యక్తి వారి సూచనల మేరకు డ్రైవర్ రమేష్‌కు నాలుగున్నర లక్షల రూపాయలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వారి ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్ర పర్యవేక్షణలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. -
'ఇది రేషన్ దుకాణమా.. బూత్ బంగ్లానా..?'
నారాయణపేట: నారాయణపేట జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ రేషన్ డీలర్ల ఆలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నుంచి జూన్ నెలకు సంబంధించి ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం అయింది. దీంతో ఆయన ఆదివారం జిల్లాలోని మరికల్, సమీప గ్రామాల్లో ఉన్న రేషన్ దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీలర్లు నిర్వహిస్తున్న రేషన్ కేంద్రాలు బూజు, చెత్త చెదారంతో ఉండడం చూసి .. '' బాబు ఇది రేషన్ దుకాణమా.. లేక బూత్ బంగ్లానా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. దుకాణాల నిర్వహణ విషయం లో అలసత్వం ఏమాత్రం ఉపెక్షించేది లేదన్నారు. మాట వినక పోతే వేటు తప్పదని హెచ్చరించారు. నిత్యం ఎంతో మంది ప్రజలకు నిత్యావసర సరుకులను అందించే చౌక దుకాణాల ను అపరిశుభ్ర వాతావరణం లో నడపడం డీలర్లకు భావ్యం కాదని స్పష్టం చేశారు. సూక్ష్మ విషయాలే కొన్ని సందర్భాల్లో ప్రధాన అంశాలుగా పరిగణించాల్సి వస్తుందని, అందుకే డీలర్లు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకునే ఆలోచన చేయకూడదని స్పష్టం చేశారు. -
కోవిడ్ భయంతో పిస్టల్‌తో కాల్చుకుని..
బనశంకరి: కోవిడ్ భయంతో ఓ విశ్రాంత ఉద్యోగి పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కర్ణాటకలో జరిగింది. రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా బీలేనహళ్లి తండాకు చెందిన సోమానాయక్ (72) డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది. శ్వాస సమస్య పెరగడంతో ఆందోళన ఎక్కువైంది. దీంతో సోమవారం డెత్‌నోట్ రాసి తోటలో కారులో కూర్చుని పిస్టల్‌తో షూట్ చేసుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. నా కారణంగా ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ డెత్‌నోట్‌లో రాసి ఉంది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కర్ణాటకలో మహిళల దైన్యం.. పోలీసుస్టేషన్లకు క్యూ) -
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్: బాంబులు పేల్చి సంబరాలు
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లా వేంసూర్ తహశీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ రైతు నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్‌లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. సత్తుపల్లికు చెందిన తోట సాంబశివరావు అనే రైతు తనకు వేంసూర్ మండలంలో ఉన్న 25 ఎకరాల వ్యవసాయ భూమికి సంభందించి సర్వే నిమిత్తం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సర్వే చేయటం కోసం వేంసూర్ సర్వేయర్ గుర్వేశ్, డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్‌లు దరఖాస్తుదారుడిని రెండు లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. లక్షన్నరకు బేరం కుదరటంతో నేడు తహశీల్దార్ కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తోట సత్యనారాయణ అనే రైతు పిర్యాదు మేరకు తహశీల్దార్ కార్యాలయంపై దాడి చేసిన అధికారులు లంచం తీసుకుంటున్న ఉపేందర్, సర్వేయర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా డిప్యూటీ తహసీల్దార్ సహా సర్వేయర్ అడ్డంగా బుక్కయ్యారని తెలియడంతో పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. అవినీతి అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: లంచం అడిగే.. అడ్డంగా దొరికిపాయే.. జైలు నుంచి వచ్చి, రహస్యంగా పెళ్లిచేసుకున్న హీరోయిన్ -
ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప
గరిడేపల్లి : ఏసీబీ అధికారుల దాడులతో గరిడేపల్లి రెవెన్యూ కార్యాలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఒక రైతు నుంచి లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్, కార్యాలయంలో పని చేస్తున్న ఒక ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాలిలా.. మండలంలోని కుతుబ్షాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్యకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన రికార్డులు మార్చి రెవెన్యూ సిబ్బంది పట్టా చేశారు. లింగయ్య బతుకు దెరువు కోసం వెళ్లి కొంతకాలంగా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో నివాసం ఉంటున్నాడు. గత ఏడు సంవత్సరాలుగా కుతుబ్షాపురంలో ఉన్న భూమిని గుడుగుంట్ల వెంకయ్య అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. అయితే రెండేళ్లుగా కౌలు ఇవ్వటం లేదని లింగయ్య తెలిపాడు. కుతుబ్షాపురానికి చెందిన కొంతమంది భూమి పట్టా మార్చుకున్నారని లింగయ్యకు తెలిసింది. దీంతో లింగయ్య గరిడేపల్లిలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాడు. తన పేరు మీద ఉన్న సర్వే నంబర్ 399లోని భూమిని తన అక్క లక్ష్మి, వెంకయ్యల పేరు మీద పట్టా అయినట్లు రికార్డుల్లో ఉండడంతో అవాక్కయ్యాడు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ వద్దకు వెళ్లి అడగగా రూ.20వేల లంచం ఇస్తే నీ పేరు మీద పట్టా ఇస్తానని చెప్పినట్లు బాధితుడు లింగయ్య తెలిపాడు. తన వద్ద డబ్బులు లేవని, పేద వ్యక్తినని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో 1980 నుంచి ఉన్న పాత పహాణీలు ఇవ్వాలని డీటీని కోరినట్లు తెలిపాడు. పహాణీలకు కూడా రూ.15వేల లంచం ఇస్తేనే అందజేస్తానని డీటీ చెప్పటంతో రూ.8వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. లింగయ్య సోమవారం డబ్బులు తీసుకుని కార్యాలయానికి వెళ్లగా అక్కడ పని చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి పయిడిమర్రి ప్రకాశంకు ఇవ్వాలని డీటీ సూచించాడు. రూ.8వేలు పయిడిమర్రి ప్రకాశానికి అప్పజెప్పగానే పహాణీలు ఇచ్చాడు. అదే సమయంలో అక్కడే కాచుకునివున్న ఏసీబీ అధికారులు ప్రకాశంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కాగా కార్యాలయానికి వచ్చిన రైతుల సమస్యలను ఏసీబీ అధికారులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ నల్లగొండ రేంజ్ అధికారి ఏపీ ఆనంద్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ బండారు సత్యనారాయణ సూచన మేరకు కార్యాలయంలో పని చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి ప్రకాశం కుతుబ్షాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్య అనే రైతు నుంచి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా అవినీతికి పాల్పడినా, లంచం అడిగినా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్, సీఐ రఘుబాబు, వెంకటరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
చిప్పాడ భూదందాలో మరో వికెట్
సాక్షి, విశాఖపట్నం: రికార్డులు టాంపర్ చేసి..వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జారాయుళ్ల పరం చేసిన భీమిలి మాజీ డిప్యూటీ తహసీల్దార్, ప్రస్తుత ఏపీఐఐసీ డీటీ జి.రాజాశ్రీధర్ను భీమిలి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. క్రైం నెం.151/17 కింద అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. భీమిలి మండలం చిప్పాడ గ్రామంలోని సర్వే నెం.184/6, 184/8, 163/1సీ, 159/3, 94లలో సుమారు 156.95 ఎకరాల మన్సాస్ ట్రస్ట్, ప్రభుత్వ భూములకు అప్పటి తహసీల్దార్ బీటీవీ రామారావుతో కలిసి నంబూరి నారాయణరాజు కుటుంబ సభ్యుల పేరిట పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీలో డీటీ రాజా శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. దాంతోపాటే రామారావు తన మామ పేరిట 1.58 ఎకరాలకు, రాజా శ్రీధర్ తన అత్త ఎన్.కళావతి పేరిట 1.39 ఎకరాల ప్రభుత్వ భూమికి స్వయంగా పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కూడా జారీ చేసేశారు. నంబూరితో కలిసి పాత రికార్డుల్లో కొన్నింటిని ధ్వంసం చేయడం. మరికొన్నింటిని టాంపరింగ్ చేయడంలో కూడా రామారావు, రాజా శ్రీధర్లే కీలక సూత్రదారులుగా పోలీసులు గుర్తించారు. స్టాంప్ డ్యూటీని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం కల్గించారు. ఇప్పటికే ఈ కేసులో బీటీవీ రామారావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు సిట్ కస్టడీలో తీసుకొని రామారావును విచారించింది. అప్పట్లో రామారావుతో పాటు ఇదే మండలంలో పనిచేసి పలు అక్రమాలకు పాల్పడిన రాజా శ్రీధర్‌ను సోమవారం అరెస్ట్ చేశారు. 250 అర్జీలు పరిష్కారం కాగా ఇప్పటి వరకు తమ పరిధిలోకి వచ్చిన 337 అర్జీల్లో 250 అర్జీలను పరిష్కరించినట్టు సిట్ వర్గాలు ప్రకటించాయి. సిట్ పరిధిలోకి రాని వాటిలో 1700 అర్జీలను పరిగణనలోకి తీసుకుని ఆయా శాఖలు, మండలాలకు రిఫర్ చేయగా.. ఇప్పటి వరకు 1230 అర్జీలకు సంబంధించి సిట్‌కు రిపోర్టులు వచ్చాయి. వీటిలో 645 అర్జీలను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్టు సిట్ ప్రకటించింది. 66 ఎన్‌వోసీల్లో ఇప్పటివరకు 12 ఎన్వోసీలపైనే దర్యాప్తు పూర్తిచేశారు. మిగిలిన వాటిలో సగానికిపైగా దర్యాప్తు కొలిక్కి వచ్చినప్పటికీ నేరతీవ్రతపై ప్రాధమికంగా సిట్ నిర్ధారణకు రాలేకపోతోంది. నాలుగైదు దశాబ్దాల నాటి రికార్డులను లోతుగా అధ్యయనం చేయాల్సి రావడంతో ఆశించినంత వేగంగా దర్యాప్తు జరగడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే కనీసం మరో నెల రోజులపాటు గడువు పొడిగించాలని ప్రభుత్వానికి సిట్ చీఫ్ లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పొడిగించిన గడువు అధికారికంగా ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. దర్యాప్తు ప్రారంభమైన తేదీని పరిగణనలోకి తీసుకుంటే 28వ తేదీ వరకు ఉంది. ఈలోగా ఎన్వోసీలపై దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశాలు లేనందున మరికొంత గడువు కావాలని కోరినట్టు చెబుతున్నారు. ఇంకా దొరకని నంబూరి ఆచూకీ కాగా ఈ కేసులో చిప్పాడ గ్రామంలోని సర్వే నెం. 184/8లో 58 ఎకరాలు, సర్వే నెం.163/1సీలో ఎకరా మన్సాస్ భూములను నంబూరి నారాయణరాజు తన కుటుంబ సభ్యుల పేరిట పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. అలాగే అన్నవరం గ్రామ సర్వే నెం.78లో 30 ఎకరాలు, సర్వే నెం.159/3లో 7.95 ఎకరాలు, సర్వే నెం.94లో 26 ఎకరాలను తమ పేరిట రాయించుకున్న నారాయణరాజు కుటుంబం మొత్తం పరారీలోనే ఉంది. వీరి ఆచూకీ తెలపాలంటూ ఈ నెల మూడో తేదీన పోలీసులు ప్రకటన కూడా జారీ చేశారు. కాగా అదే రోజు నారాయణరాజు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందడంతో కావాలనే పోలీసులు ఆచూకీ నాటకం ఆడారన్న విమర్శలు విన్పించాయి. -
ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ తమశీల్దార్..
► రూ.1.30 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి ► భూసేకరణ డబ్బులిచ్చేందుకు రూ.2 లక్షలు డిమాండ్ హన్మకొండ అర్బన్: రెవెన్యూశాఖలో అవినీతి మరో సారి కట్టలు తెంచుకుంది. ఎన్‌హెచ్ భూసేకరణలో భూమి కోల్పోయిన వారి కి పరిహారం అందించేందుకు రూ.2లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ.1.30 లక్షలు తీసుకుంటూ వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ టి.శ్రీనివాస్‌గౌడ్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, బాధితుడు మధుసూదన్‌రెడ్డి కథనం ప్రకారం.. హన్మకొండ జులైవాడకు చెందిన రిటైర్డ్ ఎస్సై సీహెచ్ మధుసూదన్‌రెడ్డి 2010లో స్టేషన్ ఘన్పూర్ వద్ద ఎన్‌హెచ్–163 పక్కన 464 చదరపు అడుగుల స్థలం కొన్నారు. ఆ స్థలం తన కూతురు స్వాతి పేరుతో రిజిస్టర్ చేయిం చారు. ఈ భూమిలో కొంత మేరకు రోడ్డు విస్తరణలో పోయింది. ఈ భూమి ని ప్రభుత్వం సేకరించినందుకు బాధితులకు పరిహారం చెల్లించాలి. ఈ మేరకు బాధితులకు రూ.7.11లక్షలు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం ఇవ్వడానికి వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయంలోని డీటీ టి.శ్రీని వాస్‌గౌడ్ రూ.2లక్షలు డిమాండ్ చేశారు. ముందు లంచం ఇస్తేనే ఫైల్ మీద సంతకం చేయించి ఇస్తామని చెప్పాడు. దీంతో లంచం ఇచ్చుకోలేక బాధితులు గత నెల 30న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అంతేకాకుండా బాధితులు కలెక్టర్‌కు, జేసీకి ఫిర్యాదుచేశారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల బృందం గురువారం సాయంత్రం సు మారు 7 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.1.30 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో సీఐలు రా ఘవేందర్రావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. జిల్లాలో ఇదే రికార్డు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసీబీ దాడుల్లో ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడడంలో ఇదే రికార్డు. గతంలో కలెక్టరేట్లో పట్టుబడ్డ డీపీఓ రూ. 1లక్ష తీసుకుంటూ పట్టుబడ్డారు. తొమ్మిది నెలలుగా వేధించారు.. మా భూమికి పరిహారం ఇచ్చే విషయంలో సుమారు తొమ్మిది నెలలుగా మమ్మల్ని వేధించారు. ప్రతిరోజు ఉదయం రావడం సాయంత్రం వరకు ఇక్కడే ఉండటం నాకు డ్యూటీగా అయింది. పరిహారం ఇవ్వాలంటే రూ.2లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.1.50 లక్షలకు ఒప్పుకున్నారు. ఆర్డీఓ ఆఫీస్‌కు తిరిగే క్రమంలో నాకు యాక్సిడెంట్ కూడా అయింది. వేధింపులు భరించలేక ఏసీబీకి ఫిర్యాదు చేశా. – మధుసూదన్‌రెడ్డి , బాధితుడు -
డిప్యూటీ తహశీల్దార్ డిలైట్‌ఫుల్ కెరీర్‌కు పునాది..
డిప్యూటీ తహశీల్దార్ (డీటీ).. గ్రూప్-2 ఔత్సాహికుల్లో అత్యంత క్రేజీ పోస్టు! గ్రూప్-2 నోటిఫికేషన్ అనగానే.. డీటీ ఖాళీలు ఎన్ని ఉన్నాయంటూ అభ్యర్థులు వాకబు చేస్తారు. ఇవి తక్కువగా ఉంటే నిరాశకు గురవుతారు. ఒకవైపు టీఎస్పీఎస్సీ గ్రూప్-2దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఏపీపీఎస్సీ నుంచి త్వరలో నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశముంది. ఈ క్రమంలో డిప్యూటీ తహశీల్దార్ కెరీర్ గ్రాఫ్‌పై విశ్లేషణ.. రెవెన్యూ శాఖలో కీలకమైన పోస్టు.. డిప్యూటీ తహశీల్దార్. మండల స్థాయిలో మండల రెవెన్యూ అధికారులు (తహశీల్దార్లు) క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తే.. డిప్యూటీ తహశీల్దార్లు రెవెన్యూ కార్యాలయ బాధ్యతలు చూస్తారు. తహశీల్ కార్యాలయంలో రోజువారీ పరిపాలన విధులు, ఫైల్ ప్రొసీడింగ్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విధులు నిర్వహిస్తారు. ఫైళ్లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే విషయంలో తహశీల్దార్లకు తమ పరిశీలనలతో కూడిన ప్రతిపాదనలు అందిస్తారు. వాటి ఆధారంగా తహశీల్దార్లు తుది నిర్ణయం తీసుకుంటారు. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ డిప్యూటీ తహశీల్దార్లుగా ఎంపికైన అభ్యర్థులు.. ముందుగా ప్రొబేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో మొత్తం మూడేళ్ల వ్యవధిలో కంటిన్యూగా రెండేళ్ల సర్వీస్ తప్పనిసరి. ప్రొబేషన్ సమయంలో చూపిన పనితీరు ఆధారంగా సర్వీస్ ఖ రారు అవుతుంది. పనితీరు ఆధారంగా ప్రొబేషన్‌ను పొడిగించే విధానం సైతం అమలవుతోంది. ప్రొబేషన్ సమయంలో క్షేత్ర స్థాయిలోనూ విధులు నిర్వర్తించాలి. తర్వాత హోదా తహశీల్దార్ డిప్యూటీ తహశీల్దార్‌గా ప్రొబేషన్ పూర్తిచేసి సర్వీస్ ఖరారు చేసుకున్న తర్వాత సీనియార్టీ ఆధారంగా తహశీల్దార్ (మండల రెవెన్యూ అధికారి- ఎంఆర్వో)గా పదోన్నతి లభిస్తుంది. ఈ హోదాలో మండలంలోని అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో కొన్ని వివాదాల పరిష్కారానికి తహశీల్దార్లకు మెజిస్టీరియల్ అధికారాలు కూడా ఉంటాయి. మండల స్థాయిలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వీఆర్ఏ నుంచి డిప్యూటీ తహశీల్దార్ల వరకు పలు సూచనలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ సర్వీస్ రూల్స్ ప్రకారం- దాదాపు 50 రకాల విధులను నిర్వర్తించాల్సిన కీలకమైన హోదా తహశీల్దార్. కొన్ని సందర్భాల్లో డిప్యూటీ కలెక్టర్/ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా పని చేయాలి. ఎంఆర్వో టు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్వో తర్వాత లభించే పదోన్నతి డిప్యూటీ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. డివిజన్లోని అన్ని శాఖలను సమన్వయం చేయడం, డివిజన్ పరిధిలోని మండల స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం, జిల్లా కలెక్టర్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరపడం వంటివి డిప్యూటీ కలెక్టర్ ప్రధాన విధులు. ఫస్ట్‌క్లాస్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దిశగా చర్యలు తీసుకునే అధికారం డిప్యూటీ కలెక్టర్‌కు ఉంటుంది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో కనీసం ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేస్తే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా లభిస్తుంది. ఇది డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ హోదాకు సమానం. ఈ హోదాలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌కు పరిపాలన పరమైన విధుల్లో సహకరించాల్సి ఉంటుంది. ప్రధానంగా కలెక్టర్ కార్యాలయంలో రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, సిబ్బంది పర్యవేక్షణ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ - పరిశీలన, వాటికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతారు. వీటి ఆధారంగా సంబంధిత దరఖాస్తులు, ఆయా శాఖలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల కాలంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను కొన్ని ప్రత్యేక ప్రాజెక్టుల పర్యవేక్షణకు స్వతంత్ర హోదాలో నియమిస్తున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాజెక్టులకు అవసరమయ్యే భూ సేకరణ, పర్యవేక్షణకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నియామకం జరుగుతోంది. ఎస్డీసీ టు జేసీ-2 ప్రస్తుతం రెవెన్యూ పరిపాలన విభాగంలో జిల్లా స్థాయిలో జేసీ-2 (జాయింట్ కలెక్టర్-2) అనే కొత్త హోదాకు రూపకల్పన చేశారు. ఈ హోదాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను లేదా దానికి సమానంగా భావించే జిల్లా రెవెన్యూ అధికారుల (డీఆర్వో)ను నియమిస్తారు. వీరు ప్రధానంగా పౌర సరఫరాలు, ప్రొటోకాల్, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పర్యవేక్షణ వంటి విధులను నిర్వర్తిస్తారు. డీటీ నుంచి జేసీ-2 వరకు డిప్యూటీ తహశీల్దార్‌గా కెరీర్‌ను ప్రారంభించే అభ్యర్థులు భవిష్యత్తులో జాయింట్ కలెక్టర్-2 హోదా వరకు పదోన్నతి సాధించే అవకాశాలున్నాయి. ఒక స్థాయి నుంచి.. పై స్థాయికి ప్రమోషన్ ఇచ్చే క్రమంలో నిర్దిష్టంగా సర్వీస్ నిబంధనలు, సీనియారిటీ ప్రాతిపదిక లేకపోయినా.. జాయింట్ కలెక్టర్-2 వరకు చేరుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. డిప్యూటీ తహశీల్దార్లు భవిష్యత్తులో పదోన్నతులు పొందాలంటే.. సర్వీస్ కమిషన్లు ఆరు నెలలకోసారి నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్‌ల్లో ఉత్తీర్ణత సాధించాలి. అలా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ప్రమోషన్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. అలాగని డిపార్ట్మెంట్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన ప్రమోషన్ వస్తుందని భావించకూడదు. పదోన్నతి ఇచ్చేందుకు ఇది ఒక ప్రాతిపదిక మాత్రమే. తాజా గ్రాడ్యుయేట్లు.. కన్‌ఫెర్డ్ ఐఏఎస్! ఇప్పుడే డిగ్రీ పూర్తి చేసుకొని 21 లేదా 22 ఏళ్ల వయసులో డిప్యూటీ తహశీల్దార్ పోస్ట్ సొంతం చేసుకున్న అభ్యర్థులు.. భవిష్యత్తులో కన్‌ఫెర్డ్ ఐఏఎస్ హోదా సైతం అందుకునే అవకాశముంది. కన్‌ఫెర్డ్ ఐఏఎస్‌గా ఎంపికయ్యేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం- డిప్యూటీ కలెక్టర్ హోదాలో కనీసం ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తిచేసుండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే సంవత్సరంలో జనవరి 1 నాటికి 52 ఏళ్ల వయసు దాటకూడదు. ఈ రెండు అర్హతలున్న వారు ముందుగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జీఏడీకి దరఖాస్తు చేసుకోవాలి. జీఏడీ ఆ దరఖాస్తులను పరిశీలించి సర్వీస్ రికార్డ్, డిప్యూటీ తహశీల్దార్‌గా ఎంపికైనప్పటి నుంచి జీఏడీకి దరఖాస్తు చేసుకునే రోజు వరకు చూపిన పనితీరును పరిశీలిస్తుంది. దాని ఆధారంగా అర్హుల జాబితాను రూపొందిస్తుంది. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు పంపిస్తారు. ఆ తర్వాత కమిషన్.. జాబితాలోని వ్యక్తులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారిని కన్‌ఫెర్డ్ ఐఏఎస్ హోదాకు అర్హులని పేర్కొంటుంది. అంటే.. డిప్యూటీ తహశీల్దార్‌గా కెరీర్ ప్రారంభించిన అభ్యర్థులు అత్యుత్తమ పనితీరు కనబరిస్తే 52 నుంచి 53 ఏళ్ల వయసు వచ్చే నాటికి కన్‌ఫెర్డ్ ఐఏఎస్ హోదా సొంతం చేసుకుని, జాయింట్ కలెక్టర్ స్థాయిలో సైతం విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కన్‌ఫెర్డ్ ఐఏఎస్ లభించాక ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా మారుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం ఉండటం రెవెన్యూ శాఖలోని ప్రత్యేకత. కానీ, అతి కొద్ది మంది వల్ల అధిక శాతం ప్రజల్లో ‘అవినీతి’ ఎక్కువ అనే దురభిప్రాయం నెలకొంది. ఈ సర్వీసులో కొత్తగా అడుగుపెట్టాలనుకునే అభ్యర్థులు సేవా దృక్పథంతో ముందుకెళ్లాలి. సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా, అన్ని వర్గాల శ్రేయస్సుకు కృషి చేసేలా విధులు నిర్వర్తించాలి. - బి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహశీల్దార్, ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్. -
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్
కామారెడ్డి (నిజామాబాద్) : రేషన్ డీలర్ నుంచి లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. మండలంలోని లింగాయపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ పెద్దిరాములు రేషన్ సరుకుల రిలీజ్ ఆర్డర్ కోసం డిప్యూటీ తహశీల్దార్ జి. బాలయ్యను సంప్రదించాడు. అయితే ఆయన అందుకు రూ. 2 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రేషన్ డీలర్ ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు. -
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్
చెన్నూర్ (ఆదిలాబాద్) : వీఆర్వో నుంచి లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి వీఆర్వో భూమన్నకు సంబంధించిన ఎల్టీసీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాలంటూ కొద్ది రోజులుగా ఆయన డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్‌ను కోరుతున్నారు. అయితే రూ.5 వేలు లంచం ఇస్తేనే పని అవుతుందని ఆయన మెలిక పెట్టాడు. దీనిపై భూమన్న ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో మండల రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వో నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
డిప్యూటీ తహశీల్దార్ల బదిలీ
- 46 మందికి స్థాన భ్రంశం - జేసీ వివేక్‌యాదవ్ ఉత్తర్వులు జారీ గుంటూరు ఈస్ట్: జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్ యాదవ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 46 మంది డిప్యూటీ తహశీల్దారులకు స్థాన చలనం కలిగింది. బుధవారం 58 మంది తహశీల్దార్ల బదిలీలు, తాజాగా డిప్యూటీ తహశీల్దార్ల బదిలీలు కూడా తెలుగుదేశం పార్టీ నేతల కనుసన్నల్లో జరిగాయనే ఆరోపణలు వినిపించాయి. -
రూ.8.29లక్షలు పట్టివేత
జన్నారం, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో తనిఖీ చేస్తున్న అధికారులు శనివారం పెద్దమొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లీడర్, డెప్యూటీ తహశీల్దార్ జాడి రాజలింగం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ఐచర్ వ్యాన్‌ను ఇందన్పల్లి చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయగా మంథనికి చెందిన డ్రైవర్ మారిశెట్టి కుమార్ వద్ద రూ.3,84,205 లభించాయి. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయ గా డ్రైవర్ నాంపెల్లి ఓదెలు వద్ద రూ.3,44,860 లభించాయి. వీరిని ప్రశ్నించగా ఆదిలాబాద్‌లోని జగదాంబ జిన్నింగ్ మిల్లులో పత్తి అమ్మి డబ్బులు తెస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ నుంచి పెద్దపెల్లికి వెళ్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయగా.. ప్రయాణికుడు సాగర్, సంతోష్‌ల వద్ద రూ.లక్ష లభించాయి. వారు కూడా పత్తి విక్రయించి డబ్బు తెస్తున్నట్లు తెలిపారు. ఆధారాలు చూపిస్తే డబ్బు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై బుద్దే స్వామి, ఏఆర్ ఎస్సై ఉత్తం, కానిస్టేబుల్ అశోక్, టీం సభ్యులు ఆత్రం రవీందర్, రాకేశ్, భూమాచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు.